నామినేటెడ్ పదవుల పందేరానికి రంగం సిద్ధం.. ఈ నెలాఖరు నుంచే!

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో పదవుల కోసం భారీ సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారు

  • Publish Date - January 7, 2024 / 12:16 PM IST
  • భారీ సంఖ్య‌లో ఊరిస్తున్న కీల‌క ప‌ద‌వులు
  • అంతే సంఖ్య‌లో ఆశ‌పెట్టుకున్న నేత‌లు
  • ఎమ్మెల్సీలు, కార్పొరేష‌న్ చైర్మ‌న్ 
  • ప‌ద‌వుల‌కు ద్వితీయ శ్రేణి నేత‌ల‌ పోటీ
  • 54 కార్పొరేష‌న్లు.. 33 గ్రంథాల‌య సంస్థ‌లు
  • ఇవిగాక ప‌లు ఆల‌యాల పాల‌క‌మండ‌ళ్లు
  • అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున హామీలు
  • అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన‌వారికి మ‌రో చాన్స్‌
  • ఆ ఎన్నిక‌ల్లో పార్టీ మాట విన్న‌వారికి ప‌ట్టం
  • సామాజిక స‌మీక‌ర‌ణ‌లూ ప‌రిగ‌ణ‌న‌లోకి
  • లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోపే భ‌ర్తీ చేసే అవ‌కాశం
  • వాటికి శ్రేణుల‌ను సిద్ధం చేసే ప్ర‌య‌త్నం
విధాత ప్ర‌త్యేకం: అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిశాయి. త‌దుప‌రి లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఈలోపే పార్టీ నాయ‌క‌త్వాన్ని ఆయా నామినేటెడ్ పోస్టుల్లో నియ‌మించే ప్ర‌క్రియ‌ను అధికార కాంగ్రెస్ పార్టీ ప‌ట్టాలెక్కించింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య‌కు దాదాపు స‌మానంగా ఉండే చైర్మ‌న్‌, ఇత‌ర నామినేటెడ్ పోస్టుల కోసం పార్టీలో పెద్ద సంఖ్య‌లోనే ఆశావ‌హులు కాచుకుని కూర్చున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ మాట విని, టికెట్ రాక‌పోయినా అభ్య‌ర్థుల గెలుపుకోసం కృషి చేసిన‌వారికి తొలి ప్రాధాన్యం ఇస్తార‌న్న చ‌ర్చ న‌డుస్తున్న‌ది. మొద‌ట‌గా ఇద్ద‌రు గవర్నర్ కోటా రెండు ఎమ్మెల్సీలు, ఇద్ద‌రు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశావహులు కాంగ్రెస్‌లో భారీగానే ఉన్నారు.
అటు కార్పొరేష‌న్ల చైర్మన్ల పదవుల కోసం కూడా నేతల జాబితా చాలానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో భాగంగా సర్ధుబాట్లు, బుజ్జగింపుల క్రమంలో పలువురు నేతలకు నామినేటెడ్ పదవుల ఆశ చూపారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిందున‌ తమకు నామినేటెడ్ పదవుల యోగం కల్పించాలని వారు సీఎం రేవంత్‌రెడ్డిపైన ఒత్తిడి పెంచుతున్నారు. ఒక‌వైపు లోక్‌స‌భ ఎన్నిక‌లు ముంచుకువ‌స్తున్న నేప‌థ్యంలో ఆలోపే వీలైన‌న్ని నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డం ద్వారా పార్టీలో అసంతృప్తి అనేది లేకుండా చూడాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఈ నెలాఖరులోగానే వీలైనన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తార‌ని స‌మాచారం. 
ఇప్ప‌టికే అధిష్ఠానంతో చ‌ర్చ‌
ఇప్పటికే నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలతో చర్చించిన రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులు, కార్పొరేష‌న్ల‌ చైర్మన్ల అభ్యర్థుల ఎంపికపై అంతర్గత కసరత్తులో నిమగ్నమయ్యార‌ని తెలుస్తున్న‌ది. ముఖ్యంగా కార్పొరేషన చైర్మన్ల కోసం సొంత పార్టీలో సిఫారసుల ఒత్తిడి అధికంగా ఉండటం.. అసెంబ్లీ ఎన్నికల వేళ టికెట్ ఆశావహులకు ఇచ్చిన మాట అమలు చేయడం వంటి ఒత్తిళ్ల మధ్య రేవంత్‌రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ‌ట్టి క‌స‌ర‌త్తే చేయాల్సి వ‌స్తున్న‌ద‌ని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి.  
ఎమ్మెల్సీలపై స్పష్టత.. కార్పొరేషన్లపై మ‌థ‌నం
గవర్నర్ కోటా ఎమ్మెల్యేలకు సంబంధించి అభ్యర్థుల ఖరారులో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టతతో ఉన్నారని సమాచారం. రెండింటిలో ఒకటి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఇవ్వనున్నట్లుగా తెలుస్తున్న‌ది. మరొక స్థానానికి అందెశ్రీ పేరు పరిశీలనలో ఉంద‌ని చెబుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్ మల్లన్న పేరు పరిశీలనలో ఉంద‌ని స‌మాచారం.
