Asteroid 2024 YR4 May Hit Moon in 2032: Impact, Debris & Earth Risk Explained
- 2032లో 2024 YR4 చంద్రుడిని ఢీకొట్టే అవకాశం 4 శాతం.
- భారీ క్రేటర్, మూన్ క్వేక్ ఏర్పడే అవకాశం.
- ఉల్కా వర్షంతో ఉపగ్రహాలకు ముప్పు.
- శాస్త్రీయ పరిశోధనకు అరుదైన అవకాశం.
Asteroid 2024 YR4 | చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉన్న గ్రహశకలం 2024 YR4 ప్రపంచ శాస్త్రీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సుమారు 60 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్రహశకలం భూమిని తాకే ప్రమాదం తొలగిపోయినప్పటికీ, ఇప్పుడు చంద్రుడిపై ప్రభావం చూపే అవకాశం దాదాపు 4 శాతం వరకు ఉందని తాజా లెక్కలు చెబుతున్నాయి. 2032 డిసెంబర్ 22న ఈ ఘటన జరుగబోతోంది.
ఈ సంఘటన జరిగితే చంద్రుడిపై భారీ గొయ్యి ఏర్పడటమే కాకుండా, భూమిపై ఉల్కా వర్షం, ఉపగ్రహాల భద్రతపై ప్రభావం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో, ఇది ఒక అరుదైన సహజ శాస్త్రీయ ప్రయోగంగా మారి చంద్రుడి అంతర్గత నిర్మాణంపై కీలక సమాచారం అందించగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఢీకొడితే విడుదలయ్యే శక్తి, పడే గొయ్యి, చంద్రకంపం..?
Asteroid 2024 YR4 చంద్రుడిని ఢీకొంటే సుమారు 6.5 మిలియన్ టన్నుల TNT పేలుడుతో సమానమైన శక్తి విడుదలవుతుందని అంచనా. అంటే హిరోషిమాపై అమెరికా వేసిన అణుబాంబుతో పోలిస్తే 500 రెట్లు శక్తివంతమైనది. ఇది ఆధునిక కాలంలో నమోదయ్యే అత్యంత శక్తివంతమైన చంద్ర ప్రభావాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఇటీవల జేమ్స్ వెబ్ టెలిస్కోపు పంపిన సమాచారం ఆధారంగా నాసా శాస్త్రజ్ఞులు భూమిని ఢీకొట్టే అవకాశాలను సన్నగిల్లింపజేస్తూ, చంద్రుడిని ఢీకొట్టే పరిస్థితులు ఎక్కువైనట్టుగా నిర్ధారణకు వచ్చారు.
ఈ ఢీకొనడం వల్ల:
- సుమారు 1 కిలోమీటర్ వెడల్పు గల భారీ గుంత ఏర్పడుతుంది
- 150 నుంచి 260 మీటర్ల లోతు వరకు గొయ్యి ఉండొచ్చు
- మధ్యలో 100 మీటర్ల మేర కరిగిన రాళ్ల పొర ఏర్పడుతుంది
- రిక్టర్ స్కేల్‌పై సుమారు 5 తీవ్రత గల మూన్ క్వేక్ సంభవించవచ్చు
ఈ మూన్ క్వేక్ ద్వారా చంద్రుడి లోపలి నిర్మాణంపై విలువైన సమాచారం లభించనుంది. ఇప్పటివరకు చంద్రుడి అంతర్గత పొరలను నేరుగా అధ్యయనం చేయడం కష్టమైన నేపథ్యంలో, ఈ సంఘటన శాస్త్రవేత్తలకు అరుదైన అవకాశంగా మారనుంది.
