విధాత : భారత్ పై మరోసారి పాక్ ఉగ్రవాదులు భారీ ఉగ్ర కుట్రకు తెరలేపడం కలకలం రేపింది. భారత్ పాక్ సరిహద్దుల్లో పాక్ నుంచి ఉగ్రవాదులు చొరబడినట్లుగా గుర్తించిన భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసు బృందాలు ఉగ్రవాదుల కోసం విస్తృత గాలింపులు చేపట్టాయి. కథువా, డోక్లాన్ సెక్టార్ లలో ఉగ్రవాదుల కదలికల సమాచారంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల జాడను అన్వేషిస్తూ కూంబింగ్ ఆపరేషన్స్ సాగిస్తున్నారు.
ఫిబ్రవరి 14వ తేదీతో పుల్వామాలో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడికి ఏడేళ్లు నిండనున్నాయి. ఈ సందర్భంగా మరోసారి భారీ ఉగ్రదాడుల కోసం ఉగ్రవాదులు భారత్ సరిహద్దుల్లోకి చొరబడినట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని 10 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. సోమవారం ఉదయం బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. వెంటనే డాగ్ స్క్వాడ్స్‌తో కలిసి బాంబు డిస్పోజల్ విభాగం ఆయా ప్రాంతాలకు చేరుకుని తనిఖీలు చేస్తున్నట్లు డీఎఫ్‌ఎస్ అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలను ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు.
పుల్వామా గాయం…పహల్గామ్ దారుణం
భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటిగా 2019ఫిబ్రవరి 14న జరిగిన పుల్వమా ఉగ్రదాడి నిలిచిపోయింది. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు.సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతున్న క్రమంలో పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో వెంటనే సంభవించిన భారీ పేలుడులో లో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు.
పుల్వామాలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ వైమానిక దళం 2019 ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. ప్రతిగా పాకిస్తాన్ వైమానిక దళం ఫిబ్రవరి 27న జమ్మూ, కాశ్మీర్‌లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది. కౌంటర్ గా మరోసారి భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్‌కు చెందిన యుద్ధ విమానం ‘మిగ్-21’ పాకిస్తాన్ సైన్యం దాడిలో కూలిపోయిన నేపథ్యంలో పైలట్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ సైనికులు పట్టుకున్నారు. అయితే 2019మార్చి 1న అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేయడంతో రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు సద్దుమణిగాయి.
ఆ తర్వాతా 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో పాక్ ఉగ్ర మూకలు దాడికి పాల్పడి 26మంది పర్యాటకులను కాల్చి చంపాయి. దీంతో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో 2025 మే 7న భారత సాయుధ దళాలు పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులతో విరుచుక పడి..తొమ్మిడి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది, 100మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Bacteria On Your Mobile Screen | మొబైల్ స్క్రీన్‌పై వేల సంఖ్యలో బ్యాక్టీరియా.. షాకింగ్ వీడియో
Mumbai Local Train | బురఖా ధరించి లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కిన యువకుడు.. తర్వాత ఏమైందంటే..?
