గోస చెప్పుకొనే తొవ్వ దొరకడమే కదా.. మార్పు అంటే!!

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమొస్తుంది? భౌగోళిక విభజనే తప్పా మరేదీ మారదని సమైక్యవాదులు వాదించేవారు

  • Publish Date - January 3, 2024 / 04:00 PM IST

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమొస్తుంది? భౌగోళిక విభజనే తప్పా మరేదీ మారదని సమైక్యవాదులు వాదించేవారు. కానీ భౌగోళిక విభజనే కాదు పాలనా విధానాలు మారుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయి. ఇక్కడి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ప్రాంత ప్రజలకే దక్కుతాయి అని తెలంగాణ వాదులు కౌంటర్‌ ఇచ్చేవారు. రాష్ట్రం ఏర్పడింది. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. కానీ ప్రజలు ఆశించిన మార్పు, వారి ఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చడంలో విఫలమైంది. ప్రజలు కోరిన మార్పు బీఆర్‌ఎస్‌ పాలనలో మాటల్లోనేవ వ్యక్తమైంది. అందుకే ఈసారి ప్రజలు బలంగా మార్పు కోరుకున్నారు. బీఆర్ఎస్‌ను గద్దె దింపారు.

ప్రజలు ఆశించారు.. నాటి పాలకులు పట్టించుకోలేదు

ప్రభుత్వం మారగానే అద్భుతాలేవీ జరగవు. గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలి. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు అభయహస్తం హామీలను వంద రోజుల్లో అమలుచేస్తామని చెబుతున్నది. ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే బీఆర్‌ఎస్‌ నేతలు హామీల గురించి నిలదీస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆ పార్టీ తరఫున పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఎవరి వాదనలు ఎలా ఉన్నా ప్రజలు కోరుకున్న కొన్ని మార్పులు జరిగాయి. ప్రగతిభవన్‌, సెక్రటేరియట్‌లకు సామాన్యులు వెళ్లగలుగుతున్నారు. తమ సమస్యలను సంబంధిత విభాగాల అధికారుల దృష్టికి తీసుకురాగలుగుతున్నారు. ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరగాలని ప్రజలు కోరుకున్నారు. సీఎంను కలువాలంటే అది ఎంత ప్రహసనమో అందరికీ తెలిసిందే. దీనిపై కేటీఆర్‌ను ప్రశ్నిస్తే స్థానికంగానే సమస్యలు పరిష్కారం అయినప్పుడు సీఎంను కలువాల్సిన అవసరం ఏముంటుంది? కానీ ప్రజల తమ సమస్యల పరిష్కారం కోసం కాళ్లు అరిగేలా తిరిగినా పని కాదన్నది చాలామంది అనుభవంలో ఉన్నది. అందుకే ప్రజాభవన్‌కు అంతమంది వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంటే గత ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని,సమీకృత కలెక్టర్‌ భవనాలను నిర్మాణం చేసి ప్రభుత్వ శాఖలన్నీ ఒక్కచోటికి తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. అసలు తమ హయాంలో ప్రజా సమస్యలే లేవన్నట్టు మాట్లాడారు. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయని అన్నది గత నెల రోజులుగా ప్రజల ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ప్రశ్నించడం, దానికి అధికారులు స్పందించడం చూస్తున్నాం. ఇదీ కదా ప్రజలు ఆశించిన మార్పు.

వికేంద్రీకరణ కాదు కేంద్రీకృత పాలనే

పాలనా వికేంద్రీకరణ అని చెప్పుకోవడమే గాని కేంద్రీకృత పాలనే తొమ్మిదన్నరేళ్లు కొనసాగింది అన్నది వాస్తవం. ముఖ్యంగా ధరణి బాధితులు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఒకప్పుడు గ్రామంలో వీఆర్‌ఏ, వీఆర్‌వో, తహశీల్దార్‌ పరిధిలోనే చాలా సమస్యలు పరిష్కారం అయ్యేవి. కొన్ని మాత్రమే ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌ పరిధిలో ఉండేవి. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ధరణి బాధితులు సీఎస్‌ దాకా వెళ్లినా పరిష్కారం కాలేదంటే గత పాలకుల పాలన విధానాలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పాలనా పరమైన విధానాలు తీసుకున్నప్పుడు వాటిని అమలు తీరు పర్యవేక్షించే వ్యవస్థ అంతగా పనిచేయలేదు. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్లి ఉంటే ఇలా అనేక విషయాలపై వారు ఎమనుకుంటున్నరో అర్థమయ్యేది. కానీ వినడాన్ని అంగీకరించలేదు. ప్రశ్నించడాన్ని సహించలేదు. పొగడని వారిని పరిగణనలోకి తీసుకోలేదు అన్నట్టు గత పాలన సాగింది. అందుకే ఆ విధానాన్ని మార్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం యత్నిస్తున్నది. ప్రజల నుంచి కూడా అదేస్థాయిలో స్పందన వస్తున్నది. పాలనా మార్పును మాటలకే పరిమితం చేయకుండా కార్యాచరణ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం చూపెడుతున్నది. ప్రజలు కోరుకున్న మార్పు అంటే ఇదే కదా.