అలాగే ఢీకొన్న సమయంలో ఏర్పడే కాంతి మెరుపు భూమి నుంచి చిన్న టెలిస్కోపులతో కూడా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
భూమికి ముప్పా..? ఉల్కలు, ఉపగ్రహాలు, రక్షణ చర్యలు
ఈ ఢీకొనడం వల్ల చంద్రుడి నుంచి భారీగా ధూళి, రాళ్లు అంతరిక్షంలోకి ఎగసిపడతాయి. వాటిలో కొంత భాగం భూమి వైపు ప్రయాణించే అవకాశం ఉంది.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం:
- కొన్ని రోజుల్లో భూమి వాతావరణంలోకి శకలాలు ప్రవేశించవచ్చు
- భారీ ఉల్కాపాతం సంభవించే అవకాశం ఉంది
- గంటకు లక్షల నుంచి కోట్ల ఉల్కలు భూవాతావరణంలోకి ప్రవేశించే పరిస్థితి రావొచ్చు
- దక్షిణ అమెరికా, ఉత్తర ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్పం ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అన్నట్లు ఈ ప్రభావం భారత్‌పై కూడా పడే అవకాశముంది.
ఈ శకలాల్లో ఎక్కువ భాగం వాతావరణంలోనే కాలిపోతాయి. కానీ కొంత భాగం భూమిపై పడితే ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉంది.
మరింత ప్రమాదకరమైన అంశం ఉపగ్రహాల భద్రత. అంతరిక్షంలోకి వెళ్లే శకలాలు ఉపగ్రహాలను ఢీకొడితే ‘కెస్లర్ సిండ్రోమ్(Kessler syndrome)’ వంటి పరిస్థితి ఏర్పడి, ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
కెస్లర్ సిండ్రోమ్ అంటే ఏమిటి? What is Kessler syndrome?
అంతరిక్షంలో ఒక ఉపగ్రహం లేదా శకలం పగిలితే అది వేలాది చిన్న ముక్కలుగా మారుతుంది. ఆ ముక్కలు మళ్లీ ఇంకో ఉపగ్రహాన్ని ఢీకొట్టి మరిన్ని శకలాలను సృష్టిస్తాయి. ఈ విధంగా వరుసగా ఢీకొనడం జరిగితే అంతరిక్షంలో ప్రమాదకరమైన చైన్ రియాక్షన్ ఏర్పడుతుంది. దీనినే కెస్లర్ సిండ్రోమ్ అంటారు. దీని వల్ల ఇంటర్నెట్, జీపీఎస్, వాతావరణ సమాచారం, టీవీ ప్రసారాలకు ఉపయోగపడే ఉపగ్రహాలు దెబ్బతిని ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది.
ఇదే సమయంలో ఈ శకలాలు భూమి చుట్టూ తిరుగుతూ ఒక వలయంలా ఏర్పడితే దాన్ని డెబ్రిస్ బెల్ట్ అంటారు. ఇది బయటికి కనిపించకపోయినా చాలా ప్రమాదకరం. ఈ బెల్ట్‌లోకి వెళ్లే కొత్త ఉపగ్రహాలు సులభంగా ఢీకొని నష్టం చవిచూడాల్సి వస్తుంది. Asteroid 2024 YR4 చంద్రుడిని ఢీకొంటే ఏర్పడే శకలాల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ సంఘటనను కేవలం చంద్రుడిపై జరిగే ప్రభావంగా కాకుండా భూమి చుట్టూ ఉన్న అంతరిక్ష భద్రత కోణంలో కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
ఏం చేయాలి? మల్లగుల్లాలు పడుతున్న శాస్త్రవేత్తలు
ఈ నేపథ్యంలో గ్రహశకలాన్ని దారి మళ్లించడం లేదా ధ్వంసం చేయడం కోసం అణు సాంకేతికత, కైనెటిక్ మిషన్లపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే గ్రహశకల నిర్మాణంపై సమగ్ర సమాచారం లేకపోవడం వల్ల ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
Asteroid 2024 YR4 చంద్రుడిని ఢీకొట్టే అవకాశం తక్కువగానే ఉన్నప్పటికీ, జరిగితే భూమి–చంద్ర వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపే సంఘటనగా మారుతుంది. ఒకవైపు శాస్త్రీయ పరిశోధనకు అరుదైన అవకాశం.. మరోవైపు అంతరిక్ష భద్రతకు ముప్పు.. ఈ రెండింటి మధ్య సమతౌల్యం పాటించడమే భవిష్యత్తు నిర్ణయాల్లో కీలకంగా మారనుంది.
