ఇటీవలి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కావడం లేదు. మగాళ్లకు తీసిపోని విధంగా అన్ని పనులు చేసి ఔరా అనిపిస్తున్నారు.
Shila Dawre | ఇటీవలి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కావడం లేదు. మగాళ్లకు తీసిపోని విధంగా అన్ని పనులు చేసి ఔరా అనిపిస్తున్నారు. కానీ ఓ 40 ఏండ్ల క్రితం గృహిణులు ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేవారు. ఆ సమయంలోనే ఓ మహిళ మాత్రం బతుకుదెరువు కోసం బయటకు వెళ్లింది. ఆడ వారికి సాధ్యం కాని పనిని చేసి చూపించింది. 18 ఏండ్ల వయసులోనే ఆటో నడిపి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కుటుంబానికి అండగా నిలిచింది. అంతేకాదు మహిళా సాధికారితకు చిహ్నంగా నిలిచింది ఆమె. భారతదేశపు తొలి మహిళా ఆటో డ్రైవర్‌గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. మరి ఆ మహిళా ఆటో డ్రైవర్ ఎవరంటే శీలా డావ్రే.
అది 1980వ దశకం… మహారాష్ట్రలోని పర్భాణి జిల్లాకు చెందిన శిలా డావ్రేకు తన 18 ఏండ్ల వయసులో బతకడం కష్టంగా అనిపించింది. దీంతో తన వద్ద ఉన్న రూ. 12 తీసుకుని పుణెకు బయల్దేరింది. ఇక ఆటో డ్రైవర్‌గా మారాలనుకుంది. కానీ అందరూ పురుష డ్రైవర్లే. సమాజం నుంచి అవమానాలు ఎదురయ్యాయి. అయినా తన లక్ష్యాన్ని శీలా పక్కన పెట్టలేదు. సల్వార్ కమీజ్ ధరించి ఏ మాత్రం భయపడకుండా.. పుణె వీధుల్లో ఆటో డ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభించింది.
ఆమె కొద్ది రోజుల్లోనే తన టార్గెట్‌ను చేరుకుంది. ఎంతో నైపుణ్యం కలిగిన ఆటో డ్రైవర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. స్వయం సహాయక సంఘాల్లో చేరింది. సంఘాల ద్వారా డబ్బును పొదుపు చేసింది. ఒక కొత్త ఆటోను కొనుగోలు చేసింది. ఓ స్థలాన్ని అద్దెకు తీసుకుని తన జీవితాన్ని మరింత విస్తృతం చేసుకుంది. ఇలా పలువురి మహిళలకు ఆమె ఆదర్శంగా నిలిచింది.
తన జీవితంలో ఎన్నోసార్లు ఆకలితో అలమటించి పోయానని శీలా పేర్కొంది. నిద్రలేని రాత్రుళ్లు కూడా గడిపానని తెలిపింది. ఆటో నడపమేంటి..? అని ఎంతో మంది వేధింపులకు గురి చేసినా, తనకు ఇష్టమున్న వృత్తిలోనే రాణించి.. ఇవాళ ఎందరికో ఆదర్శంగా నిలిచానని పేర్కొంది. మహిళా సాధికారికతకు చిహ్నంగా మారిన శీలా.. చివరకు భారతదేశపు తొలి మహిళా ఆటో డ్రైవర్‌గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.