Jawan Review | మూవీ పేరు: ‘జవాన్’ విడుదల తేదీ: 07 సెప్టెంబర్, 2023 నటీనటులు: షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే, ప్రియమణి, యోగిబాబు, సునీల్ గ్రోవర్ తదితరులు సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు ఎడిటింగ్: రుబెన్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ నిర్మాతలు: గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ కథ, దర్శకత్వం: అట్లీ బాలీవుడ్ స్టార్ హీరో, కోలీవుడ్ స్టార్ దర్శకుడు.. ఈ రేర్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ఆటోమాటిగ్గా అంచనాలు పెరగడం ఖాయం. […]

Jawan Review |

మూవీ పేరు: ‘జవాన్’
విడుదల తేదీ: 07 సెప్టెంబర్, 2023
నటీనటులు: షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే, ప్రియమణి, యోగిబాబు, సునీల్ గ్రోవర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు
ఎడిటింగ్: రుబెన్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాతలు: గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ
కథ, దర్శకత్వం: అట్లీ

బాలీవుడ్ స్టార్ హీరో, కోలీవుడ్ స్టార్ దర్శకుడు.. ఈ రేర్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ఆటోమాటిగ్గా అంచనాలు పెరగడం ఖాయం. అదే జరిగింది ‘జవాన్’ విషయంలో. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడాలు లేకుండా.. అంతా ఇండియన్ ఇండియా (భారత్ సినిమా) అనే స్థాయికి సినిమా ఇండస్ట్రీ చేరుకుంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ సినిమా ఇప్పుడు అగ్ర పథంలో ఉండగా.. ఆ తర్వాత కోలీవుడ్ ఉంది. బాలీవుడ్ మాత్రం ప్రస్తుతం పడి లేస్తూ ఉంది. ఒక సినిమా హిట్టయితే.. 10 సినిమాలు ఫట్ అనేలా బాలీవుడ్‌లో పరిస్థితి ఉంది.

పెద్ద పెద్ద నిర్మాతలంతా సైడ్ అయిపోగా అక్కడి స్టార్ హీరోలకు సరైన సినిమాలు పడటం లేదు. మధ్యలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌ని కుదేల్ చేసింది. అప్పటి నుంచి బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు ఏవి వచ్చిన బాయ్‌కట్ అంటూ ట్రెండ్ మొదలైంది. ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీని మళ్లీ కాస్త గాడిలో పెట్టింది షారుఖ్ నటించిన ‘పఠాన్’ చిత్రమే అని చెప్పుకోవాలి. ‘పఠాన్’కి ముందు షారుఖ్ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. ఆ సినిమా ఇచ్చిన విజయంతో ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు.

కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా ఓకే అయినప్పటి నుంచి ఏదో రకంగా ‘జవాన్’ వార్తలలో నిలుస్తూనే ఉంది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే వంటి తారాగణం ఈ సినిమాకు ఫిక్స్ అవడంతో పాటు.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి షారుఖ్ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండటం మరింతగా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. జూన్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కార్యక్రమాలతో వాయిద పడుతూ వచ్చి ఇప్పుడు విడుదల అయింది.

Ms Shetty Mr Polishetty Review | సినిమా రివ్యూ.. మిస్, మిస్టర్.. ఇద్దరూ మెప్పించారు! వన్ టైమ్ వర్త్

షారుఖ్.. తరుచూ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ.. ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలు, ఆ తర్వాత వచ్చిన ట్రైలర్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? అని అంతా ఎదురుచూడటం మొదలెట్టారు. ఆ ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ.. నేడు (సెప్టెంబర్ 7) థియేటర్లలోకి వచ్చిందీ చిత్రం. మరి ఆ ఎదురుచూపులకు సరిపడా ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఈ సినిమా ఇచ్చిందో లేదో.. మన రివ్యూలో తెలుసుకుందాం. మరో విచిత్రం ఏంటంటే ఇటీవలే సౌత్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన జైలర్‌లో రజనీ క్యారెక్టర్‌, జవాన్‌లో షారుఖ్‌ క్యారెక్టర్‌ ప్రధాన పాత్రలు జైలరే కావడం విశేషం.

