- నేరగాడు సీఎం అయినందువల్ల ఈ సంఘటనలు
- ఢిల్లీలో ప్రభుత్వానికి మద్దతిస్తున్నవారికి సంబంధం
- అగ్నిప్రమాదం పై రిటైర్డ్ జడ్డితో విచారణ జరగాలి
- కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి
- వరంగల్ లో మీడియా సమావేశంలో కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
విధాత, ప్రత్యేక ప్రత్యేక ప్రతినిధి:
హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదం.. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి కుట్రగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరోపించారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు చేశారని అన్నారు. వరంగల్ పర్యటన సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి కేటీఆర్ మాట్లాడారు. ఓటుకు నోటు కేసు ముగింపు దశకు వచ్చి శిక్ష పడుతుందన్న కారణంగానే రేవంత్ రెడ్డి ఈ ప్రమాదం వెనుక ఉన్నారని ఆయన ఆరోపించారు. ఒక క్రిమినల్, దొంగ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం వలన అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయన్నారు. మూడు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో ఉన్న అగ్నికీలలను ఆర్పడానికి మూడున్నర గంటల సమయం పట్టడం కుట్రగా భావిస్తున్నామన్నారు. చలికాలం అగ్ని ప్రమాదం జరగడం, ఉద్యోగులు ఎవరూ లేరని చెప్పడం, నిన్న ప్రమాదం పెద్దగా జరగలేదని చెప్పి, ఈ రోజు 10 సంవత్సరాల కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే ఇది కచ్చితంగా రేవంత్ రెడ్డి చేయించిన పనేనని కేటీఆర్ అన్నారు.
ఢిల్లీలో బీజేపీతో అంటకాగుతున్న కొంతమంది వ్యక్తుల సూచన మేరకు ఫోరెన్సిక్ ల్యాబ్‌ని రేవంత్ రెడ్డి తగలబెట్టించాడన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంతో లాలూచీ పడి తన అవినీతిని, అక్రమాలను కప్పి పెట్టుకుంటున్న రేవంత్ రెడ్డి, ఈ ఓటుకు నోటు కేసు విషయంలో కూడా కేంద్రంతో లోపాయికారీ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఛోటా భాయ్‌ని బడే భాయ్ కాపాడకుంటే కేంద్రం స్పందించి రిటైర్డ్ జడ్జితో ఉన్నత స్థాయి విచారణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
