కాషాయపార్టీ క్యాస్ట్‌ పాలి’ట్రిక్స్‌’.. అవసరాల మేరకే బీసీ సీఎంలు

బీజేపీ కొంతకాలంగా బీసీ నినాదాన్ని ఎత్తుకుంటున్నది. కానీ నిజానికి బీజేపీ బ్రాహ్మణ, క్షత్రియ పార్టీగా పేరున్న సంగతి తెలిసిందే.

  • Publish Date - December 18, 2023 / 02:35 AM IST
  • హిందూత్వంతోపాటు.. కుల రాజకీయం
  • లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాలు


విధాత ప్రత్యేకం: బీజేపీ కొంతకాలంగా బీసీ నినాదాన్ని ఎత్తుకుంటున్నది. కానీ నిజానికి బీజేపీ బ్రాహ్మణ, క్షత్రియ పార్టీగా పేరున్న సంగతి తెలిసిందే. అందుకే వీపీ సింగ్‌ ‘మండల్‌’ విధానానికి వ్యతిరేకంగా ఆ పార్టీ అగ్రనేత రథయాత్ర చేశారు. బీజేపీ బలంగా ఉన్నప్పుడు అగ్రవర్ణ నేతలకు ప్రాధాన్యం ఇస్తుందనే వాదన ఉన్నది.

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కళ్యాణ్‌సింగ్‌ను, మధ్యప్రదేశ్‌లో ఉమాభారతి లాంటి నేతలను ముందుపెట్టి అధికారంలోకి వచ్చింది.అధికారంలోకి వచ్చాక వాళ్ల ప్రాధాన్యాన్ని మెల్లగా తగ్గించింది. రాజకీయంగా కూడా వారిని అనేక ఇబ్బందులకు గురిచేసింది. ఇక బీజేపీ బలహీనపడుతున్న సందర్భంలో బీసీలను ముందుకు తేవడం అనే వ్యూహాన్ని 2014 నుంచి అమలు చేస్తున్నది.


2017 ఎన్నికలకు ముందు యూపీలో కేశవ ప్రసాద్‌ మౌర్యను, 2023లో అసెంబ్లీ ఫలితాల తర్వాత మధ్యప్రదేశ్‌లో మోహన్‌ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం వంటి నిర్ణయాల వెనుక బీజేపీ కుల రాజకీయాలు స్పష్టమౌతాయి.

కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు నుంచి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నది. అలాగే ఈ మధ్య కాలంలో జరిగిన రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలోనూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడుతామని హామీ ఇచ్చారు.


కర్ణాటకలో ప్రధాని, ఆ పార్టీ అగ్రనేతలు ‘జై బజరంగ్‌బలి’ నినాదాన్ని ఎత్తుకున్నా ప్రజలు కాంగ్రెస్‌కే భారీ మెజారిటీ కట్టబెట్టారు. ఇండియా కూటమి కూడా బీజేపీ హిందూత్వవాదానికి అడ్డుకట్ట వేయడానికి కులగణన అస్త్రాన్నే ప్రయోగిస్తున్నది. ఈ పరిణామాలన్నీబేరీజు వేసుకున్న బీజేపీ అధిష్ఠానం ఒక్క హిందుత్వవాదంతోనే అధికారంలోకి రాలేమని గ్రహించి రూట్‌ మార్చినట్టు కనిపిస్తున్నది.

ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలో ప్రధాని ప్రచారశైలిని గమనిస్తే ఆయా రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతల పైనే విమర్శలు ఎక్కుపెట్టారు. జాతీయ అంశాల జోలికి పెద్దగా వెళ్లకుండా స్థానికంగా ప్రజలను ఆకట్టుకోవడానికి యత్నించారు. కమలనాథులు ఈ క్యాస్ట్‌ బేస్‌డ్‌ రాజకీయాలు ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ వ్యూహాన్ని అమలు చేసింది. అప్పటి ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేశవ ప్రసాద్‌ మౌర్యను ముందు పెట్టి ఓబీసీ, ఇతర ఎస్సీ, ఎస్టీ కులాల్లోని ఉప కులాలను తనవైపు తిప్పుకోవడంలో విజయవంతమైంది.


ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మౌర్యనే ముఖ్యమంత్రి అవుతారనే సంకేతాలు పంపింది. అప్పటికి యోగీ ఆదిత్యనాథ్‌ను తెరమీదికి తీసుకురాకుండా జాగ్రత్త తీసుకున్నది. ఫలితంగా అంతకు ముందు ఎన్నికల్లో 47 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ ఏకంగా 312 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో 224 స్థానాల్లో విజయం సాధించిన సమాజ్‌వాదీ పార్టీ 177 స్థానాలు కోల్పోయి 47 స్థానాలకే పరిమితం కాగా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ 80 సీట్ల నుంచి 18 స్థానాలకు పడిపోయింది.

ఇక కాంగ్రెస్‌ పార్టీ అయితే 114 స్థానాలకు పోటీపడి 7 సీట్లు మాత్రమే దక్కించుకోగా, రాష్ట్రీయ లోక్‌దళ్‌ 277 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలువగలిగింది. ఇట్లా ఏకకాలంలో అనేక పార్టీలను బీజేపీ దెబ్బకొట్టింది. ఎన్నికల ఫలితాల అనంతరం మౌర్యను ఉప ముఖ్యమంత్రి చేసి, క్షత్రియ కులానికి చెందిన ఆదిత్యనాథ్‌ను సీఎం చేసింది.

