Epstein Files Controversy | ఎప్‌స్టీన్ ఫైల్స్ ఎఫెక్ట్… గేట్స్‌కు ఏంటీ దుస్ధితి?.. న్యూఢిల్లీలో ఉండీ సమ్మిట్‌కు దూరం
గేట్స్ గురువారం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో కీలకోపన్యాసం చేయాల్సి ఉంది. అకస్మాత్తుగా గేట్స్ ఫౌండేషన్ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ఆయన హాజరు కావడం లేదని, కీలక ఉపన్యాసం కూడా చేయడం లేదని స్పష్టం చేసింది.
Epstein Files Controversy | బిల్ గేట్స్. ఈ పేరు వినగానే ప్రపంచంలో ఎవరైనా గుర్తు పట్టేస్తారు. ఆయనే మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకులు బిల్ గేట్స్. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026లో పాల్గొనేందుకు వచ్చారు. తొలుత ఆయన ఏపీలో పర్యటించిన తర్వాత ఢిల్లీకి వెళ్లిపోయారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026లో కీలకోపన్యాసం చేయాల్సి ఉండగా వెళ్లడం లేదని గేట్స్ ఫౌండేషన్ అధికారికంగా ఎక్స్‌లో స్టేట్‌మెంట్ ఇచ్చింది. తమ సంస్థ తరపున ఆఫ్రికా, ఇండియా ఆఫీసెస్ ప్రెసిడెంట్ అంకుర్ వోరా పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొంది.
ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026కు ప్రపంచం నలుమూలల నుంచి టెక్ కంపెనీ యజమానులు, సీఈఓలు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ కూడా వచ్చారు. తన పర్యటనలో భాగంగా ఆయన తొలుత ఏపీలో పర్యటించారు. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఒక పర్యటన పూర్తి చేసుకుని తిరిగి ఢిల్లీ ప్రయాణమయ్యారు. ముందస్తు ఆహ్వానం ప్రకారం గేట్స్ గురువారం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో కీలకోపన్యాసం చేయాల్సి ఉంది. అకస్మాత్తుగా గేట్స్ ఫౌండేషన్ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ఆయన హాజరు కావడం లేదని, కీలక ఉపన్యాసం కూడా చేయడం లేదని స్పష్టం చేసింది. గేట్స్ ప్రతినిధిగా అంకుర్ వోరా ప్రసంగిస్తారని పేర్కొన్నారు. తమ ఉమ్మడి ఆరోగ్య, అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడానికి వీలుగా భారతదేశంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గేట్స్ ఫౌండేషన్ వెల్లడించింది. దీంతో టెక్ నిపుణులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఢిల్లీ వచ్చిన తరువాత, ఏపీలో జరిగిన కార్యక్రమానికి వెళ్లిన ఏఐ సమ్మిట్ కు హాజరు కాకపోవడం ఏంటని చర్చించుకున్నారు.
అమెరికన్ ఫైనాన్షియర్, బాలల లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్ స్టీన్ ఫైల్స్ వివరాలను ఇటీవలే యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ 300 మంది ప్రపంచ ప్రముఖుల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పేరు బయటకు రావడం టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏఐ సమ్మిట్ కు హాజరై కీలక ఉపన్యాసం చేస్తే ఎదురయ్యే పరిస్థితులపై బిల్ గేట్స్ తన ప్రతినిధులతో సమీక్షించుకుని వెనక్కి తగ్గారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రసంగం తరువాత మీడియా నుంచి ఎప్ స్టీన్ ఫైల్స్ పై ప్రశ్నిస్తే ఏం చేయాలనే దానిపై చర్చించుకుని, వెళ్లకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారంటున్నారు.
మరో వాదన కూడా విన్పిస్తున్నది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరు కావాల్సిందిగా కొన్ని నెలల క్రితమే నిర్వాహాకులు ఆహ్వానం పంపించారు. ఆహ్వానం పరిశీలించిన ఆయన అంగీకారం తెలుపుతూ తన షెడ్యూల్ వివరాలను పంపించారు. ఆ ప్రకారంగానే గురువారం కీలక ఉపన్యాసం చేయాల్సి ఉంది. తాజాగా యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన జాబితా అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో బిల్ గేట్స్ ఇచ్చిన ఆహ్వానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమీక్షించిందనే ప్రచారం సమ్మిట్ లో జరిగింది. కీలక ఉపన్యాస కార్యక్రమానికి హాజరు కావడం కంటే వెనక్కి తగ్గడం మంచిదని కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్లడంతోనే దూరం జరిగారని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram