నాలుగు దశల్లోనే 270 సీట్లు సాధ్యమా?
నాలుగు విడుతల పోలింగ్‌లో బీజేపీ 270 సీట్ల మైలురాయి దాటేసిందని, 400 దాటడానికి పరుగులు తీస్తున్నదని శుక్రవారం ఒడిషా ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడం ఆశ్యర్యానికి గురిచేసింది

నాలుగు విడుతల పోలింగ్‌లో బీజేపీ 270 సీట్ల మైలురాయి దాటేసిందని, 400 దాటడానికి పరుగులు తీస్తున్నదని శుక్రవారం ఒడిషా ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడం ఆశ్యర్యానికి గురిచేసింది. ఎందుకంటే నాలుగు దశల్లో (102+89+93+95) మొత్తం 379 స్థానాలకు ఇప్పటివరకు పోలింగ్ పూర్తయ్యింది. వీటిలోనే బీజేపీకి 270 సీట్లు దాటుతాయని చెప్పడం విడ్డూరంగా ఉన్నది. అమిత్ లెక్క ప్రకారం నాలుగు దశల్లో జరిగిన పోలింగ్‌లో 70 శాతం సీట్లు ఆ పార్టీకే వస్తాయని అనుకోవాలి. గెలవడానికి అబద్ధాలనైనా ప్రచారం చేయాలని అమిత్ షా తమ పార్టీ శ్రేణులకు చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి వ్యక్తి అకౌంట్‌లో రూ. 15 లక్షల రూపాయలు ఎప్పుడు వేస్తారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ అందంతా జూమ్లా అన్నారు. దీన్నిబట్టి బీజేపీ నేతలు అబద్ధాలు ఎంత అలవోకగా చెబుతారో అర్థమౌతుందనే విమర్శలున్నాయి.
తమిళనాడు, కేరళలో బీజేపికి వచ్చే సీట్లు ఎన్ని?
తమిళనాడులోని మొత్ం 39 స్థానాలకు మొదటి దశలోనే ఎన్నికలు జరిగాయి. కేరళలోని 20 స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరిగాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు నాలుగో దశలో తెలంగాణలోని 17 కలిపి బీజేపీకి డబుల్ డిజిట్ రాదనే కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవే కాదు ఈసారి బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో నాలుగు దశలలో సుమారు 100 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. ఈ స్థానాల్లో బీజేపీ గతంలో గెలుచుకున్న సీట్లలో చాలావరకు కోల్పోనున్నదనే అభిప్రాయాలు వ్యక్తమువుతున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ ఇప్పటికే కేంద్రంలో అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మెజారిటీమార్క్ దాటేశామని చెప్పడం వాస్తవానికి దూరంగా ఉన్నది.
యూపీలో ప్రధాని రెచ్చగొట్టే ప్రసంగాలు దేనికి సంకేతం?
ఇక కేంద్రంలో అధికారంలోకి ఏ కూటమి రావాలన్నా యూపీలోని 80 స్థానాలే కీలకం. బీజేపీ 2014లో 70కి పైగా, 2019లో 62 స్థానాలు గెలుచుకున్నది. నాలుగు దశ పోలింగ్‌లో యూపీలోని 39 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. వీటిలో అధికార బీజేపీకి ప్రతికూల పవనాలు వినిపిస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అందుకే మోడీ ఐదో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీపై ఎక్కువగా దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. ఈసారి యూపీలో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కలిసికట్టుగా సాగుతున్నాయి. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీలో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో ఎక్కువ సీట్లను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. మోడీ, షా, యోగిలు చేస్తున్న విమర్శలకు ధీటుగా బదులిస్తున్నారు. ఇవి కాషాయ నేతలను కలవరపెడుతున్నాయి.