కథ:

కథగా చెప్పాలంటే.. ఈ సినిమా దర్శకుడు శంకర్ సినిమాల తరహాలో సాగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం, రైతుల గురించి ఈ సినిమాలో ఫోకస్ చేసిన తీరు.. శంకర్ సినిమాలను గుర్తు చేయక మానదు. మెయిన్ పాయింట్ అయితే కార్తీ ‘సర్ధార్’ చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది.

కథలోకి వస్తే.. ఒక అజ్ఞాత వ్యక్తి (షారుఖ్ ఖాన్) ఓ ఆరుగురు అమ్మాయిలతో ఒక మైట్రో ట్రైన్‌ను హైజాక్ చేసి.. ప్రభుత్వాన్ని రూ. 40 వేల కోట్లు డిమాండ్ చేస్తాడు. ఆ హైజాక్ చేసిన ట్రైన్‌లో రిచ్ బిజినెస్ మ్యాన్, ఆయుధాల ఫ్యాక్టరీ ఉన్న కాళీ (విజయ్ సేతుపతి) కుమార్తె కూడా ఉంటుంది. హైజాకర్‌తో మాట్లాడేందుకు ప్రభుత్వం స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అయిన నర్మద (నయనతార)ను లైన్‌లోకి దింపుతుంది. ప్రభుత్వం దగ్గర అంత సొమ్ము లేదని చెబితే.. కాళీని అడిగి తీసుకోమంటాడు హైజాకర్. కాళీ ఆ అమౌంట్ ఇవ్వగా దానిని రైతుల ఖాతాలలోకి జమ చేస్తాడు హైజాకర్.

కట్ చేస్తే.. ఆ హైజాకర్ ఎవరో కాదు జైలర్ ఆజాద్ (షారుఖ్) అని తెలుస్తుంది. ఆజాద్‌కు, నర్మదకు చాలా క్లోజ్ బాండింగ్ ఉంటుంది. ఆ బంధమేంటి? ఆజాద్‌ని కాళీ చంపాలని చూసిన సమయంలో విక్రమ్ రాథోడ్ (షారుఖ్ ఖాన్) ఎంటరై.. అందరినీ మట్టుపెడతాడు. అసలు విక్రమ్ రాథోడ్ ఎవరు? విక్రమ్, ఆజాద్‌లకు కాళీ ఎలా శత్రువు అవుతాడు? ఈ ట్విస్ట్‌లకు సమాధానం తెలియాలంటే.. ఈ ఫుల్ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌ని థియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఇందులో షారుఖ్ రెండు విభిన్న పాత్రలతో పాటు, పలు అవతారాలలో కనిపిస్తూ.. ప్రేక్షకులను, అభిమానులను మెస్మరైజ్ చేస్తాడు. ఆయన చేసిన రెండు పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. షారుఖ్‌లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని దర్శకుడు అట్లీ వాడుకున్నాడని చెప్పాలి. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో షారుఖ్‌ని ఇంతకు ముందెన్నడూ ఇలా చూపించి ఉండలేదు. అందుకే షారుఖ్ కూడా డైరెక్టర్‌పై పూర్తి నమ్మకం ఉంచి, ఆయన చెప్పింది చేసుకుపోయినట్లుగా అర్థమవుతుంది.

షారుఖ్ ఇందులో కామెడీ చేస్తాడు, పవర్ ‌ఫుల్ డైలాగ్స్, ఫైట్స్.. ఇలా ఒక్కటేమిటి? నవరసాలను పలికించాడు. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలా రెచ్చిపోయాడని చెప్పాలి. ఆయన కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా ఇది నిలిచిపోతుంది. నయనతార‌ పోలీస్ ఆఫీసర్‌గా చక్కగా నటించింది. నర్మదగా నయన్ పాత్రకూ మంచి ఇంపార్టెన్స్ ఇచ్చాడు దర్శకుడు. ఆమె కూడా తన నటనతో నిండుతనం తెచ్చింది. దీపికా పదుకొనే కనబడేది తక్కువే అయినా.. సినిమాపై మంచి ప్రభావం చూపిస్తుంది.

