Chandrayaan-4 | చంద్రయాన్-4కి పర్ఫెక్ట్ అడ్రస్ పట్టేసిన ఇస్రో… చంద్రుడిపై స్థిర నివాసానికి ఇది పునాది?

మనం ఎక్కడికన్నా వెళ్లాలనుకున్నప్పుడు ఆ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాం. అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? అన్నీ అనుకున్నట్టు సజావుగా సాగిపోతాయా? అని ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకుంటాం. సరిగ్గా ఇస్రో సైతం అదే పని చేసింది. తన చంద్రయాన్‌ –4 ల్యాండింగ్‌ పాయింట్‌ను పక్కా పరిశీలన అనంతరం ఎంపిక చేసింది. అదే MM–4.

MM4, AI-generated image representational purposes only

Chandrayaan-4 | భారత అంతరిక్ష పురోగతిలో మరో కీలక అడుగు పడబోతున్నది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు చంద్రుడిపై ల్యాడింగ్‌కు కొత్త స్థలాన్ని ఎంపిక చేశారు. ఇది చంద్రునిపై మాన్స్‌ మౌటన్‌ (Mons Mouton) ప్రాంతంలోని MM–4 అనే స్పాట్‌. ఈ స్పాట్‌ చంద్రుడి దక్షిణ ధ్రువీనికి అత్యంత సమీపంఓల ఉంటుంది. ఇస్రో చంద్రయాన్‌–4ను చేపడుతున్న సంగతి తెలిసిందే. 2028లో ప్రయాణం ప్రారంభించబోయే చంద్రయాన్‌ –4.. ఇక్కడే దిగబోతున్నది. ఒక ఇంటికి వెళ్లేందుకు పర్ఫెక్ట్‌ అడ్రస్‌ను చూసుకున్నట్టు .. ప్రతి చిన్న అంశాన్నీ పరిగణనలోకి తీసుకున్న ఇస్రో.. ఈ తుది నిర్ణయానికి వచ్చింది.

మాన్స్‌ మౌటన్‌ అంటే ఏంటి?

మాన్స్‌ మౌటన్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న ఎత్తయిన పర్వత ప్రాంతం. ఇది అత్యంత కీలకమైనదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే.. అక్కడ నీటి మంచు (Water Ice) ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకే భవిష్యత్తు మిషన్లకు అనుకూలమైన ప్రాంతంగా భావిస్తున్నారు. ఇక్కడ గుంతలు ఎప్పటికీ నీడలోనే ఉంటాయి. తద్వారా అవి సహజంగా ఏర్పడి ఫ్రీజర్‌లా ఉపయోగపడతాయి. చంద్రుడిపై పరిశోధనలు చేయదల్చుకున్న అనేక దేశాలు ఇదే కారణంగా ఈ ప్రాంతంపై దృష్టిసారించాయి.

చంద్రయాన్‌ –4 ప్రత్యేకత ఏంటి?

ఇప్పటి వరకూ సాగిన చంద్రయానాలు.. ఫొటోలు తీసి డాటా పంపాయి. కానీ.. చంద్రయాన్‌ –4 వీటికి పూర్తి భిన్నంగా ఉండబోతున్నది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న నేల, రాళ్ల నమూనాలు సేకరించి భూమికి తీసుకురావడం దీని ప్రత్యేకత. అంటే.. చంద్రునిపై ఉన్న నిజమైన మట్టిని భారత పరిశోధనశాలల్లో పరిశీలించబోతున్నారు. ఈ మిషన్‌లో మొత్తం ఐదు కీలక దశలు ఉంటాయి. ఒకటి.. చంద్రుడిపై దిగడం, రెండు.. నమూనాలు సేకరించడం.. మూడోది తిరిగా లాంచ్‌ అవడం.. నాలుగోది భూ కక్ష్యకు చేరుకోవడం.. ఐదోది.. చివరిది.. అక్కడి నుంచి నమూనాలను సురక్షితంగా భూమిపైకి చేరవేయడం. ఈ క్రమంలో ఎక్కడైనా.. ఏ చిన్న తప్పు చోటు చేసుకున్నా.. మొత్తం మిషన్‌ ప్రమాదంలో పడుతుంది. అందుకే ల్యాండింగ్‌ స్పాట్‌ అనేది ఎంపికలో అత్యంత కీలకంగా మారింది. వీటని దృష్టిలో ఉంచుకునే ఈ స్పాట్‌ను ఎంపిక చేశారు.

చంద్రుడిపై స్థిర నివాసానికి ఇదే పునాది?

