విధాత : ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి(శ్రీ మహావిష్ణువు) సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినఅందందే గలడు దానవాగ్రణి వింటే! అని మహాకవి పోతనా మాత్యుడు రాసిన శ్రీమద్భాగవతంలోని పద్యంలో హిరణ్యకశ్యపుడుతో అతని కుమారుడైన ప్రహ్లాదుడు చెప్పిన సందర్బంలోని పద్యం ఇప్పుడు భారత్ లోని మహిళలకు కూడా వర్తించేదిగా మారింది. “సాధనతో సమకూరు సకల విద్యలు” అన్నట్లుగా…ఆకాశంలో సగం..అవనిలో సగం మేం సైతం అంటూ భారత నారీ మణులు క్రమంగా అన్ని రంగాల్లో పాగా వేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా గణతంత్ర వేడుకల వేదికగా భారత వీరనారీమణి మరో అరుదైన చరిత్రను సృష్టించబోతుండటం గమనార్హం.
సీఆర్పీఎఫ్ బెటాలియన్ కవాతకు వీరనారీ నాయకత్వం
జమ్మూ కాశ్మీర్ కు చెందిన 26 ఏళ్ల సీఆర్పీఎఫ్(CRPF) అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో భారత ఆర్మీ చరిత్రలో కొత్త ఆధ్యాయం లిఖించబోతున్నారు. ఆమె తన సైనిక దళంలోని పురుష దళానికి నాయకత్వం వహించబోతున్నారు. భారత గణతంత్ర దినోత్సవ కవాతులో ఒక మహిళా అధికారి సీఆర్పీఎఫ్ పురుష దళానికి నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి కానుండటంతో …ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవబోతుంది. గణతంత్ర వేడుకల్లో 140 మందికి పైగా పురుష సిబ్బందితో కూడిన సీఆర్పీఎఫ్ బృందానికి సిమ్రాన్ బాలా నాయకత్వం వహించబోతున్నట్లుగా ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు.
శాశ్వత కమిషన్ ఆమోదంతో సైన్యంలో పెరిగిన అతివల ప్రాతినిధ్యం
భారత సైన్యంలో మహిళలు మొదట్లో వైద్యం, నర్సింగ్ వంటి విభాగాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. 2020లో సుప్రీం కోర్టు తీర్పుతో మహిళా అధికారులకు అన్ని విభాగాలలో శాశ్వత కమిషన్ (Permanent Commission) లభించింది. అప్పటి నుంచి కమాండింగ్ పొజిషన్లలో మహిళలు సాయుధ దళాల్లో ఎదుగుతున్నారు. ప్రస్తుతం భారత సాయుధ బలగాల్లో నియామకాల్లో లింగ వివక్ష లేదు. ఆయుధాలు,సేవల కోసం పురుష, మహిళా సైనికులను నియమిస్తున్నారు. భారత సైన్యం మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కోసం 23 నవంబర్ 2021న జెండర్ న్యూట్రల్ కెరీర్ ప్రోగ్రెషన్ పాలసీని ప్రవేశపెట్టారు. ఆర్మీ ఫిరంగిదళం, ఎయిర్ ఫోర్స్, నేవీ ఫోర్సులలో మహిళలు వేంగా కల్నల్ స్ధాయికి ఎదుగుతున్నారు.
ఆపరేషన్ సింధూర్ తో సరికొత్త చరిత్రకు శ్రీకారం
గతంలో భారత ఆర్మీలో పురుష అధికారులు షార్ట్ సర్వీస్ కమిషన్ పదేళ్లు పూర్తి చేస్తే తమ అర్హత ప్రకారం శాశ్వత కమిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ మహిళలు అలాంటి అవకాశం లేకపోవడంతో వారిని షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా సైన్యంలో భర్తీ చేస్తున్నారు. పురుషులను మాత్రం నేరుగా శాశ్వత కమిషన్ ద్వారా కూడా భర్తీ చేయవచ్చు. ఈ వివక్షతకు సుప్రీంకోర్టు తీర్పు మంగళం పాడింది. సుప్రీం ఆదేశాలతో “మహిళలకు సైన్యంలోని పది శాఖల్లో, అంటే.. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, సిగ్నలింగ్, ఇంజనీర్స్, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, ఆర్మీ సర్వీస్ కార్ప్స్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్, ఇంటెలిజెన్స్ కార్ప్స్ లో శాశ్వత కమిషన్(పీసీ) పొందుతో ఆయా విభాగాల్లో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు నాయకత్వం వహించిన కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ల విజయగాథ సైన్యంలో మహిళల ప్రవేశానికి స్పూర్తిదాయకంగా మారడం విశేషం.
