- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి
- నర్సంపేట రోడ్‌షోలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి కర్రుకాల్చివాత పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నర్సంపేట అంటేనే పోరాటల గడ్డ, ఉద్యమాల అడ్డాగా అభివర్ణించారు. రాష్ట్రంలో కేవలం నర్సంపేటలో మాత్రమే ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ పైపులైన్ ఉందని, ఇది సాధించిన నాయకుడు పెద్ది అంటూ గుర్తుచేశారు. జిల్లా కేంద్రం కాకుండా మెడికల్ కాలేజీని తన నియోజకవర్గంలోకి తీసుకొచ్చుకున్న నాయకుడని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి శ్రమించిన సుదర్శన్ రెడ్డిని ఓడించి ఇప్పుడు ఇబ్బందిపడుతున్నారంటూ వివరించారు. ఒక్క తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోస పడుతున్నామన్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు తులం బంగారం ఇస్తాన్నన్నారు.. రాలేదని, రూ. 4000 పెన్షన్ ఇస్తానన్నారు… రాలేదని విమర్శించారు. బతుకమ్మ చీర రాలె, రంజాన్ తోఫా రాలె, సకాలంలో రైతులకు యూరియా రాలె అంటూ తీవ్రంగా విమర్శించారు. ఇక డిసెంబర్ లో ఇవ్వాల్సిన రైతు బంధు, ఫిబ్రవరి వచ్చినా రాలేదంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికే మనకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేసుకుని ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలంటూ హితవుపలికారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ దొంగ హామీలేనంటూ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆడవాళ్ల మెడలో పుస్తెల తాడు దొంగతనం చేసే దండుపాళ్యం బ్యాచ్ అని అభివర్ణించారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
