Ms Shetty Mr Polishetty Review | సినిమా రివ్యూ.. మిస్, మిస్టర్.. ఇద్దరూ మెప్పించారు! వన్ టైమ్ వర్త్

Ms Shetty Mr Polishetty Review | మూవీ పేరు: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విడుదల తేదీ: 07 సెప్టెంబర్, 2023. నటీనటులు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, జయసుధ, తులసి, నాజర్, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి తదితరులు సినిమాటోగ్రఫీ: నిరవ్ షా సంగీతం: గోపీ సుందర్ (బ్యాక్‌గ్రౌండ్), రధన్ (పాటలు) ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు నిర్మాతలు: వంశీ - ప్రమోద్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం: మహేష్ బాబు పి. […]

  • Publish Date - September 8, 2023 / 03:32 AM IST

Ms Shetty Mr Polishetty Review |

మూవీ పేరు: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’
విడుదల తేదీ: 07 సెప్టెంబర్, 2023.
నటీనటులు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, జయసుధ, తులసి, నాజర్, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి తదితరులు
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
సంగీతం: గోపీ సుందర్ (బ్యాక్‌గ్రౌండ్), రధన్ (పాటలు)
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: వంశీ – ప్రమోద్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: మహేష్ బాబు పి.

విధాత: అనుష్క, నవీన్ పోలిశెట్టి.. వీరిద్దరి నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. అనుష్క గురించి చెప్పుకుంటే.. ‘సైజ్ జీరో’ ప్రయోగంతో ఆమె తేరుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ‘బాహుబలి’ని ఎలాగోలా మ్యానేజ్ చేసినా.. ఆమె బరువు తగ్గడానికి చాలా ఇబ్బందులే ఫేస్ చేసింది. అందుకోసమే సినిమాలు పక్కన పెట్టేసింది. అయితే అప్పుడెప్పుడో అంగీకరించిన ఈ ప్రాజెక్ట్ కోసం అనుష్క స్ట్రాంగ్‌గా నిలబడింది.

మరో వైపు నవీన్ పోలిశెట్టి కూడా ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నప్పటికీ గ్యాప్ తప్పలేదు. అందుకు కారణం కూడా ఈ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రమే. సరే.. ఎన్నో వాయిదాల అనంతరం నేడు (సెప్టెంబర్ 07) ఈ సినిమాకు మోక్షం లభించింది. అనుష్క అంటే హుందాతనానికి మారు పేరు. అలాంటి అనుష్క.. ట్రైలర్‌లో చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది.

పెళ్లి వద్దు కానీ.. పిల్లలు కావాలి అంటూ అనుష్క అడగటం, ట్రైలర్ ఇంప్రెసివ్‌గా ఉండటంతో పాటు.. ఆల్రెడీ సినిమా చూసేసిన మెగాస్టార్ చిరంజీవి నుంచి మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో.. సినిమాపై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రమోషన్స్ పరంగా అనుష్క ఎక్కడా కనిపించకపోవడం.. ఈ సినిమాని అంతగా జనాల్లోకి తీసుకెళ్లలేకపోయిందనే చెప్పాలి.

అయితేనేం, ప్రమోషన్స్‌తో పని లేకుండా మౌత్ టాక్‌తో సినిమాలు హిట్ అవుతున్న రోజులివి. మరి నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలాంటి టాక్‌ని సొంతం చేసుకుంది? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే కంటెంట్ ఇందులో ఉందా? అనేది మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఇంటర్నేషనల్ చెఫ్‌ అయిన అన్విత ఆర్. శెట్టి (అనుష్క).. తన తల్లి (జయసుధ) చివరి రోజులని ఇండియాలో గడపడానికి వస్తుంది. చిన్నప్పటి నుంచి తండ్రి లేకుండా తల్లితో బతకడంతో తను కూడా పెళ్లి వద్దు కానీ ఒక బిడ్డకు తల్లి కావాలని అనుకుంటుంది. అందుకోసం అన్నీ మంచి లక్షణాలు ఉన్న ఒక అబ్బాయి కోసం సెర్చ్ చేస్తుంటుంది.

