YS Jagan | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వివాహ శుభకార్యం అంగరంగ వైభవంగా జరిగింది. జగన్ సోదరుడు సునీల్ రెడ్డి (జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు) తనయుడు సాహిల్ రెడ్డి వివాహ వేడుక ఆదివారం చెన్నైలోని ప్రముఖ లీలా ప్యాలెస్ హోటల్‌లో సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరుకావడంతో వైఎస్ కుటుంబంలో చాలా కాలం తర్వాత పండుగ వాతావరణం నెలకొంది. ఈ వివాహానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు తమిళనాడుకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వంటి రాజకీయ నాయకులు వధూవరులను ఆశీర్వదించారు. అలాగే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరై సందడి చేశారు. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడంతో ఈ వివాహం ప్రత్యేక చర్చకు దారితీసింది. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు విజయ్, సూర్య, కార్తీ ఈ వేడుకకు హాజరై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యంగా హీరో విజయ్‌తో జగన్ స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకోవడం, ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని చిరునవ్వులతో మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అలాగే సూర్య, కార్తీలతో జగన్ సరదాగా ముచ్చటించిన దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హీరో విజయ్ రాజకీయంగా చురుకుగా ఉన్న వేళ ఈ భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇది పూర్తిగా కుటుంబ వేడుకలో జరిగిన ఆప్యాయ పలకరింపే తప్ప రాజకీయ సంబంధం లేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుక వైఎస్ కుటుంబానికి మాత్రమే కాకుండా రెండు రంగాల్లోనూ చర్చనీయాంశంగా మారడం విశేషంగా నిలిచింది.
చెన్నైలో వైయస్ సునీల్ రెడ్డి గారి (వైయస్ జగన్ పెదనాన్న వైయస్ జార్జిరెడ్డి కుమారుడు) కుమారుడి వివాహ వేడుకకు హాజరైన వైయస్ జగన్ గారి కుటుంబ సభ్యులు.
ఈ వేడుకలో వైయస్ జగన్ గారిని కలిసి, ఆత్మీయంగా పలకరించిన TVK పార్టీ అధ్యక్షులు విజయ్ గారు#YSJaganInChennai pic.twitter.com/TI6n6oiEol
— YSR Congress Party (@YSRCParty) February 8, 2026
