Site icon vidhaatha

 Jagadish Reddy : కృష్ణా నీళ్లు సముద్రం పాలు..ఎండుతున్న నల్లగొండ చెరువులు 

krishna-water-wastage-nalgonda-tanks-empty-jagadish-reddy

Jagadish Reddy | విధాత : కృష్ణా నదికి భారీగా వరదలొచ్చి నాగార్జున సాగర్ నుండి వందల టీఎంసీల నీరు సముద్రం పాలు జేస్తున్నారని.. కానీ జిల్లాలోని చెరువులను నింపక సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం ఆయన నల్లగొండలోని పానగల్ ఉదయం సముద్రం రిజర్వాయర్ నీటి మట్టాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణ జలకళ ఉన్నా… జిల్లాలో చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయన్నారు. కృష్ణా నీటితో జిల్లాలో పూర్తి స్థాయిలో చెరువులు నింపకుండా, మేజర్ల కింద, డిస్ట్రిబ్యూటరీల కింద నీళ్లు విడుదల చేయకుండా రైతాంగానికి నష్టం చేస్తున్నారని..ఏఎమ్మార్పీ కింద చివరి ఆయకట్టు కు సాగునీరు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కనీస సోయి లేదని..ఏపీకి నీళ్లు వదిలేంత ఆత్రుత జిల్లాలో రైతులకు నీళ్లు ఇద్దాం అని వారికి లేకపోవడం దురదృష్టకరం అన్నారు. హెలికాఫ్టర్ల సోకు, ఆర్భాటాలు తప్ప రైతుల మీద వారికి ప్రేమ లేదని విమర్శించారు. ఒక వైపు బనకచర్ల తో గోదావరి నీటిని ఆంధ్రకు కట్టబెట్టాలని చూస్తున్నారని..కృష్ణా నీళ్లను సైతం సాగర్ గేట్లు ఎత్తి దిగువన ఆంధ్ర పాలు చేస్తున్నారని ఆరోపించారు. తమకు నీళ్లు ఇవ్వమని ధర్నా చేస్తున్న రైతులపై మంత్రి వెంకట్ రెడ్డి కేసులు పెట్టించారని విమర్శించారు. దందాలు.. కమిషన్లు కాంట్రాక్టులు తప్ప వీళ్లకు వేరే సోయి లేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కనీసం ఉదయ సముద్రం రిజర్వాయర్ కూడా నింపలేని అసమర్ధ దద్దమ్మ మంత్రులు ఉత్తమ్, వెంకట్ రెడ్డిలు అని విమర్శించారు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా వారు పంటలు ఎండబెట్టారని..కనీసం ఈ ఏడాదైన వెంటనే పూర్తిస్థాయిలో కృష్ణా నీటిని జిల్లాలోని చెరువులకు మళ్లించి ఆయకట్టు రైతాంగానికి నీరు ఇవ్వాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

సాగునీటిపై చర్చకు సవాల్

మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చి చూపినం… చెరువులు నిండు కుండల్లాగా ఉంచినామని…ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చినామని చెప్పుకొచ్చారు. ఏఎమ్మార్పీ లిఫ్ట్ కింద ఉన్న డీ25, డీ26, డీ29, డీ31,39,40 డిస్ట్రిబ్యూటరీల కింద 70 వేల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత మాది అని..వరుసగా 8 ఏళ్ళు నీళ్లు ఇచ్చినామని..-తమ పదేళ్ల పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెరువులన్నీ మత్తడి దూకాయన్నారు. .ఉత్తమ్, వెంకట్ రెడ్డిలు మంత్రులైన తర్వాత మళ్ళీ పొలాలు ఎండిపోతున్నాయని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. ఏఎమ్మార్పీ మోటార్లను రిపేర్లు చేయించలేని దుస్థితిలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉందని విమర్శించారు. ఇప్పటిదాక జిల్లా మంత్రులు సాగునీటిపై సమీక్షలు కూడా పెట్టలేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో సాగునీరు.. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో సాగునీటి నిర్వహణపై చర్చకు సిద్ధమా..? ఉదయ సముద్రం కట్టపై చర్చకు మంత్రులు సిద్ధమా అంటూ సవాల్ జగదీష్ రెడ్డి సవాల్ చేశారు.

గెస్ట్ హౌస్ గానే వాడాలి

నల్గొండ పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను మంత్రి సొంత క్యాంపు ఆఫీస్ గా మార్చడం దురదృష్టకరం అని…గెస్ట్ హౌస్ గానే ఉంచాలని డిమాండ్ చేస్తున్నామని..వీఐపీలు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ ను ఉపయోగించుకుంటారని. మంత్రి క్యాంపు ఆఫీస్ కోసం దానిని వాడుకోవద్దన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వమే దానికి రూ.6.25కోట్లు మంజూరు చేసి నల్లగొండ ఐకాన్ లాగా మేము దానిని నిర్మించామన్నారు. క్షుద్రపూజలు అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్న .కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి వర్గంలో కొనసాగే అర్హత లేదని జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు,ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

ట్రక్కు లోయలో పడి ఆర్మీ జవాన్ మృతి

పార్కింగ్ విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం !

Exit mobile version