అదే సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ స్టాండప్ కమెడియన్‌గా ఎదగాలని ట్రై చేస్తున్న సిద్ధూ పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి)ని ఓ షోలో చూసి.. అతనితో ట్రావెల్ చేయాలని డిసైడ్ అవుతుంది. అతనే తన బిడ్డకు తండ్రి కావాలని ఆశించి.. అతనితో పరిచయం పెంచుకుని.. అతని కెరీర్‌కి సాయం చేస్తుంది. అన్విత ఆర్. శెట్టి చేస్తున్న ఈ పనులన్నీ చూసి.. ఇదంతా ప్రేమ అనుకోని ఒక మంచి టైమ్ చూసుకుని ఆమెకు ప్రపోజ్ చేయబోతే.. ఆమె షాకిస్తుంది.

పెళ్లి వద్దు.. ప్రెగ్నెంట్ కావడానికి మాత్రం నీ హెల్ప్ చాలు అని అన్విత ఇచ్చిన షాక్‌తో సిద్ధూ మైండ్ బ్లాంక్ అవుతుంది. అది చట్ట విరుద్ధమని, యాంటీ సోషల్ ఎలిమెంట్ అని చెప్పినా అన్విత తన నిర్ణయం మార్చుకోదు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్విత కోరికను సిద్ధూ తీర్చాడా? అన్విత కోరుకుంటున్న దానిని సిద్ధూ డొనేట్ చేశాడా? అసలిద్దరి మధ్య ఏం జరిగింది? చివరికి కథ ఎలా సుఖాంతమైంది? అనేది తెలుసుకోవాలంటే.. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

ముందుగా అనుష్కకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే.. ఇలాంటి తరహా పాత్ర అనుష్క నుంచి ఎవరూ ఊహించి ఉండరు. ఇంటర్నేషనల్ చెఫ్‌గా హుందాగా కనిపించింది. అలాగే తను కోరుకుంటున్న దాని కోసం ప్రయత్నించే క్రమంలో ఆమె కనిపించిన తీరు, చెప్పే డైలాగ్స్ అన్నీ ఆకర్షణీయంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆమె వాడిన డ్రస్సులు కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా అయితే కాస్త లేటయినా.. మంచి పాత్రతో అనుష్క ప్రేక్షకులని పలకరించింది. తన పాత్రలోని వైవిధ్యతని అంతే హుందాగా అనుష్క కనబరిచింది.

ఇక నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలోని సిద్ధూ పాత్రకి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పాలి. ఒకవైపు నలిగిపోతూ కూడా నవ్వించగలిగాడు అంటే.. అది నవీన్‌లోని స్పెషాలిటి. స్టాండప్ కమెడియన్‌గా ఎలా నవ్వించాడో.. ఎమోషనల్ సీన్స్‌లోనూ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేయగలిగాడు. అతనికి మరో మంచి పాత్ర అని చెప్పవచ్చు. అనుష్క తల్లిగా చేసిన జయసుధ‌కి కూడా మంచి పాత్ర లభించింది.

బాలయ్య అభిమానిగా ఆమె ఇందులో కనిపించారు. జయసుధ కనిపించేది కొంచెం సేపే అయినా.. చక్కగా నటించింది. ఇంకా ఇతర పాత్రలలో మురళీ శర్మ – తులసి జంట, నాజర్, అభినవ్ గోమటం, హీరోయిన్ ఫ్రెండ్‌గా చేసిన సోనియా దీప్తి వంటి వారంతా మంచి నటనను కనబరిచారు. వాళ్లందరికీ ఇలాంటి పాత్రలు కొత్తేం కాదు.. అందుకే ఈజీగా చేసేశారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..

సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. అనుష్కని చాలా కాలం తర్వాత బ్యూటీఫుల్‌గా చూపించారు. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు ఉన్నాయనిపిస్తుంది. వాటిని ఇంకాస్త క్రిస్ప్‌గా చూపించి ఉంటే.. సినిమాలో వేగం పెరిగేది. సెకండాఫ్ పరంగా అంతా ఓకే. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు ఓకే. డైలాగ్స్ అర్థవంతంగా ఉన్నాయి.