2014లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అప్నాదళ్‌ (సోనెలాల్‌) పార్టీలను కలుపుకొని మొత్తం 80 సీట్లలో 71 స్థానాలను కైవసం చేసుకున్నది. 2014లో బీజేపీ నేతృత్వంలో గెలిచిన 282 సీట్లలో మెజారిటీ సీట్లు యూపీ నుంచే గెలుచుకోవడం గమనార్హం. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీలో అధికారం తప్పనిసరి అని కమలనాథులకు అర్థమైంది. అందుకే 2019 ఎన్నికల్లోనూ ఎన్డీఏ గత ఎన్నికల కంటే ఎక్కువగా 303 సీట్లు గెలుచుకున్నది.


అప్పుడు కూడా యూపీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 62 సీట్లను తన ఖాతాలో వేసుకున్నది. కాంగ్రెస్‌ ముఖ్త్‌ భారత్‌ అన్నబీజేపీ నినాదానికి అడ్డుకట్ట వేసింది ప్రాంతీయ పార్టీలే. అందుకే కేంద్రంలో తమ విజయ పరంపర కొనసాగాలంటే పెద్ద రాష్ట్రాలైన యూపీ, బీహార్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టాలనే వ్యూహాలకు పదునుపెట్టింది.


అప్పటిదాకా బీజేపీ నమ్ముకున్న హిందూత్వవాదం, ఆర్టికల్‌ 370, కామన్‌ సివిల్‌కోడ్‌ వంటి అంశాలను 2014కు ముందు నుంచి 2019 వరకు ప్రచారాస్త్రాలుగా వాడుకొని సక్సెస్‌ అయ్యింది. కానీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఆదరించిన ప్రజలు రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీకి వ్యతిరకంగా ఓట్లు వేశారు.


2015లో బీహార్‌, ఢిల్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి. 2014లో అధికారంలోకి వచ్చాక వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచి అధికారంలోకి వచ్చినా 2018లో బీజేపీ చేతిలో ఉన్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను కోల్పోయింది.


అప్పటి నుంచే బీజేపీ అధిష్ఠానం తన వ్యూహాలను మార్చింది. పాత ప్రచార పద్ధతులకు స్వస్తి పలికి వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఇండియా కూటమి తెరమీదికి తెచ్చిన కుల గణన అంశాన్ని అధిగమించడానికి ఇటీవల మూడు రాష్ట్రాల్లో మూడు సామాజిక వర్గాల ముఖ్యమంత్రులను ఎంపిక చేసింది.

ఇండియా కూటమిడిమాండ్‌ చేస్తున్న కులగణన అంశాన్ని దెబ్బకొట్టడానికి వచ్చే ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లోఈ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీనియర్లను పక్కనపెట్టి ఎవరూ ఊహించని పేర్లను తెరమీదికి తెచ్చి మోదీ-షా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కానీ వీరి ఎంపిక వెనుక బీజేపీ అధిష్ఠానం చాలా కసరత్తు చేసిందని చెబుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి అధికారమే లక్ష్యంగా ఈ దిశగా పావులు కదిపిందని సమాచారం.


అందుకే ఆయా రాష్ట్రాల్లో వివిధ కులాలవారి ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే ప్రణాళికలు రూపొందించుకున్నది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ స్థానాలను దక్కించుకోవడానికి ఆ రాష్ట్రంలో 30 శాతానికి పైగా ఉన్న గిరిజన ఓట్లు చాలా కీలకం. అందుకే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు.


కానీ ఆయనను పక్కనపెట్టి గిరిజన నేత అయిన విష్ణుదేవ్‌ సాయ్‌ని ముఖ్యమంత్రి చేసింది. మధ్యప్రదేశ్‌లోనూ యాభై శాతానికి పైగా ఉన్న ఓబీసీల ఓట్లతో పాటు ఆ రాష్ట్రంలో ఉన్న ఆరు శాతం యాదవ్‌ ఓట్లను ఆకర్షించడానికి శివరాజ్‌సింగ్‌ను కాదని మోహన్‌ యాదవ్‌కు సీఎం సీటు కట్టబెట్టింది.

ఇక బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీగా పేరొందిన ఆ వాదాన్ని మోదీ-షా కొంత చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం కోసం ఇతర కులాల వారికీ ప్రాధాన్యం ఇస్తూనే బ్రాహ్మణవర్గాలను సంతృప్తి పరచడానికి రాజస్థాన్‌లో భజన్‌లాల్‌ శర్మను ఎంపిక చేసింది. గుజరాత్‌లోనూ పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రి చేసింది.


కర్ణాటకలో యడ్యూరప్ప లేకుండా గెలవడం సాధ్యం కాదని ఫలితాల తర్వాత తెలుసుకున్న ఆ పార్టీ ఆయన తన తనయుడు బీవై విజయేంద్రకు ఆ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. తెలంగాణలోనూ బీసీ సీఎం అభ్యర్థి నినాదంతో పాటు ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసింది.


రాష్ట్రాల వారీగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని వారిని ఆకట్టుకునే విధంగా బీజేపీ అధిష్ఠాన నిర్ణయాలు ఉంటున్నాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తే కాషాయ పార్టీ హిందుత్వవాదాన్ని, క్యాస్ట్‌ పాలి’ట్రిక్స్‌’ను ఏకకాలంలో కొనసాగిస్తున్నదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.