రెండు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అద్దంకి దయాకర్‌, చిన్నారెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి, సంపత్‌, మధుయాష్కిగౌడ్‌, షబ్బీర్ అలీ, ఫిరోజ్‌ఖాన్‌, అజారుద్దీన్‌ వంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నాయ‌ని స‌మాచారం. మంత్రివర్గ విస్తరణను లోక్‌సభ ఎన్నికల్లోగానే చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో క్యాబినెట్‌లోకి తీసుకునే వారినే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీలు నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. సామాజిక సమీకరణలు కూడా ముఖ్యం కానున్నాయి. 29న జరుగనున్న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను రెండు సీట్లకు వేర్వేరుగా నిర్వహిస్తే రెండు స్థానాలూ కాంగ్రెస్ హస్తగతం కానున్నాయి. లేదంటే అసెంబ్లీలో బలాబలాల మేరకు బీఆరెస్‌కు ఒక సీటు దక్కనుంది. 
వందల మందికి అవకాశం
రాష్ట్రంలో 54 కార్పొరేషన్ల చైర్మన్‌లను, డైరక్టర్లను, 33 జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో ఇప్పుడు ఈ పదవులన్నింటినీ భర్తీ చేయనుండటంతో కాంగ్రెస్ ఆశావహులు వాటిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ముఖ్యంగా 54 కార్పొరేషన్ల చైర్మన్లపై ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎన్నికల్లో టికెట్లు ఆశించిన ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. యాదాద్రి సహా రాష్ట్రంలోని పలు దేవాలయాలకు పాలక మండళ్లను నియమించాల్సివుంది. దేవాలయ పాలక మండళ్ల భర్తీ ద్వారా కూడా మరికొందరికి పదవుల భాగ్యం దక్కనుంది. రాష్ట్రంలో భద్రాచలం సీతా రామచంద్ర స్వామి, మేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి, యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి, బాసర జ్ఞాన సరస్వతి, కీసరగుట్ట క్షీరరామలింగేశ్వరస్వామి, ఉజ్జయిని మహంకాళి, సమ్మక్క సారలమ్మ, కొమురవెల్లి మల్లికార్జున, కురవి వీరభద్రస్వామితో పాటు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవసానం తదితరాలు ప్రముఖమైనవి.
వీటితో పాటు చిన్నచిన్న దేవాలయాలు కూడా చాలనే ఉన్నాయి. అలాగే మార్కెట్ కమిటీ పాలక మండళ్లను కూడా భర్తీ చేయాల్సివుంది. రైతు సమన్వయ సమితి రాష్ట్ర, జిల్లా అధ్యక్షులను నియమించాల్సివుంది. రైతు సమితిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదోనన్నదానిపై స్పష్టత లేదు. ఇకపోతే రెండేళ్ల కాలపరిమితితో ఉండే చైర్మన్ పదవుతో పాటు డైరక్టర్ పోస్టులను భర్తీ చేసిన పక్షంలో ఐదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హ‌యాంలో రెండు దఫాలుగా రెండు పాలక వర్గాలకు అవకాశం కల్పించడం సాధ్యమవుతుంది. ఈ నేప‌థ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీని త్వరిత గతిన పూర్తి చేసి పార్టీ నాయకులను సంతృప్తి పరిచినట్లయితే వారు లోక్‌సభ సహా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించ‌వచ్చని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్న‌ది.  
సహకార సంఘాలపై నజర్‌
జనవరి 31తో పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ముగియ‌నుంది. పంచాయతీ ఎన్నికలను లోక్ సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తారా లేక పర్సన్ ఇంచార్జ్‌లుగా అవకాశమిస్తారా ఈ రెండూ కాకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలన నడిపిస్తారా అన్నది తేలాల్సివుంది. పంచాయతీ ఎన్నికలు ఒక పక్క అలా ఉండగానే లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. ఆ వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సివుంది.
వీటితో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలు, డీసీసీబీ చైర్మన్ల ఎన్నికలు, చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాల్సివుంది. వీటిన్నింటిలో అధికార కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో ప్రతిపక్ష బీఆరెస్‌తో గట్టిపోటీనే ఎదుర్కోవాల్సివుంటుంది. ఆయా ఎన్నికల్లో నెగ్గాలంటే ఒకవైపు పాలన పరంగా ప్రభుత్వం సముచిత నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఇంకోవైపు పార్టీ కోణంలో పదవుల సర్ధుబాటు, ఆయా ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక సమర్ధవంతంగా నిర్వహించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. దీంతో త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి చేయాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపుతున్న‌ది.