Gravity Lose Fact Check | ఆ రోజు గురుత్వాకర్షణ శక్తిని కోల్పోనున్న భూమి.. వాస్తవాలేంటి? నాసా ఏం చెబుతున్నది?

అప్పుడప్పుడు కొన్ని వింతవార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటిదే ఒకటి. మనం నివసిస్తున్న భూమి ఆగస్ట్‌ నెలలో ఏడు సెకన్లపాటు గురుత్వాకర్షణ శక్తిని కోల్పోనున్నదట. దీనిపై నాసా వివరణ ఇచ్చింది.

Earth gravity loss image created with AI

Gravity Lose Fact Check | ఈ రోజు మనం భూమిపై నిలబడి ఉంటున్నామంటే.. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి ప్రభావమే. అది లేనిపక్షంలో అంతరిక్షంలో వ్యోమగాములు ఎలా తేలిపోతూ ఉంటారో… భూమిపైనా అదే పరిస్థితి ఉండేది. ఒకవేళ భూమిపై ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితి వస్తే.. కొన్ని సెకన్లపాటు భూమి గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతే? అల్లకల్లోలమే కదూ! భయమేస్తుంది కదూ..! ఇలా భయపెట్టే ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నది.

సదరు వైరల్‌ వార్త సారాంశం ఏమిటంటే.. ఈ ఏడాది ఆగస్ట్‌ 12వ తేదీన భూమి ఏడు సెకన్లపాటు తన గురుత్వాకర్షణ శక్తిని కోల్పోనుంది. ఇకచూస్కోండి.. ఈ మాటను పట్టుకుని సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, యూట్యూబ్‌ రీల్స్‌.. అన్నింటి దీని గురించే! ఆ రోజు గాల్లోకి లేచి.. తేలియాడుతాం.. మళ్లి ఒక్కసారిగా భూమ్యాకర్షణ శక్తి యథాతథ స్థితికి రాగానే ఒక్కసారిగా కిందపడితే.. కోట్ల మంది చనిపోవడం ఖాయం.. అంటూ వార్తలు పుట్టిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఈ రొంపిలోకి నాసాను కూడా దించేశారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ‘ప్రాజెక్ట్‌ యాంకర్‌’ పేరిట నాసా ఒక సీక్రెట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టిందని కూడా రాసేస్తున్నారు. తేదీ మాత్రమేనా.. సమయం కూడా రాసేశారు. 2026 ఆగస్ట్‌ 12వ తేదీన యూటీసీ 14.33 గంటలకు (భారత కాలమానంలో రాత్రి 8.03 గంటలకు) ఏడు సెకన్లపాటు భూమి తన ఆకర్షణ శక్తిని కోల్పోతుందని ఈ కథనాల్లో చెబుతున్నారు. ఈ సమయంలో గోడలకు, నేలకు ఫిట్‌ చేసి ఉన్నవి మినహాయిస్తే.. మనుషులతోపాటు.. కట్టిపెట్టని వస్తువులన్నీగాల్లోకి లేచిపోతాయని, ఏడు సెకన్ల తర్వాత మళ్లీ ఒక్కసారిగా కిందపడిపోవడంతో భారీ విధ్వంసం చోటు చేసుకుంటుందని, మరణాల సంఖ్య నాలు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకూ ఉంటుందని లెక్కలు కూడా కట్టేస్తున్నారు.

ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు నాసా.. ప్రాజెక్ట్‌ యాంకర్‌ అనే సీక్రెట్‌ ఆపరేషన్‌ చేపట్టిందని, దీనికోసం 89 బిలియన్‌ డాలర్లు కూడా కేటాయించారని చెబుతున్నారు. అంతేకాదండోయ్‌.. ముఖ్యమైన వ్యక్తుల కోసం బంకర్ల ఏర్పాటు సాగుతున్నదని కూడా కథనాలు వస్తున్నాయి. అందరూ నమ్మే విధంగా సైంటిఫిక్‌ పదాలు ఉపయోగిస్తున్నారు. రెండు బ్లాక్‌ హోల్స్‌ ఢీకొనడంతో భారీ గ్రావిటేషనల్‌ వేవ్స్‌ వస్తాయని, అవి భూమిని తాకడంతో భూమి గురుత్వాకర్షణ శక్తిని తాత్కాలికంగా నిలిపివేస్తాయని ఆ కథనాలు పేర్కొంటున్నాయి.

వాస్తవాలేంటి?

ఈ విషయంలో నాసా అధికారికంగా స్పందించలేదు. అయితే.. సానా ప్రతినిధి ఒకరు స్నూప్స్‌ అనే ఫ్యాక్ట్‌ చెకింగ్‌ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ఇవన్నీ బూటకపు వార్తలేనని తేల్చిపారేశారు. ‘భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి అనేది భూమి మొత్తం ద్రవ్యరాశి.. (mass) పైనే ఆధారపడి ఉంటుంది. భూమి తన మాస్‌ను కోల్పోతే తప్ప గురుత్వాకర్షణ శక్తి తగ్గడం లేదా కోల్పోవడం ఉంటుంది. అంతేకానీ.. బ్లాక్‌ హోల్స్‌, గ్రావిటేషనల్‌ వేవ్స్‌ వంటివాటితో భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తిపై ఎలాంటి సంబంధం, ప్రభావం ఉండబోవు’ అని ఆయన స్పష్టం చేశారు.

గురుత్వాకర్షణ అంటే?

ఏ వస్తువుకైనా ఎంత మాస్‌ ఉంటే అంత బలమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. అలా చూసినప్పుడు సూర్యుడి ఆకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది. జూపిటర్‌ (బృహస్పతి) గ్రహం గురుత్వాకర్షణ శక్తి.. భూమికంటే ఎక్కువ. వాస్తవానికి భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్లే మనం భూమిపై ఉండగలుగుతున్నాం. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కూడా ఇదే గురుత్వాకర్షణ శక్తి కారణం. ఈ వ్యవస్థను బ్లాక్‌ హోల్స్‌ ఢీకొనడం, లేదా కాస్మిక్‌ ఘటనలు ఎట్టిపరిస్థితిలోనూ మార్చలేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి తన గ్రావిటేషనల్‌ శక్తిని కోల్పోతుందని జరుగుతున్నదంతా పూర్తిగా బూటకమని తేల్చిపారేస్తున్నారు. కొంతమంది క్లిక్స్‌ కోసం చేస్తున్న అశాస్త్రీయ ప్రచారమని స్పష్టంచేస్తున్నారు. ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టించే తుంటరి, దుష్టయత్నాల్లో ఈ వార్తలు భాగమని అంటున్నారు. భూమి ఇప్పటిదాకా ఎలా ఉందో.. 2026 ఆగస్ట్‌లోనూ అలానే ఉంటుందని, ఏడు సెకన్ల వెయిట్‌లెస్‌ డే అనేది పూర్తిగా అబద్ధమని తేల్చి చెబుతున్నారు.

Read Also |

KTR : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్‌ నోటీసులు!
Wireless Electricity Transmission | వైర్లు వాడకుండానే విద్యుత్‌ సరఫరా.. సాకారం చేసే దిశగా అడుగులు
Anant Ambani Vantara Watch | అనంత్‌ అంబానీ ‘వంతారా’ థీమ్‌తో లగ్జరీ వాచ్‌.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Latest News