- మంత్రి సురేఖ లేకుండానే!
- ఇద్దరు మంత్రుల మేడారం పర్యటన
- పొంగులేటి, సురేఖ తీరుపై తీవ్ర చర్చ
- మరోసారి బహిరంగమైన విభేదాలు
- అభివృద్ధి పై మంత్రుల విభేదాల ప్రభావం
- ఆ మాటకొస్తే అడ్లూరి సైతం ఆబ్సెంట్
- రూ.251 కోట్లతో మేడారం మాస్టర్ ప్లాన్
విధాత, ప్రత్యేక ప్రతినిధి: మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మధ్య విభేదాలున్నాయనే అంశం సుస్పష్టమైంది. మంత్రి సురేఖ లేకుండానే సోమవారం ఇద్దరు మంత్రులు పొంగులేటి, సీతక్క మేడారంలో పర్యటించడం తీవ్ర చర్చకు దారితీసింది. సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయశాఖ పై సమీక్ష నిర్వహించడం గమనార్హం. కొద్ది రోజులుగా పొంగులేటికి, కొండాకు మధ్య విభేదాలు నెలకొన్నాయి.
తాజాగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న మేడారం పనులకు సంబంధించిన రూ.71కోట్ల టెండర్ వ్యవహారంలో సురేఖకు సంబంధం లేకుండా పొంగులేటి తనకు అనుకూల వ్యక్తికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో మంత్రులు పొంగులేటి, సురేఖ మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయనే వార్తలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో మంత్రులు పొంగులేటి, సీతక్కలు సహచర మంత్రి సురేఖ లేకుండానే మేడారం పర్యటించడం ఇప్పుడు రకరకాల చర్చలకు తావిస్తోంది. తాజా పరిణామాలు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీతోపాటు, ప్రజల్లో కలకలం రేపుతున్నాయి.
మంత్రుల తీరు పై విమర్శలు
ఒక మంత్రివర్గంలో భాగస్వామ్యమైన మంత్రులు కలిసికట్టుగా సాగాల్సి ఉండగా ఎడమొఖం-పెడమొఖంగా వ్యవహరిస్తే ఎలా ముందుకు సాగుతారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రికి, జిల్లా మంత్రికి మధ్య పొసగకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠ, కాంగ్రెస్ పార్టీ పరువు సంగతి పక్కన పెడితే ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ఈ తీరు విఘాతం కల్పిస్తుందంటున్నారు. ఈ విభేదాల ప్రభావం జిల్లాపై పడుతుందని ఆందోళన నెలకొంది.
పార్టీకి నష్టం చేకూరుస్తుందని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి హోదాలో ఈ సమస్య పరిష్కారానికి పొంగులేటి ప్రయత్నించాలని, సహచర మంత్రిగా సామరస్య మార్గానికి సీతక్క సైతం చొరవ ప్రదర్శించాలని కోరుతున్నారు. సురేఖతో విభేదాలున్నప్పటికీ ఇన్‌ఛార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి మేడారం పనులను పర్యవేక్షించినట్లు, జిల్లా మంత్రిగా సీతక్క హాజరైనట్లుగా మంత్రి సురేఖ కూడా తన శాఖ మంత్రిగా భాగస్వామ్యం కావాల్సిందంటున్నారు.
మంత్రి సురేఖ తన అభిప్రాయాలేవైనా ఉంటే సీఎం, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకోవాలని, మేడారం లాంటి అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావడం మంత్రిగా తన బాధ్యతగా గుర్తుచేస్తున్నారు. పొంగులేటితో విభేదాల కారణంగా మంత్రిగా సురేఖ గైర్హాజరు కావడంతో ఆమె ఒంటరయ్యారనే అభిప్రాయం మరో వైపు వ్యక్తమవుతోంది.
సీఎం, అధిష్ఠానం ఉదాసీనత
ప్రభుత్వ, పార్టీ పరువు బజారున పడి తన సహచర మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఉపేక్షించడం సరైంది కాదనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. సత్వరం ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే తప్పుచేసిన వారి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా ఇవన్నీ షరామాములే అనే తీరుగా వ్యవహరించడంతో ప్రజల్లో చులకభావన ఏర్పడుతోందనే విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇప్పటికే మంత్రులుగా వీళ్ళంతా ప్రజలకు జవాబుదారులనే అంశాన్ని మరిచిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమ స్వంత సమస్యలతో ప్రజలకు ఇబ్బందులు సృష్టించడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఆ మాటకొస్తే అడ్లూరి ఆబ్సెంటే!
పొంగులేటి, సురేఖ మధ్య విభేదాలున్నందున ఈ చర్చ సాగుతోందని.. కొన్ని సందర్భాల్లో అందరు మంత్రులు ఒకే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చనే అభిప్రాయం ఇంకొవైపు ఉన్నప్పటికీ విభేదాలతో పనులకు ఆటంకం కలుగకూడదంటున్నారు. ఆ మాటకొస్తే గిరిజన శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కూడా హాజరుకాలేదు. కానీ, ఇది చర్చనీయాంశం కాలేదు. వాస్తవానికి గిరిజన శాఖ నుంచే రూ.150 కోట్ల నిధులు విడుదల చేశారు.
అందరి అక్కలతోనే హాజరవుతాను: పొంగులేటి
తనకు మంత్రి కొండా సురేఖకు ఎలాంటి విభేదాలు లేవని, మరోసారి మేడారం పర్యటన అందరి అక్కలతోటే వస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మేడారం పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. మంత్రులు సీతక్క, సురేఖలను సమ్మక్క-సాలరమ్మలతో పోల్చారు.
ఈ అక్కలతో వస్తానని, మేడార జాతర ముగిసేలోపు తాము పదుల సార్లు వస్తామన్నారు. కొందరికి వీలైతది, మరి కొందరికి వీలుకాకున్నా పనులు ముందుకు సాగాలనేదే తమ లక్ష్యమన్నారు. సీఎం ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలిపారు. దేవాదాయ శాఖ టెండర్ల పై మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసని, రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం తాపత్రయ పడే అంత అవసరం లేదన్నారు. తన మీద సహచర మంత్రులు ఫిర్యాదు చేశారని తాను నమ్మడం లేదన పొంగులేటి వెల్లడించారు.