Epstein and Bill Gates | కొవిడ్‌ ‘గేట్‌’ తెరిచారా? పాండమిక్‌ బాండ్లు, ఫైనాన్షియల్‌ లింకులు వైరల్‌.. వాస్తవాలేంటి?

కొవిడ్‌ మహమ్మారి ఆగమనం వెనుక భారీ కుట్ర ఉందా? ‘గేట్‌’ తెరిచి మరీ దీనిని ప్రవేశపెట్టారా? ఇందుకోసం ఘోర లైంగిక నేరాల కేసులలో నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ ముందే ప్లాన్‌ చేశారా?

Epstein and Bill Gates |  కొవిడ్‌! యావత్‌ ప్రపంచాన్ని సుమారు మూడేళ్లపాటు ఉక్కిరిబిక్కిరి చేసిన వైరస్‌! ఆ దెబ్బకు ఇంకా ప్రపంచంలోని అనేక రంగాలు కోలుకోనేలేదు. అయితే.. ఈ కొవిడ్‌ మహమ్మారి ఆగమనం వెనుక భారీ కుట్ర ఉందా? ‘గేట్‌’ తెరిచి మరీ దీనిని ప్రవేశపెట్టారా? ఇందుకోసం ఘోర లైంగిక నేరాల కేసులలో నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ ముందే ప్లాన్‌ చేశారా? పాండమిక్‌ బాండ్లు, ఆర్థిక ఒప్పందాలు, పాత మెసేజ్‌లు, సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలను గమనిస్తే అవుననే అనిపిస్తోందంటున్నారు నెటిజన్లు. గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో అనేక పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. ఎప్‌స్టీన్‌, బిల్‌ గేట్స్‌, ప్రపంచ బ్యాంకు పాండమిక్‌ బాండ్స్‌, Swiss Re కంపెనీ మధ్య ఉన్న సంబంధాలను నెటిజన్లు ఆ పోస్టుల్లో ప్రస్తావిస్తున్నారు. వీటన్నింటి మధ్య ‘లాభాల నెట్‌వర్క్‌’ ఉన్నదని ఆరోపిస్తున్నారు.

అసలేమిటీ పాంమిక్‌ బాండ్లు?

ఈ మొత్తం వివాదానికి కారణమైన పాండమిక్‌ బాండ్లను 2017లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. వీటి ద్వారా సుమారు 2898 కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించాయి. ఏదైనా మహమ్మారి ప్రబలితే అత్యవసర నిధులు ఇచ్చేందుకు వీటిని రూపొందించారు. కరోనా వైరస్‌ కూడా.. ఇందులో కవర్‌ చేసిన వ్యాధుల జాబితాలో ఉంది. ఈ బాండ్లు పారామెట్రిక్‌ ట్రిగ్గర్స్‌ సిస్టమ్‌పై పనిచేస్తాయి. అంటే.. ఏవైనా దేశాల్లో నిర్దిష్ట సంఖ్యలో ఇన్ఫెక్షన్స్‌ పెరిగితే.. ఆటోమెటిక్‌గా నిధులు విడుదలవుతాయి. అయితే.. కొవిడ్‌ మొదటి వేవ్‌లో.. 2020 ఏప్రిల్‌లో మొదటిసారి ఈ బాండ్లు యాక్టివేట్‌ అయ్యాయి. ఇదే ఇప్పుడు సంచలన ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. ముందే తెలిసి ఈ బాండ్లను ప్లాన్‌ చేశార? అని సామాజిక మాధ్యమాల్లో అనుమానాలు పోటెత్తుతున్నాయి. విశ్వమారి రావడానికి మేందు ఫైనాన్షియల్‌ పొడక్ట్స్‌ ఉండటం అంటే.. అది వస్తుందని ముందు తెలియడం వల్లే కదా? అని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు 2017లో ఎప్‌స్టీన్‌ ఫోన్‌ నుంచి వెళ్లినట్టు చెబుతున్న కొన్ని మెసేజ్‌లు వివాదాన్ని మరింత పెంచాయి. ప్రత్యేకించి.. హెల్త్‌ ఫైనాన్షియల్‌ టూల్స్‌. పారామెట్రిక్‌ ట్రిగ్గర్స్‌ వంటి పదాలు ఉండటం గమనార్హం. మరో కీలక అంశం ఏమిటంటే.. Swiss Re కంపెనీ.. ప్రపంచ బ్యాంకు యొక్క పాండమిక్‌ బాండ్‌ కార్యక్రమానికి సహకరించడం. దీంతో ఇదొక రహస్య ప్రాఫిట్‌ నెట్‌వర్క్‌ అనే ప్రచారం సోషల్‌ మీడియాలో ఊపందుకుంది.

ఈవెంట్‌ 201 కూడా ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తున్నది. 2019 అక్టోబర్‌లో జరిగిన ఈవెంట్‌ 201లో పాడమిక్‌ సిమ్యూలేషన్‌ నిర్వహించారు. అంటే.. కరోనా వంటి వైరస్‌లు వస్తే ఎలా ఎదుర్కొనాలనేదానిపై వర్క్‌షాప్‌ అనుకోవచ్చు. ఇది కరోనా వైరస్‌ ప్రబలబోతున్నదని ముందే తెలిసి చేసిన రిహార్సిల్‌ అని సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

అయితే.. ఆర్థిక నిపుణులు మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు. ఈ బాండ్లు.. ఎబోలా, సార్స్‌ వంటి మహమ్మారాల తర్వాతే రూపొందించారని అంటున్నారు. అరుదైన విపత్తులకు ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులు తయారు చేయడం మార్కెట్‌లో సహజమేనని అంటున్నారు. ముందుస్తు ప్రణాళికలు రూపొందించుకోవడం అంటే.. ముందస్తు సమాచారంతోనే అనే అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఎప్‌స్టీన్‌ నేరుగా పాండమిక్‌ బాండ్లు రూపొందించాడనేందుకు ఆధారాలు లేవని విశ్లేషకులు అంటున్నారు. టైమ్‌లైన్స్‌ మ్యాచ్‌ కావడం కుట్రను నిరూపించే అంశం కాదని చెబుతున్నారు. అనేక ప్రాజెక్టుల్లో పెద్ద పెద్ద ఫైనాన్షియల్‌ కంపెనీలు, రీ–ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఒకేసారి పనిచేయడం కొత్తేమీ కాదని అంటున్నారు. ఒక పెద్ద శ్వాసకోస వైరస్‌ విశ్వమారిగా వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చాలా కాలంగానే హెచ్చరిస్తున్నారని పలువురు గుర్తు చేస్తున్నారు. పాండమిక్‌ బాండ్లు, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌, గ్లోబల్‌ హెల్త్‌ డ్రిల్స్‌ నిజమే కానీ.. ఇవన్నీ చోటు చేసుకున్నాయి కాబట్టి.. ఎవరో ఈ కరోనా వైరస్‌ను సృష్టించారని అర్థం కాదని అంటున్నారు.

Latest News