అందుకే ప్రధాని మోడీ కాంగ్రెస్, సమాజ్‌వాదీపార్టీలను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే అయోధ్య రామమందిరంపైకి బుల్డొజర్లు పంపిస్తాయని, బాలరాముడు మళ్లీ టెంట్‌లెకి వెళ్లాల్సి వస్తుందని హిందూ ఓటర్లలో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) మరికొన్ని నెలల్లో భారత్‌లో విలీనమౌతుందని, అయితే మూడోసారి కూడా ప్రధాని మోడీ ఎన్నికైతేనే అది సాధ్యమౌతుందని అన్నారు. ఈ ఇద్దరు నేతల ప్రచారం ఒకరకంగా ఓటర్లను బ్లాక్ మెయిల్ చేయడమే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రధాని మోడీ ముస్లింలపై, కాంగ్రెస్ మ్యానిఫెస్టో పై చేస్తున్న విమర్శల పట్ల విముఖత వ్యక్తమౌతున్నది. ప్రధాని స్థాయి వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడటం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీన్నిబట్టి యూపీలో బీజేపీ గతంలో గెలుచుకున్న సీట్లలో కొన్నిసీట్లు కోల్పోనున్నదని స్పష్టమైంది.
కేజ్రివాల్‌పై కోపం అందుకే
కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చాక ఆయన ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దీనివల్ల ఢిల్లీ, పంజాబ్‌లలో నష్టం జరుగుతుందని ప్రధాని, అమిత్ షాలు ఆపార్టీ జాతీయ నేతలు ఆప్‌ను కట్టడి చేయడానికి ఆయనను టార్గెట్ చేశారు. ఈ పరిణామాలు చూసిన కేజ్రీవాల్ పంజాబ్‌లో వాళ్ల ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో ప్రస్తుత పరిస్థితి రష్యాలో మాదిరిగా ఉన్నదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఆ దేశంలో నియంతృత్వం కొనసాగుతున్నదని, ప్రతిపక్ష నేతలను జైళ్లలో బంధిస్తున్నారని, మన దేశంలోనూ అలాగే ఉందని తెలిపారు. అయితే నియంత పాలనను దేశం అంగీకరించబోదని’ స్పష్టం చేశారు.
ఉద్ధవ్, పవార్‌లే ప్రధాని టార్గెట్
మహారాష్ట్రలోనూ ప్రధాని మోడీ ఉద్ధవ్‌ఠాక్రేను చూసి కలవరపడుతున్నారు. శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌పవార్)ల వల్ల బీజేపీ సీట్లకు గండి పడుతుందని వాళ్లపై విరుచుకుపడుతున్నారు. ఉద్ధవ్ కూడా ప్రధాని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ‘ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోబోతున్నది. జూన్ 4 తర్వాత ఆపార్టీ రెండుగా చీలిపోతుందని శివసేస (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే అన్నారు. మోడీ ప్రధానిగా ఎంతో కాలం ఉండరు. జూన్ 4 తర్వాత ఆయన మాజీ ప్రధానిగా పిలువబడుతారు. 2014,2019 లోక్‌సభ ఎన్నికలలో నరేంద్రమోడీ కోసం ఓట్లు అడిగినందుకు నన్ను క్షమించాలని’ ఉద్ధవ్ కోరారు.
పదేళ్లలో తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోలని స్థితి బీజేపీలో ఉన్నది. ఎన్నికల్లో ఈసారి ఆ పార్టీకి అజెండా అనేది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయన్నది స్పష్టమౌతున్నది. నాలుగు దశల పోలింగ్‌లో ఇండియా కూటమి బాగా పుంజుకున్నదని, ఎన్డీఏ కూటమి గతంలో గెలుచుకున్న సీట్లలను తిరిగి నిలబెట్టుకోవడానికి ఆపసోపాలు పడుతున్నదని, అయినా ఫలితం కనిపించడం లేదన్నది పోలింగ్ సరళిని బట్టి చాలామంది రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే అమిత్ షా లాంటి వాళ్లు అబద్ధాలు ప్రచారం చేసి అయినా గెలువాలన్న ఉద్దేశంతోనే నాలుగు దశలలో 270 మార్క్ దాటేశామని చెబుతున్నారనే వాదన ఉన్నది.