చందమామపై అపార ఖనిజ సంపద ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ స్థిరనివాసాలు ఏర్పాటు చేసి పరిశోధనలు చేసేందుకు దక్షిణ ధ్రువం అత్యంత కీలకంగా ఉపయోగపడనుంది. దక్షిణ ధ్రువంలోని కొన్ని ప్రాంతాలకు ఎప్పుడూ సూర్యకాంతి అందదు. అంటే.. అవి ఎప్పటికీ చల్లగానే ఉంటాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. వందల కోట్ల సంవత్సరాలుగా ఇక్కడ నీటి మంచు నిల్వలు ఉండొచ్చు. ఈ నీటి మంచుతో అద్భుతాలు సృష్టించవచ్చు. దీనితో తాగునీరు తయారు చేయవచ్చు. ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయవచ్చు. రాకెట్‌ ఇంధనం తయారు చేయవచ్చు. స్థూలంగా.. భవిష్యత్తులో చంద్రుడిపై స్థిర నివాసానికి ఇదే పునాది అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ స్పాట్‌ను ఎలా ఎంపికచేశారు?

చంద్రయాన్‌ –2  ఇప్పటికీ  చంద్రుని చుట్టూ తిరుగుతూ ప్రత్యేక కెమెరాతో తీసిన హై క్వాలిటీ చిత్రాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వాటి ఆధారంగా నాలుగు ప్రదేశాలను తొలుత ఎంపిక చేశారు. వాటికి MM–1, MM–2, MM–3, MM–4, MM–5 అని నామకరణం చేశారు. ఆ యా ప్రాంతాల్లో నేల వంగి ఉన్న కోణం, ఎత్తు, రాళ్లు, గుంతలు ఎంతమేరకు ఉన్నాయి? సూర్యకాంతి ఏ మేరకు అందుబాటులో ఉంటుంది? భూమితో కమ్యూనికేషన్‌ నిర్వహించేందుకు సౌకర్యవంతంగా ఉంటుందా? అనే అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు. చివరకు వాటన్నింటి నుంచి MM–4కు మొగ్గు చూపారు. MM–4 వద్ద వంపు కోణం ఒక కిలోమీటరు పరిధిలో సుమారు ఐదు డిగ్రీలు మాత్రమే. ప్రమాదకర ప్రాంతాలు 9శాతం మాత్రమే ఉన్నాయి. మొత్తం 568 సురక్షిత ల్యాండింగ్‌ పాయింట్స్‌ ఉన్నాయి. అంతేకాకుండా.. ఇది అడ్డంకులు అతి తక్కువగా ఉన్న సురక్షిత ప్రాంతమని తేలింది.

మనకేంటి?

మొదటగా సురక్షిత ల్యాండింగ్‌ చేసుకోవచ్చు. అది మిషన్‌ విజయంలో తొలి అడుగు అవుతుంది. చంద్రుడి పురాతన చరిత్రపై కొత్త సమాచారం లభిస్తుంది. నీటి మంచు ఉన్నట్టు ప్రత్యక్షంగా నిర్ధారణ అయితే.. భారతదేశపు దీర్ఘకాలిక మూన్‌ మిషన్లు, లేదా బేస్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేయడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అదే జరిగితే అంతరిక్ష రంగంలో భారత స్థాయిని ఇది మరింత పెంచుతుంది. మొత్తంగా ఇతర దేశాల దృష్టి కూడా ఇదే ప్రాంతంపై ఉన్న నేపథ్యంలో దక్షిణ ధ్రువం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిలో హాట్‌స్పాట్‌గా మారింది. చైనా ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో మిషన్లు నిర్వహించింది. అమెరికా సైతం ఇక్కడ నీటి మంచు కోసం రోవర్‌ను పంపేందుకు ప్రణాళికలను ప్రకటించింది. తానేమీ తక్కువ కాదంటూ తన సొంత డాటాపై ఆధారపడి.. కీలకమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా తెలివైన నిర్ణయం తీసుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి.. 

king of the jungle | వివాహ విందుకు ఊహించ‌ని అతిథులు.. ఫ్యామిలీతో వ‌చ్చిన జంగిల్ కింగ్‌
Bride Showered With Rs 8.5 Crore | వ‌ధువుపై నోట్ల వ‌ర్షం.. నిజంగానే రూ.8.5 కోట్లు ఉప‌యోగించారా..?
Maruti E-Vitara Launch : మారుతి నుంచి తొలి ఈవీ.. ఈ విటారా ఎస్ యూవీ లాంచింగ్

Latest News