Nuclear Rockets | ఇకపై అణుశక్తితో దూసుకుపోనున్న రాకెట్లు? నష్టాలేంటి? లాభాలేంటి?

ఇప్పటిదాకా రసాయనాలను మండించడం ద్వారా రాకెట్లను పంపిస్తున్న చరిత్రను నాసా తిరగరాయబోతున్నది. రసాయనాల స్థానంలో ఏకంగా ఒక చిన్న అణు రియాక్టర్‌ను రాకెట్‌లో ఏర్పాటుచేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నది.

nuclear thermal propulsion rocket AI Creation

Nuclear Rockets | కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. 5..4..3..2..1..0 … భారీ శబ్దం.. నారింజ ఎరుపు రంగుల్లో మంటలు.. తెల్లని పొగ..! ఇదీ ఒక రాకెట్‌ ప్రయోగం ముందు జరిగేది. రాకెట్‌ చివరి భాగంలో ఇంధనాన్ని మండించడం ద్వారా దానిని అంతరిక్షంలోకి ప్రవేశపెడుతున్నది ప్రస్తుత విధానం. కానీ.. అదే రాకెట్‌లో ఏకంగా ఒక అణు రియాక్టర్‌ పనిచేస్తే.. ఆ అణు ఇంధనం శక్తితో ఆ రాకెట్‌ దిగంతాలకు దూసుకెళ్లితే? సైన్స్‌ఫిక్షన్‌లా కనిపిస్తున్న ఈ ఆలోచన.. వాస్తవరూపం దాల్చడానికి ఎంతో సమయం లేదు. నిజమే.. అతిత్వరలో అణు ఇంధనంతో రాకెట్‌ను ప్రయోగించేందుకు రంగం వేగంగా సిద్ధమవుతున్నది. 2026 ప్రారంభంలోనే అంతరిక్షంలో మొదటిసారిగా న్యూక్లియర్‌ ఇంజిన్లను పరీక్షించబోతున్నారు. అది విజయవంతమైతే.. అంగారకుడిపైకి యాత్ర మాత్రమే కాదు.. యావత్‌ మానవ అంతరిక్షయాత్రల తీరుతెన్నులు దిశదశలు మారిపోయే అవకాశాలు ఉన్నాయి.

ఏమిటీ న్యూక్లియర్‌ థర్మల్‌ ప్రొపల్షన్‌?

ఇప్పటిదాకా ఇంధనం, ఆక్సిజన్‌ కలిపి మండించడం ద్వారా థ్రస్ట్‌ను ఉత్పత్తి చేసే దాని ద్వారా రాకెట్‌ను భూమ్యాకర్షణ శక్తి నుంచి ఆవలకు పంపుతారు. అయితే.. తాజాగా ప్రయోగాలు జరుగుతున్న న్యూక్లియర్‌ థర్మల్‌ ప్రొపల్షన్‌లో ఇంధనం కాల్చడానికి బదులు ద్రవ హైడ్రోజన్‌ను వేడెక్కించేందుకు న్యూక్లియర్ ఫ్యూజన్‌ను ఉపయోగిస్తారు. రాకెట్‌లో ఉన్న చిన్న రియాక్టర్‌లో యురేనియం అణువులు విభజనకు గురై.. అత్యంత వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా ద్రవరూప హైడ్రోజన్‌ వేడెక్కి.. నాజిల్ ద్వారా బయటకు పోవడం ద్వారా రాకెట్‌కు థ్రస్ట్‌ ఇస్తుంది.

సామర్థ్యం ఏమిటి?

ప్రయోగం ఎలా?

భూమిపై నుంచి ఎన్‌టీపీ ర్యాకెట్లను ప్రయోగిస్తే భూవాతావరణం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అందుకే దీనిని ప్రయోగించడంలో రెండు దశలు ఉంటాయి.
1.ముందుగా సాధారణ రసాయనాలతో రాకెట్‌ను అంతరిక్షంలోని కక్ష్యలోకి పంపుతారు.
2.అక్కడికి చేరుకున్నాక న్యూక్లియర్‌ ఇంజిన్‌ను ఆన్‌ చేస్తారు. ఫలితంఆ భూమిపై అణు ప్రమాదాల ముప్పు గణనీయంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంగారకుడిపైకి వెళ్లే సమయంలో 25 శాతం వరకూ ఆదా!
ఎన్‌టీపీ రాకెట్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. ఉదాహరణకు అంగారకుడిపైకి వెళ్లేందుకు ఇప్పుడు అంచనా వేస్తున్న సమయంలో సుమారు 25 శాతం వరకూ తగ్గవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నాసా, డిఏఆర్‌పీఏ కలిసి సంయుక్తంగా Demonstration Rocket for Agile Cislunar Operations (DRACO) పేరిట ప్రాజెక్టును ప్రారంభించాయి. 2026 తొలి నెలల్లో మొదటి ఎన్‌టీపీ ఇంజిన్‌ను పరీక్షించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇది 2027కు వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) ప్రస్తుతానికి అణుశక్తి ఆధారిత పవర్‌ సిస్టమ్స్‌, ఫౌండేషనల్‌ టెక్నాలజీలపై పనిచేస్తున్నది. కానీ.. పూర్తి స్థాయిలో ఎన్‌టీపీ రాకెట్‌ ప్రోగ్రామ్‌కు చాలా ఏళ్లు పట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌లో పల్సర్‌ ఫ్యూజన్‌ వంటి కంపెనీలు న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ రాకెట్లను పరిశోధిస్తున్నాయి. అయితే.. ప్రస్తుతానికి అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.

మొత్తంగా 2026లో నిర్వహించే తొలి పరీక్ష.. ఈ సాంకేతిక కాగితాల నుంచి ఆచరణలోకి వస్తుందా? అనేదానికి సమాధానం ఇవ్వనున్నది.

Latest News