విధాత: సోషల్ మీడియాలో సంచలనంగా ఉండాలని చూసే అతికొద్దిమందిలో ఈ స్టార్స్ ఇద్దరూ ముందుంటారు. వీళ్ళు ఏం చేసినా వైరల్ అవ్వాల్సిందే. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అలా కనిపించడాన్ని కూడా సరదాగానే తీసుకుంటారు. వెకేషన్లని, పార్టీలని తరుచుగా జంటగా కనిపిస్తూనే మామధ్యేం లేదని బుకాయించడం చూసి.. అది కాస్త ఓవర్ అవుతుందని నెటిజన్లు విసుక్కున్న సందర్భాలూ లేకపోలేదు.
మామూలుగా సినీ తారలు ఏం చేసినా మీడియాకు సంచలనమే.. మరీ ముఖ్యంగా కాస్త పేరున్న తారలు కలిసి తిరిగారంటే వాళ్ళ మధ్య ఏదో ఉందనే వార్తలు గొల్లుమంటాయి. అలాంటిది ఈ జంట గురించి రోజుకో వార్త ట్రెండింగ్‌లో ఉంటుంది. ఆ జంట ఎవరో కాదు.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.
ఈ ఇద్దరూ వరసపెట్టి సినిమాలు చేయడమే కాకుండా.. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంటికి చిక్కిన సందర్భాలు కోకొల్లలు. ‘గీతా గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాలు తర్వాత ఇద్దరూ కలిసి కనిపించడంతో పాటు.. ఇద్దరూ ఒకే ప్లేస్‌కి వెకేషన్‌కి వెళ్లడం వీరిని వార్తలలో ఉంచేలా చేసింది.
దానికి తగ్గట్టు ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, గత కొంత కాలంగా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు ఓ రేంజ్‌లో ట్రెండ్ కూడా అయ్యాయి. అలా ఏం లేదని రష్మిక, విజయ్ దేవరకొండ కొట్టిపారేసిన సందర్భాలూ ఉన్నాయి. అయినా కూడా వారిపై వార్తలు ఆగడం లేదు.
ఇదంతా అలా ఉంటే.. ఎన్ని రూమర్స్ వచ్చినా కలిసి వెకేషన్లకు వెళ్ళడం, కలిసి కనిపించడం వంటివి మీడియా కంట్లో పడుతూనే ఉన్నాయి. డిన్నర్లు, పబ్‌లు మాట అటుంచితే, ఈమధ్య వీళ్ళిద్దరూ ఓ రిసార్ట్ నుంచి తిరిగి వస్తూ, విమానాశ్రయంలో కెమెరాలకు చిక్కారు. దీంతో ఓ రేంజ్‌లో వీరిపై వార్తలు మొదలయ్యాయి.
వీరిని ఇలా చూసిన నెటిజన్లు.. మా మధ్య ఏమీలేదని, మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి తప్పుకోవడం.. ఫైనల్‌గా త్వరలోనే ఒకటి కాబోతున్నామని ప్రకటించడం సినీ తారలకు మామూలేనని సెటైర్స్ విసురుతున్నారు. గతంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విషయంలోనూ ఇదే జరిగిందని.. విజయ్, రష్మిక దీన్నే ఫాలో అవుతున్నారనేలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏదో ఓ రోజు ఇద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామనే వార్త వాళ్ళలానే వీళ్ళూ చెబుతారని సినీ జనాల్లో వినిపిస్తున్న కబర్.