Senior Heroes | 2027 సంక్రాంతి పోరు… చిరు, వెంకీ, నాగ్, బాలయ్య సినిమాలతో టాలీవుడ్‌లో భారీ హైప్2026 సంక్రాంతి సినిమాల సందడి ముగియడంతో బాక్సాఫీస్ వద్ద ఈసారి మంచి పోటీ కనిపించినా, రాబోయే 2027 సంక్రాంతి మాత్రం మరింత భారీ స్థాయిలో ఉండబోతుందనే అంచనాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కారణం టాలీవుడ్‌కు స్తంభాలుగా నిలిచిన నలుగురు సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ తమ సినిమాలను అదే పండుగ సీజన్‌లో విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే వార్తలు వినిపించడం. ఇప్పటికే ఈ అంశంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా అక్కినేని నాగార్జున సినిమా విషయానికి వస్తే 2027 జనవరి 15న విడుదల కాబోతుందని అధికారిక ప్రకటన రావడం ఈ సంక్రాంతి పోరుకు మరింత బలం చేకూర్చింది.
అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా “వాసివాడి తస్సాదియ్యా” పేరుతో సంక్రాంతికి సోగ్గాళ్లు రాబోతున్నారని ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇది “సోగ్గాడే చిన్నినాయనా” ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కే సినిమా అని, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 2026 సంక్రాంతికి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత మళ్లీ 2027 పండుగపైనే దృష్టి పెట్టారని సమాచారం. దర్శకుడు బాబీతో చేయబోయే కొత్త చిత్రాన్ని అదే సీజన్‌లో విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక 2026లో “విశ్వంభర” చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండగా, వరుసగా రెండు సంవత్సరాలు సంక్రాంతి బరిలో నిలవాలనే ప్లాన్ మెగాస్టార్ క్యాంప్‌లో ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే దర్శకుడు అనిల్ రావిపూడితో ఆయన కాంబినేషన్ ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్లకు ప్రతీకగా మారింది. ఎఫ్2, ఎఫ్3, “సంక్రాంతికి వస్తున్నాం” వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మళ్లీ అదే జోనర్‌లో కొత్త ప్రాజెక్ట్ సిద్ధమవుతోందనే టాక్ ఉంది. 2027 సంక్రాంతికి ఈ కాంబో నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రావచ్చని, “సంక్రాంతికి వస్తున్నాం”కి సీక్వెల్ అయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సీజన్ ప్రత్యేకమైన సెంటిమెంట్‌గా ఉండటం తెలిసిందే. గతంలో పండుగ సమయంలో విడుదలైన ఆయన చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతికి విడుదల చేయాలనే యోచనలో ఉన్నారని సమాచారం.
ఈ నలుగురు స్టార్ హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగితే థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఊహించలేనిదిగా మారుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్ సీనియర్ స్టార్‌ల సమరంతో 2027 సంక్రాంతి ప్రత్యేకమైన పండుగగా నిలిచే అవకాశం ఉందని, తెలుగు సినిమా చరిత్రలో ఇది మరొక మెమరబుల్ సీజన్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
