FASTag Toll Payment Rule From April 1, 2026: Cashless Toll Collection Across India
ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల్లో క్యాష్ బంద్
2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు కానున్నాయి. ఇకపై వాహనదారులు ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే టోల్ చెల్లించాలి. ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ప్రయాణాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
విధాత భారత్ డెస్క్ | హైదరాబాద్:
New Toll Payment Rule | జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను పూర్తిగా రద్దు చేయనుంది. ఇకపై టోల్ రుసుములు కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ప్రయాణాన్ని మరింత సాఫీగా మార్చడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నగదు చెల్లింపులకు చెక్… డిజిటల్ పేమెంట్లకే ప్రాధాన్యం
ప్రస్తుతం అనేక టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉన్నప్పటికీ, నగదు చెల్లింపులకు అవకాశం ఉంది. దీని వల్ల క్యాష్ లేన్ల వద్ద వాహనాలు నిలిచిపోవడం, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడడం సాధారణంగా మారింది. ఈ పరిస్థితికి ముగింపు పలకాలని కేంద్రం నిర్ణయించింది. టోల్ ప్లాజాల్లో ఇక నుంచి క్యాష్ లేన్లు ఉండవు. వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే టోల్ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విధానం అమలులోకి వస్తే వాహనాలు ఆగకుండా కొన్ని సెకన్లలోనే టోల్ దాటే అవకాశం ఉంటుంది. తద్వారా ఇంధన వృథా తగ్గడంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేయవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బ్యారియర్ ఫ్రీ హైవేల దిశగా తొలి అడుగు : Mutli Lane Free Flow (MLFF) Tolling system
క్యాష్‌లెస్ టోల్ విధానం ద్వారా మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోలింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానంలో టోల్ గేట్లు, బ్యారియర్లు ఉండవు. కెమెరాలు, సెన్సార్ టెక్నాలజీ ద్వారా వాహన నంబర్‌ను (Automated Number Plate Recognition – ANPR) గుర్తించి ఆటోమేటిక్‌గా టోల్ వసూలు చేస్తారు. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో టోల్ దాటినా ఈ సాంకేతికత నెంబర్ ప్లేట్‌ను గుర్తిస్తుంది. ప్రస్తుతం దేశంలోని 25 టోల్ ప్లాజాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా బ్యారియర్ ఫ్రీ హైవేల అమలు చేసే అవకాశం ఉంది.
వాహనదారులకు సూచనలు… ఇవి పాటిస్తే ఇబ్బందుల్లేవు
ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో వాహనదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
- ఫాస్టాగ్ అకౌంట్ యాక్టివ్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి
• కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలి
• ప్రయాణానికి ముందు వాలెట్ బ్యాలెన్స్ సరిపడా ఉందో చూడాలి
• అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు యూపీఐ యాప్ సిద్ధంగా ఉంచుకోవాలి
డిజిటల్ పేమెంట్ సదుపాయం లేకుండా టోల్ గేట్లకు వస్తే జరిమానా విధించే అవకాశం లేదా ప్రవేశం నిరాకరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
క్యాష్‌లెస్ టోల్ విధానం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు, హైవే ప్రయాణం మరింత వేగంగా, సురక్షితంగా మారనుంది. ఫాస్టాగ్, యూపీఐ వినియోగాన్ని పెంచుతూ డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
