విధాత, జనగామ :
రాబోయే వేసవిలో లోడ్ కు సరిపడేలా 100 నుండి 160 KVA ట్రాన్స్‌ఫార్మర్ సామర్ధ్యం పెంపు చేసే విధంగా చూడాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు . మంగళవారం జనగాం జిల్లాలోని వడ్లకొండ 220 / 132 కెవి సబ్ స్టేషన్ ను ఆయన సందర్శించి కొత్తగా అవసరమైన ఫీడర్ల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అనంతరం నూతనంగా నిర్మించే సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు . పనుల పురోగతిపై చర్చిస్తూ అధునాతనంగా తీర్చిదిద్దాలని , పచ్చదనం , మొక్కలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. తదనంతరం 33/11 కెవి పెంబర్తి గేట్‌వే సబ్ స్టేషన్‌ను సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న O&M (ఆపరేషన్ & మెయింటెనెన్స్) సిబ్బందితో సమావేశమయ్యారు. విద్యుత్ సరఫరా నాణ్యత, ఫీల్డ్ సమస్యలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు .
సీఎండీ డివిజినల్ ఇంజనీర్లతో సమీక్షిస్తూ రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం పనులు వేగంగా పనులు అయ్యేలా చూడలని కోరారు. ఇంటర్ లింకింగ్ పనులు, కొత్త సబ్ స్టేషన్‌ల నిర్మాణం పనులు త్వరగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. రెవెన్యూ కనెక్షన్లు 100 శాతం రావాలని అన్నారు. వినియోగదారుల విశ్వాసాన్ని పెంచేది, ఫీల్డ్ స్థాయిలో వినియోగదారులతో నేరుగా ఇంటరాక్షన్ అయ్యేది O&M సిబ్బందే అని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ఫీల్డ్ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉండాలని సీఎండీ సూచించారు. “ఒక్క చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. కాబట్టి భద్రతకు ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి పని ప్రారంభించే ముందు LC యాప్ ద్వారా అనుమతి తీసుకోవడం తప్పనిసరి” అని పేర్కొన్నారు.
సంస్థ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఉద్యోగుల రక్షణ కోసం అవసరమైన హెల్మెట్, గ్లోవ్స్, పోర్టబుల్ ఎర్తింగ్ రాడ్స్, షార్ట్ సర్క్యూట్ కిట్లు, సేఫ్టీ షూస్, ఇన్సులేటెడ్ టూల్స్, వోల్టేజ్ డిటెక్టర్లు అన్ని రకాల భద్రతా పరికరాలు అందిస్తున్నామని సీఎండీ తెలిపారు. ఫీల్డ్ సిబ్బంది నుండి సీనియర్ అధికారుల వరకు ప్రతి ఒక్కరూ భద్రతపై ఒకే దృష్టితో పనిచేస్తేనే ప్రమాదాలు పూర్తిగా తగ్గుతాయని అన్నారు. ఈ దిశగా సంస్థ ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిందని, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని వెల్లడించారు. సిబ్బందికి పనిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, మెటీరియల్ అవసరాలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జనగాం సూపరింటెండెంట్ ఇంజనీర్ సిహెచ్.సంపత్ రెడ్డి, డిఈ లు లక్ష్మీనారాయణ రెడ్డి, గణేష్, విజయ్ కుమార్ , సారయ్య, ఏడిఈ స్వామి రెడ్డి , ఈఈ సివిల్ వెంకటేశ్వర్లు , ఎస్ఏ ఓ సుదర్శన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