డైరెక్టర్ మహేష్.. ఈ సినిమాకు అన్నీ తానై.. తను రాసుకున్న కథని చాలా నీట్‌గా ప్రజంట్ చేశాడు. వాస్తవానికి ఇలాంటి తరహా కథని.. అనుష్క, నవీన్‌ల మధ్య రొమాంటిక్ సీన్లతో కూడా చూపించవచ్చు. అప్పుడది సినిమా అయ్యేది కాదు. అదే ఆలోచించాడు మహేష్. సినిమాని చాలా హుందాగా ప్రజంట్ చేశాడు. అందుకు అతనిని అభినందించవచ్చు.

విశ్లేషణ:

ఇందులో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటంటే.. ఫెమినిస్ట్ భావాలున్న ఓ మహిళకి.. అర్థవంతమైన జీవితం గడపాలనుకునే ఓ కుర్రాడికి మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా ఇది. దానిని స్టాండప్ కామెడీకి లింక్ చేస్తూ దర్శకుడు కథ నడిపిన విధానం.. ప్రేక్షకులకు కనెక్టివ్‌గా చెప్పిన విధానం ఎంటర్‌టైన్‌మెంట్‌కి లోటు లేకుండా చేసింది. అలాగే ఆ పాత్రకి ఆయన ఎన్నుకున్న ఆర్టిస్ట్‌లు కూడా సినిమాకు ప్లస్ అయ్యారు.

Jawan Review | సౌత్ సత్తా చాటిన ‘జవాన్’.. యుద్ధంలో గెలిచాడు

వాస్తవానికి ఇందులో మైండ్ పెట్టి ఆలోచించేంత ట్విస్ట్‌లేమీ లేవు. అంతా తెలిసినట్లే జరిగిపోతుంటుంది. కానీ ఆర్టిస్ట్‌లు లీనం అయ్యేలా చేస్తారు. నవ్విస్తారు, ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తారు. అదే ఈ సినిమాలో ఉన్న గొప్పతనం. అలా అనీ సినిమా అంతే అలాగే ఉందని అనుకోలేం. ఫస్టాఫ్ ఓ అర గంట సేపు సాదాసీదా సీన్లతోనే దర్శకుడు కథ నడిపేశాడు. ఆ సీన్లన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి.

అయితే ఎప్పుడైతే అనుష్కకు ప్రపోజ్ చేయాలని నవీన్ భావిస్తాడో.. అప్పటి నుంచి సినిమా కాస్త ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఇక సెకండాఫ్ కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసి మంచి ఫీల్ ఉన్న సినిమాని చూశామనే భావనని దర్శకుడు కల్పిస్తాడు. క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.

ఓవరాల్‌గా అయితే.. సినిమా టికెట్ కొనుక్కుని లోనికి వెళ్లిన ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేసి పంపిస్తుందీ సినిమా. అలా అనీ.. థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా గుర్తిండిపోయే సినిమా అయితే ఇది కాదు. అనుష్క కోసం, నవీన్ కామెడీ కోసం, కథలో ఉన్న కంటెంట్ కోసం, ఆ కంటెంట్‌ని హుందాగా చూపించిన తీరు కోసం.. డౌటే వద్దు.. ఒకసారి ఈ సినిమాని హాయిగా చూడొచ్చు.

మొత్తంగా అయితే.. అనుష్క నుంచి ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని సినిమా ఇది. అనుష్క కాకుండా వేరే హీరోయిన్ చేసి ఉంటే మాత్రం.. ఇదొక బూతు సినిమా అయ్యేది. ఎందుకంటే కథ మొత్తం మారిపోయేది.. రొమాంటిక్ సీన్స్‌తో సినిమాని నింపేవారు. అలాంటి కంటెంట్‌కు ఇందులో ఆస్కారం ఉంది. అనుష్క నటించడంతో.. టోటల్ కంటెంట్‌కే హుందాతనం వచ్చింది. వన్ వర్డ్‌లో చెప్పాలంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కి వెళ్తే హాయిగా ఆస్వాదించగలిగే చిత్రమిది.

ట్యాగ్‌లైన్: కామెడీ ప్లస్ హార్ట్ టచింగ్‌.. వన్ టైమ్ వర్త్
రేటింగ్: 2.75/5

Jawan Review | సౌత్ సత్తా చాటిన ‘జవాన్’.. యుద్ధంలో గెలిచాడు

Latest News