విలన్‌గా విజయ్ సేతుపతి కాళీ పాత్రలో అరిపించేశాడు. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో విజయ్ సేతుపతికి చాలా మంచి సీన్లు పడ్డాయి. ఒక నటుడికి మంచి సీన్లు పడితే ఎలా అయితే దున్నేస్తాడో.. అలా సేతుపతి ఆకట్టుకుంటాడు. గెస్ట్ పాత్రలో విడుదలకు ముందు చాలా పేర్లు వినిపించాయి. ఆ వినిపించిన పేర్లలోని హీరోలెవరు ఇందులో కనిపించలేదు. సంజయ్ దత్, దర్శకుడు అట్లీనే గెస్ట్‌లుగా కనిపించారు. ఇంకా ఇతర పాత్రలలో కనిపించిన ప్రియమణి, యోగిబాబు, సాన్య, రిద్ధి, సునీల్ గ్రోవర్ వంటి వారంతా వారి పాత్రల పరిధిమేర నటించి ఈ సినిమాకు హెల్ప్ అయ్యారు. అదేవిధంగా సినిమాలో షారఖ్‌ వెంట మన తెలుగమ్మాయి సిరి హనుమంత్‌ ఓ నాలులైదు సీన్లలో కనిపిస్తుంది. అందుకు కారణం దర్శకుడు అట్లీ భార్య ప్రియకు స్నేహితురాలు అవడం.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..

అగ్రతాంబూలం ఇద్దరికి ఇవ్వాలి. వారెవరో కాదు.. సంగీత దర్శకుడు అనిరుధ్, సినిమాటోగ్రాఫర్ జి.కె. విష్ణు. అలాగే నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి ఇందులో కనిపిస్తుంది. అంత రిచ్‌గా ఈ సినిమా ఉంది. ఇక అనిరుధ్ విషయానికి వస్తే.. చూడటానికి సన్నగా ఉంటాడు కానీ.. ఏమన్నా కొడతాడబ్బా.. మొన్న వచ్చిన ‘జైలర్’ గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే ఈ సినిమాతో మరోసారి ప్రపంచానికి తన సత్తా చాటాడు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి అరిపించేశాడు. అలాగే కెమెరామ్యాన్ కూడా ఈ సినిమాలో ఉన్న వైవిధ్యానికి తగ్గట్లుగా కెమెరాతో మూడ్‌ని మార్చిన తీరు అలరిస్తుంది. షారుఖ్ సొంత బ్యానర్‌లో ఈ సినిమా నిర్మించాడంటే.. సినిమాపై నమ్మకం ఉండబట్టే కదా.. అందుకే ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడలేదు.

ఇక ఎడిటింగ్ పరంగా మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు కనబడతాయి. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు వారి పనితరం కనబరిచాడు. ఇక అట్లీ విషయానికి వస్తే.. ఆయన చెప్పిన కథ కొత్తదేం కాదు.. ఆల్రెడీ కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలలో కనిపించిందే. కానీ స్క్రీన్‌ప్లేతో పాటు కంటెంట్‌ని మలిచిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. మరీ ముఖ్యంగా ఒక వైపు కథను నడిపిస్తూనే, హీరోయిజాన్ని ఆయన లేపిన తీరు.. ఇది అట్లీ సినిమానా? లోకేష్ కనగరాజ్ సినిమానా? అనిపిస్తుంది. మొత్తానికి సౌత్ డైరెక్టర్‌గా తనేంటో అట్లీ నిరూపించుకున్నాడు.

