Site icon vidhaatha

Ajamjahi lands: ఆక్రమణలో ‘ఆజంజాహి’ భూములు

(రవి సంగోజు)

వరంగల్‌లో తీవ్ర చర్చకు దారి తీసిన ఆజంజాహి మిల్లు (Ajamjahi lands) యూనియన్ ఆఫీసు భూమి దురాక్రమణ రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తోంది. వరంగల్ నగరానికి చెందిన ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారికి అప్పనంగా ఈ భూమిని కట్టబెట్టేందుకు గత అధికార బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత ప్రయత్నించగా ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఆ స్థలంలో శంకుస్థాపన చేయడం రాజకీయ రచ్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆజం జాహి మిల్లు కార్మిక సంఘం నేతలు ఒకరిద్దరిని లోబరుచుకొని ఒక న్యాయవాది, ఒక కార్మిక నాయకుని పేరుతో చలామణి అయిన వ్యక్తులు కూడా బలుక్కొని చేసిన నమ్మకద్రోహం ఫలితంగా ఆజం జాహి మిల్లు యూనియన్ స్థలం అందరి కళ్ళముందే నేలమట్టం అయింది. ఈ దురాగతంపై మిల్లు పరిరక్షణ కమిటీ స్పందించడంతో రాజకీయ చర్చకు దారితీసింది. అధికార పార్టీ నేతల అసలు స్వరూపం బయటపడటంతో కార్మికులు మండిపడుతున్నారు. కొందరు నాయకులు భుజాలు తడుముకుంటున్నారు. ఈ సమస్య పై తాజాగా మావోయిస్టు పార్టీ స్పందించిందీ. దీంతో ఒక్కసారిగా సంబంధించిన వర్గాలు, నమ్మకద్రోహులు, భూ కబ్జాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వామ్యమైన వారు ఉలిక్కిపడుతున్నారు. ఇప్పటికే సాగుతున్న ఆల్ ఎంజాయ్ మిల్లు భూ పరిరక్షణ ఉద్యమం ఏమలుపు తీసుకుంటుందో అనే చర్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్, బిజెపి పార్టీలతో పాటు నగరానికి చెందిన ఓ వస్త్ర వ్యాపారి, ఆయన పరోక్ష మద్దతుదారులు, కార్మిక సంఘం పేరుతో తమ పబ్బం గడుపుతున్న నాయకులు, కొందరు ప్రజాసంఘాల నాయకుల బండారం బయటపడిన నేపథ్యంలో ఈ ప్రకటన మరింత రాజకీయ వేడిని రగిలించింది.

ఆజంజాహి మిల్లు కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించుకున్న కార్మిక సంఘ భవనం కూల్చి, ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు జరిగిన కుట్రలను అందులో భాగస్వాములైన వారందరికీ కార్మికలోకం తమ ఐక్యతతో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) జయశంకర్- మహబూబాబాద్- వరంగల్(2)-పెద్దపల్లి (JMWP) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూ దళారులు, రాజకీయ నాయకులు, కార్మికులు నమ్ముకున్న కొంతమంది నాయకుల చేసిన ద్రోహం ఫలితంగా ఈ దుస్థితి దాపురించిందని ఆయన స్పష్టం చేశారు. తాజాగా మావోయిస్టు పార్టీ పేరుతో విడుదల చేసిన ప్రకటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆజంజాహి మిల్లుకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత స్థలంలో కార్మిక భవనాన్ని నిర్మించి, భూములపై పూర్తి హక్కు కార్మికులకు లేదా వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని కోరారు. ప్రజలు, పత్రికా మిత్రులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కార్మికుల పోరాటాలకు సంపూర్ణ మద్దతును తెలుపాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్ నగరంలో ఏడు దశాబ్దాల క్రితం ఆజంజాహి వస్త్ర పరిశ్రమను నిజాం కాలంలో స్థాపించారు. ఈ పరిశ్రమపై ఆధార పడి వేలాది మంది కార్మికులు, ప్రజలు జీవించారని వివరించారు. దేశంలో సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల దోపిడి ప్రయోజనాల కోసం 1991లో నూతన ఆర్ధిక విధానాలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వాలు మిల్లును పథ‌కం ప్రకారం నిర్లక్ష్యం చేస్తూ పరిశ్రమ దివాళా తీసేలా చేశారు.

మిల్లు భూముల అమ్మకం

మిల్లుకు చెందిన 451 మంది కార్మికులకు బలవంతపు VRS ఇచ్చి 2002లో మిల్లును మూసివేశారు. ఫలితంగా కార్మికులు రోడ్డున పడ్డారు. మూసివేసిన నాటి నుంచి పరిశ్రమను తిరిగి స్థాపించాలని పోరాడుతూనే ఉన్నారు. కార్మికుల పోరాటాన్ని పెడచెవిన పెట్టి 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం కుడా సంస్థకు 117 ఎకరాల 20 గుంటలు, ఆంధ్ర ప్రదేశ్ హౌజింగ్ బోర్డుకు 65 ఎకరాలు, రాంకీ, హ్యూండ్లూమ్ కార్పోరేషన్ సంస్థకు 30 ఎకరాల భములను అమ్మేసింది. ఈ సంస్థలు కార్మికుల ప్రయోజనాల కోసం, భూములను పరిరక్షించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకాల పెట్టాయి. దీనితో కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. పరిశ్రమకు సంబంధించిన భూమి 226 ఎకరాల భూమిపై న్యాయబద్ధంగా తమకే చెందాలని, ఆ భూములపై కార్మికులకే హక్కు వుండాలని కార్మికులంతా పోరాడుతూనే వున్నారు. ప్రభుత్వ అధికారుల చుట్టూ ఏండ్ల తరబడి తిరుగుతున్నారు. అయినప్పటికీ ఈ భూములను కార్మికులకు ఇవ్వకుండా కార్పోరేషన్ సంస్థలకు వేలం వేశారు.

