విధాత : సంక్రాంతి పండుగ సందర్బంగా కొత్త అల్లుళ్లకు రాచ మర్యాదలు చేయడం ఏపీలోని గోదావరి జిల్లాల్లో గొప్ప ఆనవాయితీగా కొనసాగిస్తుంటారు. అయితే ఈ సారి గోదావరి జిల్లాలకే పోటీగా తెనాలి అత్తింటి వారు సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన అల్లుడికి 158 రకాల వంటకాలతో అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.
గోదారోళ్లకు తీసిపోం…
విశేషం ఏమిటంటే.. గోదావరి జిల్లాకు చెందిన అల్లుడికి తెనాలి అత్తింటి వారు 158 రకాల వంటలతో సంక్రాంతి విందు ఏర్పాటు చేసి గోదారోళ్లకు మేం ఏ మాత్రం తీసిపోము అంటూ చాటి చెప్పారు. తెనాలికి చెందిన వ్యాపారి వందనపు మురళీకృష్ణ, మాధవీలత దంపతులు తమ కుమార్తె మౌనికను రాజమహేంద్రవరానికి చెందిన శ్రీదత్తకు ఇచ్చి గతేడాది వివాహం చేశారు. పెళ్లయిన తర్వాత తొలి సంక్రాంతికి అత్తింటికి వచ్చిన అల్లుడికి మర్యాదలు చేయాలని భావించి మహా విందు ఏర్పాటు చేశారు. అత్తింటి వారు ఇచ్చిన అరుదైన అద్బుత అతిధ్యానికి కొత్త అల్లుడు ఫిదా అయిపోయాడు. విందులో వడ్డించిన వంటకాలను రుచి చూడటంలో అవస్థలు పడినా..తనకు అత్తింటి వారి నుంచి లభించిన మర్యాద పట్ల ఆనందవ వ్యక్తం చేశాడు.
