ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఫ్యామిలీ ఎంత లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తుందో అందరికీ తెలిసిందే. వారు వాడే వస్తువులు, ధరించే దుస్తులు, కార్లు, జ్యువెల్లరీ ఇలా ఒకటేంటి అన్నీ చాలా ఖరీదైనవే ఉంటాయి. వారి దగ్గర ఉండే వస్తువులు అన్నీ ప్రత్యేక ఎడిషన్‌వే ఉంటాయి. ఇక అంబానీ కుటుంబంలో అనంత్ అంబానీ (Anant Ambani) గురించి ప్రత్యేకంగా పరిచయమే అక్కర్లేదు. గతేడాది రాధికా మర్చెంట్‌తో పెళ్లి సమయంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. వెడ్డింగ్ సమయంలో అనంత్, రాధిక ధరించిన వస్తువులు ప్రత్యేకంగా హైలెట్ అయ్యాయి.
ఇక అనంత్ అంబానీకి వాచ్‌లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన దగ్గర ఎన్నో ఖరీదైన వాచ్‌లు కూడా ఉన్నాయి. మార్కెట్‌లోకి కొత్త గడియారం వచ్చిందంటే చాలు అది తన వాచ్ కలెక్షన్‌లో చేరిపోవాల్సిందే. అనంత్ వద్ద ఇప్పటకే రూ.కోట్లు ఖరీదు చేసే వాచ్‌లు ఉన్నాయి. రిచర్డ్ మిల్లె (Richard Mille), ఆడెమర్స్ పిగ్యెట్ (Audemars Piguet) వంటి బ్రాండ్‌లు, ప్రత్యేకమైన వజ్రాలు, రత్నాలతో పొదిగిన గడియారాలు, ప్రపంచంలోనే పరిమిత సంఖ్యలో తయారైన వాచీలు ఉన్నాయి. అనంత్ అంబానీ అప్పుడప్పుడు వాటిని ధరించి వాచ్‌లపై తనకున్న ఫ్యాషన్‌ను ప్రపంచానికి చాటి చెబుతుంటారు. పెళ్లి సమయంలో అనంత్ ధరించిన ఓ వాచ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది మరి. అంతేకాదు, ప్రత్యేకమైన ఈవెంట్స్ వేళ ఫ్రెండ్స్‌కు ఖరీదైన వాచ్‌లను కూడా గిఫ్ట్‌గా ఇస్తుంటాడు అ కుబేరుడు.
ఈ నేపథ్యంలో తాజాగా అనంత్ వద్దకు మరో అద్భుతమైన వాచ్ వచ్చి చేరింది. ప్రపంచ ప్రసిద్ధి లగ్జరీ వాచ్ మేకర్ ‘జాకబ్ అండ్ కో’ (Jacob And Co) అనంత్ అంబానీకోసం ఓ ప్రత్యేకమైన వాచ్‌ను డిజైన్ చేసింది. గుజరాత్ జామ్‌నగర్‌లో అనంత్ స్థాపించిన వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రం ‘వంతారా’ (Vantara) థీమ్‌తో ఈ గడియారాన్ని రూపొందించింది. ఈ వంతారా ఎడిషన్ గడియారాన్ని జాకబ్ అండ్ కో ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దింది. ఈ వాచ్ మధ్యలో అనంత్ బొమ్మతోపాటూ సింహం, బెంగాల్ టైగర్, ఏనుగు వంటి బొమ్మలను రూపొందించారు. ఈ వాచ్ వన్యప్రాణుల పట్ల అనంత్ అంబానీ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ వాచ్ మొత్తం గ్రీన్ కలర్ థీమ్‌తో మెరిసిపోతోంది. దీని తయారీలో ప్రత్యేకమైన డైమండ్స్ వాడినట్లు తెలుస్తోంది. ఇక ధర విషయానికొస్తే ఈ వాచ్ ఖరీదు రూ.13 కోట్లకు పైమాటే అని సమాచారం. ప్రస్తుతం ఈ వాచ్ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
వంతారా ప్రత్యేకత..
వంతారా అనంత్ అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రాలలో ఒకటి. గాయపడిన, అనాథలుగా మారిన జంతువులను రక్షించి, వాటికి సహజమైన వాతావరణాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం. వంతారాలో మొత్తం 43 విభిన్న జాతులకు చెందిన 2000 దాకా జంతువులు ఉన్నాయి. అందులో 200 ఏనుగులు ఉన్నాయి. మంచు చిరుతలు, తెల్ల పులులతో పాటు విభిన్న రకాల చిరుతలు, పులులు, సింహాలు ఇక్కడ తిరుగుతుంటాయి. అనేక రకాల పాములు, మొసళ్లు, జిరాఫీలు, జీబ్రాలు, హిప్పోలు.. భారత్ సహా ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చేరాయి. అంతేకాదు, అంతరించిపోతున్న జాతులుగా ఉన్న దేవాంగ పిల్లి, బట్టమేక పిట్ట, రాబందు, ఒకాపి, కారకల్ లాంటి జంతు, పక్షుజాతులెన్నో ఇక్కడ తమ ఉనికిని పెంపొందించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. జామ్ నగర్‌లో మొత్తం 3000 ఎకరాల్లో ఉన్న దీనిలో ఈ జీవులన్నీ తమ కోసం కేటాయించిన విశాలమైన ప్రాంగణాల్లో సంచరిస్తుంటాయి. వీటి బాగోగులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకునేందుకు 2100 మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. 75 యానిమల్ అంబులెన్సులు కూడా ఉన్నాయిక్కడ.
25000 చదరపు అడుగుల్లో ఆసుపత్రి
వంతారాలో ప్రధాన ఆకర్షణ ఏనుగులే. ఇక్కడ ఉండే 200కు పైగా గజరాజుల సంరక్షణ కోసం 25000 చదరపు అడుగుల్లో ఆసుపత్రి కట్టారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. భారీగా ఉండే ఈ జంతువులకు ఆర్థరైటిస్‌లాంటి ఎముకల సమస్యలు ఏర్పడుతుంటాయి. దానికి హైడ్రోథెరపీ అని చేస్తారు. కాళ్ల సమస్యలు, కీళ్ల నొప్పులు ఉండే ఏనుగులు ఇక్కడి హైడ్రోథెరపీ పూల్స్‌లో కొన్ని గంటల పాటు సేదతీరి, సాంత్వన పొందుతుంటాయి.
పరిశోధనలకూ ప్రత్యేక విభాగం..
ఇక్కడ కేవలం జంతువులను కాపాడి ఆరోగ్యాన్ని బాగు చేయడమే కాదు.. వాటి గురించిన పరిశోధనలు జరిపే ప్రత్యేక విభాగమూ వంతారాలో ఏర్పాటయింది. ఆపదలో ఉన్న జంతువుల సంరక్షణ కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN), వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF)లతో కలిసి పనిచేస్తున్నది వంతారా. వివిధ దేశాల్లోని జంతు సంరక్షణ కేంద్రాలతో పాటు ముఖ్యంగా మెక్సికో, వెనెజువెల్లాలో ఉన్న రెస్క్యూ సెంటర్ల భాగస్వామ్యమూ ఉంది.
ఇవి కూడా చదవండి :
CRPF Officer Simran Bala | మరో చరిత్ర సృష్టించబోతున్న భారత నారీ..గణతంత్ర వేడుకలే వేదిక!
Bill Gates | వైట్‌కాలర్ ఉద్యోగాలకు ఏఐ ముప్పు.. హెచ్చరించిన బిల్ గేట్స్
