Lok Sabha Elections | రేపే ఐదో దశ ఎన్నికలు.. ఈ ఐదుగురి అదృష్టం ఎలా ఉండబోతుందో..?
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ దగ్గర పడుతోంది. మొత్తం ఏడు దశల్లో ఇప్పటి వరకు నాలుగు దశలు పూర్తయ్యాయి. ఈ నెల 20న ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
Lok Sabha Elections | న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ దగ్గర పడుతోంది. మొత్తం ఏడు దశల్లో ఇప్పటి వరకు నాలుగు దశలు పూర్తయ్యాయి. ఈ నెల 20న ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఐదో దశలో పోటీ పడుతున్న ప్రముఖ నాయకులు ఓ ఐదుగురు ఉన్నారు. అందులో రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు.
రాహుల్ గాంధీ – రాయ్‌బరేలీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే ప్రధాని రేసులో కూడా ఉండే అవకాశం ఉంది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి లోక్‌సభకు పోటీ చేసి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. లక్ష ఓట్ల మెజార్టీతో ఆ ఎన్నికల్లో గెలుపొందారు. 2009,2014 ఎన్నికల్లోనూ గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో చిత్తుగా ఓడిపోయారు రాహుల్. అయితే 2019 ఎన్నికల్లో రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. అమేథీలో ఓటమి పాలైనప్పటికీ వయనాడ్‌లో గెలిచారు. 2024 ఎన్నికల్లో వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి పోటీకి దిగారు. రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ గత ఎన్నికల వరకు గెలుస్తూ వచ్చారు. వయసు రీత్యా ఆమె ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో తన తల్లికి కంచుకోట అయిన రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారు. తల్లిలా విజయ ప్రస్థానం కొనసాగిస్తారా..? లేక గత రెండు ఎన్నికల్లో అమేథీలో ఓటమిపాలైనట్లు పరాజయం చెందుతారా..? అన్నది ఓటర్లు నిర్ణయించనున్నారు.
స్మృతి ఇరానీ – అమేథీ
నటిగా తన జీవితాన్ని కొనసాగించిన స్మృతి ఇరానీ.. 2003లో భారతీయ జనతా పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004 జనరల్ ఎలక్షన్స్‌లో ఢిల్లీలోని చాందీని చౌక్ నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ చేతిలో ఓటమి పాలయ్యారు. పదేండ్ల విరామం తర్వాత 2014 ఎన్నికల్లో అమేథీ నుంచి బరిలోకి దిగి రాహుల్ చేతిలో ఓడిపోయారు. చివరకు 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీని 55 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆమె అమేథీ నుంచి పోటీ చేశారు.
రాజ్‌నాథ్ సింగ్ – లక్నో
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. రెండు సార్లు ఆయన లక్నో నుంచి గెలుపొందారు. మూడోసారి కూడా లక్నో నుంచి బరిలో ఉన్నారు. అయితే 15వ లోక్‌సభ ఎన్నికల్లో ఘజియాబాద్ నుంచి గెలిచారు. 16వ లోక్‌సభ ఎన్నికల సమయంలో తన స్థానాన్ని ఘజియాబాద్ నుంచి లక్నోకు మార్చుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ ఆయన లక్నో నుంచి గెలుపొందారు. లోక్‌సభకు ఎన్నికయ్యే కంటే ముందు, రాజ్‌నాథ్ సింగ్ మూడు వేర్వేరు సందర్భాలలో ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు.
కరణ్ భూషణ్ సింగ్ – కైసర్‌గంజ్
కరణ్ భూషణ్ సింగ్.. బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు. కైసర్‌గంజ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బ్రిజ్ భూషణ్‌పై 2023లో కొంత మంది రెజర్లు లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్‌ను పక్కకు పెట్టి, ఆయన కుమారుడు కరణ్ సింగ్‌కు అవకాశం ఇచ్చింది బీజేపీ పార్టీ. అయితే బ్రిజ్ భూషణ్‌ను విమర్శించిన రెజర్లపై కరణ్ భూషణ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏది ఏమైనప్పటికీ కరణ్ సింగ్ గెలుస్తారని బీజేపీ కేడర్ ధీమాగా ఉంది. ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కరణ్ కొనసాగుతున్నారు.
రోహిణి ఆచార్య – సరన్
ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తెనే రోహిణి ఆచార్య. ఇండియా కూటమి తరపున బీహార్‌లోని సరన్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రోహిణి పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న రోహిణి.. రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఒకప్పుడు తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు బలమైన కోటగా ఉన్న సరన్ స్థానం నుంచి ఆమె పోటీలో ఉన్నారు. సరన్ లోక్‌సభ నియోజకవర్గంలో రెండుసార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీ.. రోహిణికి పోటీగా ఉన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram