Wireless Electricity Transmission | వైర్లు వాడకుండానే విద్యుత్‌ సరఫరా.. సాకారం చేసే దిశగా అడుగులు

వైర్లు లేకుండా గాలి ద్వారా విద్యుత్ పంపించే టెక్నాలజీపై శాస్త్రవేత్తలు కీలక అడుగు వేశారు. అల్ట్రాసానిక్ తరంగాలు, లేజర్లతో తక్కువ కరెంటు సక్సెస్‌గా సప్లై చేశారు.

Wireless Electricity Transmission

ఒకప్పుడు కమ్యూనికేషన్‌ కోసం మనం వైర్లతో నడిచే ల్యాండ్‌ ఫోన్లను ఉపయోగించే వాళ్లం. ప్రస్తుతం డిజిటల్‌ విప్లవంతో వైర్‌లెస్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ల్యాండ్‌ ఫోన్ల స్థానంలో మొబైల్‌ ఫోన్లు వచ్చాయి. వైర్లతో సంబంధం లేకుండానే మొబైల్‌ ఫోన్ల ద్వారా కమ్యూనికేషన్‌ నడుపుతున్నాం. మొబైల్స్‌కు ఛార్జింగ్‌ కూడా వైర్‌ లేకుండానే పెట్టుకునే సదుపాయం కూడా ఉంది. ఇంటర్నెట్‌ విషయంలోనూ ఇదే సూత్రం పనిచేసింది. ప్లగ్స్‌, వైర్లు, కేబుల్స్‌ ఇలా ఏవీ అవసరం లేకుండానే ఇంటర్నెట్‌ పొందే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అయితే, కరెంటు విషయంలో మాత్రం ఇప్పటి వరకూ మనం వైర్లపైనే ఆధారపడుతున్నాం. కానీ భవిష్యత్తులో వైర్‌లెస్‌ విద్యుత్‌ సరఫరా (electricity without wires) కోసం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. దీన్ని సాకారం చేసే ఆదిశగా అడుగులు పడుతున్నాయి.

ఫిన్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఔలు శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా గాలి ద్వారా కరెంటును సప్లై చేశారు. ఇందుకోసం వారు తొలుత అల్ట్రాసానిక్‌ శబ్ద తరంగాలను, లేజర్లు, ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీని సిద్ధం చేసుకొన్నారు. అకోస్టిక్‌ వైర్‌గా (అదృశ్య వైరు) పిలిచే ఈ ప్రత్యేక ఛానల్‌ గుండా కరెంటును లక్షిత ప్రాంతానికి పంపించారు. విద్యుత్తును కాంతిగా మార్చి అనంతరం మళ్లీ విద్యుత్తుగా బట్వాడా చేయడంలో లేజర్లు కీలకంగా పని చేశాయి. అయితే, ఎలక్ట్రానిక్‌, స్మార్ట్‌ డివైజ్‌లు పనిచేయడానికి అవసరమయ్యే అత్యంత తక్కువ మోతాదు కలిగిన కరెంటును మాత్రమే తాజా ప్రయోగంలో పంపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్కువ స్థాయిలో కరెంటు సరఫరాకు మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

తీగలు లేకుండానే కరెంటు సరఫరా

చాలా దూరాలకు విద్యుత్‌ను నేరుగా పంపడం కష్టం. అందుకే శాస్త్రవేత్తలు కరెంటును ముందుగా మైక్రోవేవ్స్‌ లేదా లేజర్‌ తరంగాలుగా మార్చుతారు. ఆ తరంగాలను గాలి ద్వారా పంపిస్తారు. అక్కడ ఉన్న ఒక రిసీవర్‌ వాటిని తిరిగి విద్యుత్‌గా మార్చుతుంది. ఈ విధానాన్ని మైక్రోవేవ్‌ పవర్‌ బీమింగ్‌ అంటారు. వైర్ల అవసరం లేకుండానే గాలి ద్వారా కరెంటు సరఫరా అవుతుంది. తీగలు లేకుండానే కరెంటు సరఫరా కోసం శాస్త్రవేత్తలు ఏండ్లుగా రకరకాల పద్ధతిలో ప్రయోగాలు చేస్తున్నారు. వీరి కృషి ఫలిస్తే మాత్రం ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

ఎన్నో ప్రయోజనాలు..

విద్యుత్‌ వైర్లు చాలా ప్రమాదకరమన్న విషయం తెలిసిందే. వర్షాకాలంలో వీటిని ముట్టుకుంటే ప్రాణాలు పోతాయి. విద్యుత్‌ తీగలను తాకి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ మరణాలకు గాలి ద్వారా విద్యుత్‌ సరఫరా చెక్‌ పెట్టనుంది. అంతేకాదు, ఆసుపత్రులు, కర్మాగారాలు, ఇంధన కేంద్రాలు, తడిగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో భద్రత పెరుగుతుంది. కరెంటు వైర్లు తొలగిస్తే షాక్‌ వంటి ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాదు, ఫోన్ల ఛార్జింగ్‌ కోసం కేబుల్స్‌, పవర్‌ బ్యాంక్స్‌ అవసరం కూడా ఉండదు. ఈవీలకు ఛార్జింగ్‌ పోర్టుల్లోని ప్లగ్‌లను పదేపదే తీసి పెట్టాల్సిన పని కూడా లేదు.

ఇది కష్టతరం

అయితే, గాలి ద్వారా విద్యుత్‌ సరఫరా ప్రక్రియ చాలా కష్టతరం. అంతే కాదు ఖర్చుతో కూడుకున్నది కూడా. వైర్‌లెస్‌ కరెంటుకు అవసరమైన భారీ వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా కష్టం అని నిపుణులు చెబుతున్నారు. మరి చూడాలి శాస్త్రవేత్తలు అనుకున్నది సాధించి అసాధ్యాన్ని సుపాధ్యం చేస్తారో లేదో..

ఇవి కూడా చదవండి :

Naini Coal Block | నైనీ కోల్​ బ్లాక్​ టెండర్​ రద్దు : ఆరోపణల నేపథ్యంలో వెనక్కితగ్గిన సింగరేణి
Anant Ambani Vantara Watch | అనంత్‌ అంబానీ ‘వంతారా’ థీమ్‌తో లగ్జరీ వాచ్‌.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Latest News