యూనియన్ ఆఫీసు స్థలం కబ్జా

కార్పోరేషన్ సంస్థలకు అమ్మగా మిగిలిన భూములను దోపిడి వర్గాలు, రాజకీయ నాయకులు తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వాల ప్రోద్భలంతో, కొద్దిమంది కార్మిక నాయకుల మద్దతుతో ఓంనమశివాయ, గొట్టె ముక్కుల నరెందర్ లాంటి కబ్జాదారులు సంబంధిత భూములను కబ్జా చేశారు. కబ్జా పెట్టిన భూములలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టి వాటిని అమ్మకుని కోట్లు సంపాదిస్తున్నారు.

న్యాయవాది, కార్మికనాయకుల పాత్ర

ఆజంజాహి మిల్లు కార్మికులంతా వారి రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టుకొని వారి కష్టసుఖాలను మాట్లాడుకోవడానికి, తమ హక్కుల కోసం పోరాడడానికి ప్రధాన రహదారి ప్రక్కన వెంకటరామ థియేటర్ సమీపాన 12 గుంటల భూమిని కొనుగోలు చేసి కార్మిక భవనాన్ని నిర్మించుకున్నారు. అజంజాహి మిల్లు భూముల వ్యవహారం ఇంకా కోర్టులో వున్నప్పటికీ దానికి సంబంధించిన నియమాలను పట్టించుకోకుండా హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, వరంగల్ కు సుద్దాల నాగరాజులు తప్పుడు పత్రాలను సృష్టించి ఓం నమశివాయ అనే వ్యాపారికి అక్రమంగా అమ్ముకున్నారు. వీరి అండతో ఓం నమశివాయ అనే వ్యాపారి కార్మికుల కార్యాలయాన్ని అన్యాయంగా కూల్చేశాడు. గతంలో గొట్టె ముక్కుల నరేందర్, ఓమ్ నమశివాయ కార్మికుల భవనాన్ని, భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసినప్పడు చిక్కుడు ప్రభాకర్ కార్మికుల తరుపున కోర్టులో కేసు వేసి భవనాన్ని, భూములలో జోక్యం చేసుకునే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవచ్చుని బోర్డు పెట్టించాడు. అజంజాహి మిల్లును తిరిగి తెరిపించాలని కార్మికుల పక్షాన నిలిచి కార్మికోద్యమాలకు నాయకత్వం వహించాడు. నేడు అదే చిక్కుడు ప్రభాకర్ కార్మికులను మోసగించి దోపిడి వర్గాల పక్షం నిలబడుతున్నాడు. గొట్టె ముక్కుల నరేదర్ నుంచి ఓం నమశివాయకు కొలుగోలు చేసినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించాడు. అజంజాహి మిల్లుకు సంబంధించిన భూములు, భవనంతో పాటు విలువైన డ్యాకుమెంట్లను అమ్ముకున్నారు. వరంగల్ కు చెందిన సుద్దాల నాగరాజు అసంఘటిత కార్మిక సంఘం పేరుతో చలామణి అవుతూ తినడానికి తిండిలేని స్థితి నుండి సెటిల్ మెంట్స్, భూ అక్రమాలకు పాల్పడి అక్రమంగా ఆస్తులు సంపాదించాడని మావోయిస్టు నేత పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం

కాంగ్రెస్ ప్రభుత్వం అజంజాహి భూముల కబ్జాదారులను శిక్షించకుండా వారి దోపిడి ప్రయోజనాలకు కొమ్ముకాస్తున్నది. అజంజాహి మిల్లు భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకానికి ప్రయత్నిస్తున్నది. తమ భూమి కోసం చట్టబద్దంగా పోరాటం చేస్తున్న కార్మికులకు మొండి చేయి చూపి దోపిడి వర్గాలకు అనుకూలంగా వ్యవహరించింది. పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టడానికి వెళ్ళితే లంచాలు తీసుకున్న పోలీసులు ఇది మా పరిధిలో లేదని దబాయిస్తూ కేసులు పెట్టడం లేదు. ఫలితంగా 226 ఎకరాల భూమి దురాక్రమణకు గురి అయింది. అజంజాహి వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని, ప్రభుత్వం తలపెట్టిన భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపి వేయాలని కోరారు.

ప్రభుత్వం న్యాయమైన చర్యలు చేపట్టి భూములను కార్మికులకు అప్పగించాలని కోరారు. భవనం కూల్చి వేతలో, భూ కబ్జాలో ప్రత్యేక్ష్య, పరోక్ష భాగస్వామ్యం వున్న భూ దురాక్రమదారులపై చట్టపర చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం వున్న స్థలంలో కార్మికుల భవనాన్ని నిర్మించి ఇవ్వాలన్నారు. ప్రజలారా! కార్మికులారా అజంజాహి మిల్లుకు సంబంధించిన భూములపై పూర్తి హక్కు కార్మికులకు లేదా వారి కుటుంబాలకు వర్తిస్తుంది. ఆ భూములపై హక్కులను సాధించుకునే వరకు విరోచిత పోరాటాలు చేపట్టాలని కోరారు. ప్రజలు, పత్రికా మిత్రులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కార్మికుల వైపు నిలబడి వారి పోరాటాలకు సంపూర్ణ మద్దతును తెలుపాలని మావోయిస్టు నేత వెంకటేష్ కోరారు.

Exit mobile version