Ambani Adani | ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న భారత పారిశ్రామిక, వ్యాపార సామ్రాజ్యాల అధినేతలు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ మరోసారి చేతులు కలిపారు. ఇప్పటికే ఇద్దరికీ పెట్రో రిటైల్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. ఈ రెండింటికీ లాభదాయకంగా ఉండేలా సంయుక్త అమ్మకాలకు భాగస్వామ్య ఒప్పందాన్ని ఇద్దరు శతకోటీశ్వర పారిశ్రామిక వేత్తలు కుదుర్చుకున్నారు. బ్రిటన్‌కు చెందిన బీపీతో కలిసి జాయింట్ వెంచర్ జియో బీపీని అంబానీ ఇంధన సంస్థ నిర్వహిస్తున్నది. ఇది అంబానీ గ్రూప్‌నకు చెందిన సీఎన్‌జీ రిటైల్ ఔట్‌లెట్లలో పెట్రోల్, డీజీల్ అమ్మకాలు ప్రారంభిస్తునంది.
మరోవైపు ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎనర్జీస్ గ్రూపుతో కలిసి అదానీ గ్రూపు అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్.. జీయో బీపీ ఔట్‌లెట్లలో సీఎన్‌జీ డిస్పెన్సర్లను ఏర్పాటు చేయనున్నదని బుధవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇప్పటికి ఉనికిలో ఉన్న ఔట్‌లెట్లతోపాటు.. రానున్న రోజుల్లో ఏర్పాటు చేసేవాటిలో కూడా ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. జియె బీపీకి దేశవ్యాప్తంగా 1,972 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఏటీజీఎల్ 34 భౌగోళిక ప్రాంతాల్లో 650 సీఎన్‌జీ స్టేషన్లను నిర్వహిస్తున్నది.
వ్యాపార రంగంలో ఒకరిని ఒకరు అధిగమించాలని ప్రయత్నించే ఈ శత కోటీశ్వరుల మధ్య కుదిరిన రెండో ఒప్పందం ఇది. ఇద్దరూ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారే. ఆసియాలో అత్యంత ధనవంతుల స్థానాన్ని అటూఇటూగా పొందుతూ వస్తున్నారు. గత ఏడాది మార్చి నెలలో మధ్యప్రదేశ్‌లో సంయుక్తంగా విద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుకు తమ తొలి ఒప్పందాన్ని చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంపీలోని అదానీ పవర్ ప్రాజెక్టులో అంబానీ సంస్థ రిలయెన్స్.. 26 శాతం వాటాలు కొనుగోలు చేసింది. క్యాప్టివ్ ఉపయోగం కోసం ఈ ప్లాంటు నుంచి 500 మెగావాట్ల విద్యుత్తును వినియోగించుకునేందుకు సంతకం చేసింది.