విధాత, హైదరాబాద్ : టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ(TPCC Disciplinary Committee) సమావేశం చైర్మన్ మల్లు రవి(Mallu Ravi) అధ్యక్షతన ఆదివారం గాంధీ భవన్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై చర్చించి రెండింటిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిద్దిపేట(Siddipeta) ఇంచార్జి పూజల హరికృష్ణ(Poojala Harikrishna),కు, అలాగే సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి(Narsa Reddy)కు షోకాజ్ నోటీసులు(Notices) జారీ చేశారు. వారు వారం రోజుల్లో తమపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లుగా మల్లు రవి తెలిపారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి, ఎస్సీ సెల్ విభాగం విజయ్ కుమార్ లకు మధ్య గొడవ జరిగిందని..ఈ సందర్భంగా తనను కులం పేరుతో నర్సారెడ్డి దూషించారంటూ విజయ్ కుమార్ అట్రాసిటీ కేసు పెట్టడంతో పాటు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మల్లు రవి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని..పార్టీ నేతలు అంతా సమన్వయంతో..సహనంతో ఉండాలని..ఏదైనా సమస్యలుంటే నాకు ఫిర్యాదు చేయాలని మల్లు రవి సూచించారు.
ఫిరాయింపుల చరిత్రను మరిచి నీతులా ?
పార్టీ ఫిరాయింపులపై గత చరిత్రను మరిచి కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని మల్లు రవి మీడియా ప్రతినిధుల ప్రశ్నపై స్పందించారు. పదేళ్లలో 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్న చరిత్ర మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు ఈ వ్యవహారంలో స్పీకర్ నిర్ణయం ఉంటుందని..మీరు నేను చెప్పినట్లుగా ఉండదన్నారు.
అయితే విజయ్ కుమార్ తప్పుడు ఆరోపణలతో నాపై అట్రాసిటీ కేసు నమోదు చేశారని నర్సారెడ్డి క్రమశిక్షణ కమిటీకి వివరించారు. బీజేపీకి మద్దతు ఇచ్చిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును పట్టుకుని నాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై క్రమశిక్షణ కమిటీకి సమాధానామిస్తానని తెలిపారు.