ISRO’s LVM3-M6 launch | ఇస్రో ‘బాహుబలి’ రాకెట్‌తో బ్లూబర్డ్ బ్లాక్-2 : నేడే శ్రీహరికోట నుంచి ప్రయోగం

ఇస్రో రూపొందించిన శక్తివంతమైన LVM3-M6 బాహుబలి రాకెట్ ద్వారా 6,100 కిలోల బరువున్న బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహం శ్రీహరికోట నుంచి నేడు నింగికెగరనుంది. రికార్డు స్థాయిలో భారీ పేలోడ్​తో అంతరిక్షంలోకి దూసుకువెళ్లే ఈ మిషన్ భారత అంతరిక్ష వాణిజ్య రంగంలో చారిత్రక మైలురాయిగా నిలవనుంది.

India’s Baahubali rocket LVM3 ready for historic launch carrying BlueBird Block-2 satellite

ISRO’s LVM3-M6 Baahubali Rocket Launches Record-Breaking BlueBird Block-2 Satellite

సారాంశం
ఇస్రో అభివృద్ధి చేసిన శక్తివంతమైన LVM3-M6 ‘బాహుబలి’ రాకెట్, 6,100 కిలోల బరువున్న అమెరికా కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్-2ను డిసెంబర్ 24 ఉదయం 8:54 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించనుంది. నేరుగా స్మార్ట్‌ఫోన్‌లకు 4G–5G సేవలు అందించే ఈ ఉపగ్రహ ప్రయోగం, భారత అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో చారిత్రక మైలురాయిగా నిలవనుంది.

 

(విధాత సైన్స్​​ డెస్క్​)

శ్రీహరికోట, డిసెంబర్ 24, 2025:
ISRO’s LVM3-M6 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో అభివృద్ధి చేసిన బాహుబలి రాకెట్, లాంచ్ వెహికల్ మార్క్​ 3 (LVM3-M6), అమెరికాకు చెందిన AST SpaceMobile రూపొందించిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్-2 (బ్లూబర్డ్-6)ను డిసెంబర్ 24 బుధవారం ఉదయం 8.54 గంటలకు శ్రీహరికోటలోని  సతీశ్​ ధావన్​ అంతరిక్ష కేంద్రం(Satish Dhawan Space Centre) రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఆకాశంలోకి పంపనుంది.

రికార్డు స్థాయి బరువుతో నింగిలోకి దూసుకెళ్లనున్న ‘బాహుబలి’

ఈ మిషన్‌కు సంబంధించి 24 గంటల కౌంట్‌డౌన్ డిసెంబర్ 23న ప్రారంభమైంది. అన్ని వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని, వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉందని ఇస్రో అధికారులు తెలిపారు. ప్రయోగానికి ముందు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం.

సుమారు 6,100 కిలోల బరువు కలిగిన బ్లూబర్డ్ బ్లాక్-2, ఇప్పటివరకు ఇస్రో LVM3 రాకెట్ ద్వారా దిగువ భూ క్షక్ష్య(LEO)లోకి పంపే అత్యంత భారీ ఉపగ్రహంగా రికార్డు సృష్టించనుంది. గతంలో 4,400 కిలోల బరువున్న CMS-03 ఉపగ్రహమే ఇప్పటివరకు రికార్డుగా ఉండేది. ప్రయోగానంతరం సుమారు 15 నిమిషాల్లో ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయి, 520–600 కిలోమీటర్ల ఎత్తులో వర్తులాకార దిగువ భూక్షక్ష్యలో స్థిరపడనుంది.

ఈ ప్రయోగం ఇస్రో వాణిజ్య విభాగమైన NewSpace India Limited (NSIL) మరియు AST SpaceMobile మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా జరుగుతోంది. ఇది LVM3 రాకెట్‌కు ఆరో ఆపరేషనల్ ఫ్లైట్, అలాగే మూడో వాణిజ్య కార్యక్రమం కావడం గమనార్హం.

అంతరిక్షం నుంచే స్మార్ట్‌ఫోన్‌కు నెట్‌వర్క్మాచార వ్యవస్థలో విప్లవాత్మక మార్పు

బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహంలో ఉన్న 223 చదరపు మీటర్ల ఫేజ్‌డ్ అర్రే యాంటెన్నా కారణంగా ఇది ఇప్పటివరకు దిగువ భూక్షక్ష్యలోకి పంపిన అతిపెద్ద వాణిజ్య మాచార ఉపగ్రహంగా నిలవనుంది. ఈ ఉపగ్రహం ద్వారా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకే నేరుగా 4G, 5G వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, టెక్స్ట్ మెసేజెస్, డేటా, స్ట్రీమింగ్ సేవలు అందించడమే లక్ష్యం. ప్రత్యేక టెర్మినల్స్ లేదా డిష్ యాంటెన్నాలు అవసరం లేకుండా నేరుగా మొబైల్ ఫోన్‌లకు కనెక్టివిటీ అందించడమే ఈ సాంకేతికత ప్రత్యేకత.

ఇస్రో యొక్క అత్యంత శక్తివంతమైన రాకెట్ అయిన LVM3 (జియోసింక్రోనస్ సాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్-3) 43.5 మీటర్ల ఎత్తు, 640 టన్నుల ప్రయోగ బరువు కలిగి ఉంది. రెండు భారీ S200 సాలిడ్ బూస్టర్లు, L110 లిక్విడ్ కోర్ స్టేజ్, C25 క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్‌తో కూడిన మూడు దశల నిర్మాణం దీనికి అపారమైన శక్తిని అందిస్తుంది. చంద్రయాన్-2, చంద్రయాన్-3, రెండు OneWeb మిషన్లతో సహా ఇప్పటివరకు నిర్వహించిన అన్ని ప్రయోగాల్లో ఈ రాకెట్ 100 శాతం విజయవంతమైన ట్రాక్ రికార్డ్ను కొనసాగిస్తోంది.

AST SpaceMobile ఇప్పటికే 2024లో బ్లూబర్డ్-1 నుంచి బ్లూబర్డ్-5 వరకు ఐదు ఉపగ్రహాలను ప్రయోగించింది. 2026 నాటికి 45 నుంచి 60 ఉపగ్రహాలతో గ్లోబల్ నెట్‌వర్క్‌ను విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా పూర్తి కవరేజ్ అందించాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. మారుమూల గ్రామాలు, సముద్రాలు, ఎడారులు, ప్రకృతి విపత్తు ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ను పూర్తిగా మార్చే సామర్థ్యం ఈ మిషన్‌కు ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని వారు డిసెంబర్ 24 ఉదయం 8.24 గంటల నుంచి ఇస్రో అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్‌లో, ఏటీఎస్​ స్పేస్​మొబైల్​ యూట్యూబ్​ చానెల్​లో కూడా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. ఈ మిషన్ విజయవంతమైతే, స్పేస్‌ఎక్స్, అరియాన్‌స్పేస్ వంటి దిగ్గజ సంస్థలతో పోటీపడుతూ  ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో భారత్ స్థానం మరింత బలపడనుంది.

Latest News