విశ్లేషణ:

మాములుగా అయితే అభిమానులు తమ హీరోని ఓ రేంజ్‌లో చూపించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య అభిమానులతో పాటు.. ప్రేక్షకులు కూడా ఎలివేషన్స్‌కి బాగా అలవాటు పడ్డారు. కథ కూడా చూడటం లేదు.. ఎలివేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు వంటివి ఇప్పుడు సినిమాని జడ్జ్ చేస్తున్నాయి. రీసెంట్‌గా వచ్చిన ‘జైలర్’ సినిమా కథ అంత గొప్పదేం కాదు. కానీ ఆ సినిమా రికార్డులు క్రియేట్ చేసిందంటే అందుకు కారణం ఏమిటో అందరికీ తెలుసు. ఇప్పుడదే మార్క్ ఈ చిత్రంలోనూ కనిపిస్తుంది.

అయితే ఇందులో అట్లీ జోడించిన కొన్ని సీన్లు ప్రేక్షకులతో ఆలోచింపజేస్తాయి. రైతుల గురించి, గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి, జవాన్లు వాడే గన్స్ గురించి, చివర్లో ఓటు గురించి షారుఖ్‌తో చెప్పించిన డైలాగ్స్.. వాటి బాగు కోసం రాసుకున్న సీన్లు.. శంకర్ సినిమాలను తలపించినా.. హైలెట్‌గా తెరకెక్కించాడని అనిపిస్తాయి. ప్రారంభమే నేనెవరిని అని షారుఖ్‌తో అడిగించిన అట్లీ.. ఆ తర్వాత కథలోకి వెళ్లేందుకు అసలు టైమ్ తీసుకోలేదు. ప్రతి పాత్రకు ఇంపార్టెంట్ ఇస్తూ.. ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ.. ఎక్కడా గ్రాఫ్ పడకుండా చూసుకున్నాడు.

అలాగే ఇంత సీరియస్ సినిమాలోనూ ప్రేమని జోడించడమనేది అట్లీ మార్క్‌కు అది నిదర్శనం. విక్రమ్ రాథోడ్ ఎపిసోడ్‌కు టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చిన తీరు, దీపికాతో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రాణం. అలాగే విక్రమ్ రాథోడ్‌కు, ఆజాద్‌కు కాళీతో కనెక్షన్ కలిపిన తీరు కూడా వావ్ అనిపిస్తుంది. పవర్ ఫుల్ హీరో దొరికాడు.. ఆ హీరోతో ఏమేం చేయాలో, ఏమేం చేయవచ్చో అవన్నీ అట్లీ చేసుకుంటూ వెళ్లిపోయాడు. లాజిక్స్ గురించి కూడా పెద్దగా అతను ఆలోచించలేదు. సినిమాటిక్ లిబర్టీని వాడేసుకుంటూ.. చిచ్చిరపిడుగులా చెలరేగిపోయాడు.

క్లైమాక్స్, అంతకు ముందు వచ్చే సీన్లు, షారుఖ్‌‌ని ప్రజంట్ చేసిన విధానం అన్నీ ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తాయి. మొత్తంగా అయితే.. బాలీవుడ్ హీరోతో సౌత్ డైరెక్టర్ తన సత్తా చాటిన సినిమా ఇదని చెప్పొచ్చు. అందులో నో డౌట్. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోని స్టార్ హీరోలు సౌత్ దర్శకులకు మరింత దగ్గరవడం ఖాయం. ఓవరాల్‌గా కథగా ఈ ‘జవాన్’ రొటీన్ అనిపించినా.. స్క్రీన్‌ప్లే, మాస్ ఎలిమెంట్స్, హీరోయిజం, ఆర్టిస్ట్‌లు, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. పెట్టిన ప్రతి రూపాయికి మించిన ఎంటర్‌టైన్‌మెంట్ అయితే పక్కా.

ట్యాగ్‌లైన్: సౌత్ సత్తా చాటిన ‘జవాన్’.. యుద్ధం గెలిచాడు
రేటింగ్: 3/5

Ms Shetty Mr Polishetty Review | సినిమా రివ్యూ.. మిస్, మిస్టర్.. ఇద్దరూ మెప్పించారు! వన్ టైమ్ వర్త్

Updated On 8 Sep 2023 5:22 AM GMT
krs

krs

Next Story