విధాత: టాలీవుడ్ లక్ష్యంగా ఐటీ సోదాలు (IT RIDES) కొనసాగుతోండగా ఎప్పుడు ఎవరి మీద దాడులు జరుగుతున్నాయనే విషయంపై ఐటీ నుంచి లేని ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. సినిమా ఇండస్ట్రీ, దిల్ రాజు (Dil RAJU) ఇటు మైత్రీ మూవీ మేకర్స్ సోదాలపై పెదవి విప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే ఐటీ డిపార్ట్‌మెంట్ కన్ను మరికొన్ని అగ్ర నిర్మాణ సంస్దలపై పడినట్లు తెలుస్తోంది. అగ్ర నిర్మాణ సంస్దలకు అప్పులిచ్చిన ఫైనాన్షియర్స్ నుంచి లభించిన సమాచారం ఆధారంగా ఎకె ఎంటర్ టైన్మెంట్స్ ఆఫీస్ లోనూ ఐటీ రైడ్స్ జరిగినట్లు తెలుస్తోంది.
వీటితో పాటు పుష్ప 2 నిర్మాణంలో ఇన్ వాల్వ్ అయిన సుకుమార్ ఇంట్లో సోదాలు పూర్తవగా, పుష్ప 2 లో షేర్ ఉన్న గీతా ఆర్ట్స్, అల్లు అర్జున్ (Allu Arjun) ఇండ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటీవల భారీ సినిమాలకు వర్క్ చేసిన హీరోలు , దర్శకులను కూడా ఐటీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా దేవర సినిమా నిర్మాణంలోనూ భాగస్వామి అయిన కొరటాల శివ, గేమ్ ఛేంజర్ హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ లను ఐటీ డిపార్ట్మెంట్ ప్రశ్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదిలాఉండగా మూడోరోజు దిల్ రాజు ఇంట ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో దిల్ రాజు తల్లి అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఐటీ శాఖ సంబంధించిన వాహానంలోనే ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు ఓ మహిళా అధికారి కూడా వెంట ఉన్నారు. మరోవైపు దర్శకుడు సుకుమార్ ఇంట్లో రెండు రోజులుగా జరుగుతున్న తనిఖీలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
దిల్ రాజు నివాసంలో గత మూడ్రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులపై (IT RIDES) హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ మీట్‌లో వెంకటేష్ మాట్లాడుతూ తనకు ఈ సోదాల విషయం తెలియదన్నారు. అయితే మిగతా హీరోల సంగతి నాకు తెలీదని నేను తీసుకునే రెమ్యూనరేషన్ తక్కువ అని అది కూడా పూర్తిగా వైట్‌లోనే ఉంటుందన్నారు. అనంతరం అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. రెండేళ్లకు ఒకసారి ఐటీ సోదాలు సర్వసాధారణమని, దిల్ రాజుపైనే కాదు, చాలామంది ప్రముఖులపై ఈ సోదాలు జరుగుతున్నాయని డైరెక్టర్ అనిల్ వెల్లడించారు. సంక్రాంతికి వస్తున్నామని మేమంటే.. సంక్రాంతికి వస్తున్నామని ఐటీ వాళ్లు వచ్చారని నాపై ఎలాంటి దాడులు జరగలేదని తెలిపారు.