Maruti E-Vitara Launch : మారుతి నుంచి తొలి ఈవీ.. ఈ విటారా ఎస్ యూవీ లాంచింగ్

మారుతి తొలి ఈవీ ఈ-విటారా ఎస్‌యూవీ లాంచ్. రూ.10.90 లక్షల ప్రారంభ ధర, 543 కి.మీ రేంజ్, BaaS ప్లాన్, 45 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్, 5-స్టార్ భద్రత రేటింగ్.

Maruti E-Vitara Launch : మారుతి నుంచి తొలి ఈవీ.. ఈ విటారా ఎస్ యూవీ లాంచింగ్

విధాత : భారతీయ కార్ల మార్కెట్ లో రారాజుగా కొనసాగుతున్న మారుతీ సుజుకీ కొత్తగా తమ తొలి ఈవీ ఈ-విటారా ఎస్ యూవీ(SUV) కారును లాంచ్ చేసింది. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్(బాస్) యాజమాన్య ప్రణాళికతో ప్రవేశపెట్టిన ఈ కారు బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కి.మీ దూసుకెళ్లే సామర్థ్యంతో రూపొందించారు. ఈ విటారా 61కిలో వాట్లు, 49కిలో వాట్ల సామర్ధ్యంతో వచ్చింది. ఈ కారు కోనుగోలు చేసిన వారికి 7.4కేడబ్ల్యూ ఏసీ సామర్ధ్యంతో కూడిన వాల్ బాక్స్ చార్జర్ ఇన్ స్టాలేషన్ సహా కాంప్లిమెంటరీగా అందించనుండటం విశేషం. చార్జింగ్ కోసం వినియోగదారులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారాఃతే కేవలం 45 నిమిషాల్లోనే 10% నుంచి 80% వరకు ఛార్జింగ్ చేసుకునేలా డిజైన్ చేశారు.

కొనుగోలుదారులకు బాస్ తో కూడిన ప్లెక్సిబుల్ ఓనర్ షిప్ ప్లాన్లు అందుబాటులో ఉంచనుంది. ఈ కారు ధర రూ.10.90లక్షలుగా నిర్ణయించారు. మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక ఫీచర్లతో ఈ కారును రూపొందించారు. నెక్సా (NEXA) డీలర్‌షిప్‌ల ద్వారా ఈ కారును విక్రయించనున్నారు. కంపెనీ ఈ విటారా ఎలక్ట్రిక్ కారును బాస్ (BaaS – Battery-as-a-Service) ప్లాన్ కింద విక్రయిస్తోంది. దీని ప్రకారం కారు కొనేటప్పుడు బ్యాటరీ ధరను చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకే కారు ధర భారీగా తగ్గింది. దీనికి బదులుగా కస్టమర్లు బ్యాటరీ అద్దెగా కిలోమీటరుకు రూ. 3.99 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే మధ్యతరగతి వారికి ఇది ఒక గొప్ప వెసులుబాటుగా చెబుతున్నారు.

కొత్త అప్షన్లతో ఆకర్షణీయంగా ఈవీ విటారా

ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న విటారాకు భిన్నంగా సరికొత్త డిజైన్, ఫీచర్స్ తో ఈవీ విటారాను తీసుకొచ్చారు. కారు ముందు భాగంలో స్టైలిష్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, వై ఆకారంలో ఉండే ప్రత్యేకమైన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు కారుకు ప్రీమియం లుక్‌ని ఇచ్చాయి. 19-అంగుళాల భారీ అలాయ్ వీల్స్ కారుకు మంచి రోడ్ ప్రెజెన్స్‌ను అందిస్తున్నాయి. కారు లోపలి భాగం చాలా లగ్జరీగా రూపొందించారు. దీనిలో 10.1-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ సౌకర్యం కోసం 2-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ సీట్లు (వేసవిలో చల్లగా ఉండే సీట్లు), వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్ వంటి హై-ఎండ్ ఫీచర్లను ఏర్పాటు చేశారు. విశాలమైన సీటింగ్ అమరికతో పాటు 236 లీటర్ల బూట్ స్పేస్ లగేజీ దీని ప్రత్యేకతలు.

ఇక రంగుల విషయానికొస్తే.. నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, బ్లూయిష్ బ్లాక్, ఆప్యులెంట్ రెడ్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. కారు పొడవు 4,275 మిమీ ఉండటంతో లోపల ప్రయాణీకులకు మంచి స్పేస్ లభిస్తుంది. ఈ కారును డెల్టా, జీటా, ఆల్ఫా అనే మూడు వేరియంట్లలో కంపెనీ విడుదల చేసింది. ఇప్పటికే ఈ కారు కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు రూ. 21,000 చెల్లించి మారుతి అధికారిక వెబ్‌సైట్ లేదా నెక్సా షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి. టాటా పంచ్ ఈవీ, ఎంజీ విండ్సర్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 100దేశాల్లో ఈ విటారా కారును విక్రయించాని మారుతీ సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది.

భద్రత విషయంలో మారుతి ఈవీ విటారా భారత్ NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. దీనిలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లు ఉన్నాయి. కారు పార్కింగ్ చేయడానికి 360-డిగ్రీ కెమెరా, సెన్సర్లు ఉండటం డ్రైవింగ్ ను సురక్షితం చేయనుంది.

ఇవి కూడా చదవండి :

HiLITE Group | ఉద్యోగుల‌కు రూ.20 కోట్ల విలువైన ల‌గ్జ‌రీ కార్ల‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన సంస్థ‌
Photographer | అద్దె ఇంటికోసం వెళ్లి.. షూర్యాక్‌లో ఉన్న తాళంతో రూ.55 ల‌క్ష‌ల విలువైన న‌గ‌లు చోరీ చేసిన ఫొటోగ్రాఫ‌ర్‌