ఆరోపణలపై ఆరు పేజీల లేఖ
మంత్రి పొంగులేటిపై ఆరోపణలు
విధాత, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో విబేధాల నేపథ్యంలో తనపై పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి శనివారం గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. వందలాది కార్ల భారీ కాన్వాయ్ తో గాంధీభవన్ చేరుకున్న కొండా మురళి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి ముందు తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా వరంగల్ కాంగ్రెస్ ముఖ్యనేతలపై కొండా మురళి ఆరు పేజీల లేఖలో ఫిర్యాదులు, వివరణలు ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనపైన, తన భార్య మంత్రి కొండా సురేఖపైన కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నట్లుగా తన లేఖలో కొండా మురళి ఆరోపించారు. గతంలో పొంగులేటి మామ సురేందర్ రెడ్డి టికెట్ మా వల్లే పోయిందన్న భావనతో ఆయన ఉన్నారని ఆ కారణంతోనే మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లుగా ఉందని తెలిపారు. నన్ను ఎవరూ ఇక్కడికి పిలవలేదని..పీసీసీ చీఫ్ బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ పై ఉన్నఅభిమానంతో నేనే వచ్చి పార్టీకి వివరణ ఇస్తున్నానన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర, పరకాల ఎమ్మెల్యే రేవూరి, తన నియోజకవర్గంలో పర్యటించడంపై కొండా మురళి అభ్యంతరం చేశారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిపైనా ఫిర్యాదు చేశారు.
జిల్లా మంత్రి సీతక్కతో మాకు పంచాయతీ లేదని.. సీతక్క.. సురేఖ కలిసి పనిచేసుకుంటున్నారన్నారు. వారి మధ్య గ్యాప్ వచ్చిందని కడియం ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భూపాలపల్లి నుంచి నేను పోటీ చెద్దామనుకున్నానని..అయితే టీడీపీ నుంచి వచ్చిన గండ్రాకు టికెట్ ఇచ్చారని..ఆయనను గెలిపిస్తే..ఇతరులతో కలిసి మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి కూడా మేమ మద్దతు ఇచ్చి గెలిపించామని..గెలిచిన తర్వాత మాకు వ్యతిరేకంగా గూడుపుఠాణి రాజకీయాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు అంటే నాకు గౌరవం ఉందన్నారు. రేవంత్ రెడ్డినే మళ్లీ సీఎం కావాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్నదే మా లక్ష్యమన్నారు. నేను ప్రజల మధ్య ఉండేవాడినని..నేను మాట్లాడింది తప్పు కాదనేది నా అంతరాత్మకు తెలుసన్నారు. నేను బలహీనుడను కాదని..నన్ను రెచ్చగొట్టవద్దన్నారు.