simultaneous polls । జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక అడుగు.. రెండు బిల్లులకు క్యాబినెట్ ఆమోదం
గురువారం నాటి క్యాబినెట్ సమావేశంలో స్థానిక, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ముసాయిదా చట్టాన్ని చర్చించలేదు. దీంతో ప్రస్తుతానికి లోక్‌సభ, అసెంబ్లీల జమిలి ఎన్నికలపైనే కేంద్రం దృష్టిపెట్టిందని, పూర్తి స్థాయిలో ఒకే దేశం ఒకే ఎన్నికకు ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాలన్న భావనతో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

simultaneous polls । దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను గురువారం నిర్వహించి కేంద్ర క్యాబినెట్ సమావేశం ఆమోదించింది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులను కేంద్ర క్యాబినెట్ మూడు నెలల క్రితం ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమోదించిన రెండు బిల్లుల్లో ఒకటి లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు, మరొకటి ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్ముకశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు ఉద్దేశించిన సాధారణ బిల్లు ఉన్నాయి. ఈ రెండు బిల్లులను ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెడతారని, అయితే వాటిని కేంద్రం ఏర్పాటు చేసే సంయుక్త పార్లమెంటరీ కమిటీకి వెంటనే పంపుతారని తెలుస్తున్నది.
జమిలి ఎన్నికలను 2029 నుంచి ప్రారంభిస్తారా? లేక 2034 నుంచి ప్రారంభిస్తారా? అన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ధృవీకరణలు లేవు. అయితే.. పార్లమెంటులోనూ, వెలుపల ఈ బిల్లుపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గురువారం నాటి క్యాబినెట్ సమావేశంలో స్థానిక, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ముసాయిదా చట్టాన్ని చర్చించలేదు. దీంతో ప్రస్తుతానికి లోక్‌సభ, అసెంబ్లీల జమిలి ఎన్నికలపైనే కేంద్రం దృష్టిపెట్టిందని, పూర్తి స్థాయిలో ఒకే దేశం ఒకే ఎన్నికకు ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాలన్న భావనతో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని, తదుపరి వంద రోజులలోపు రెండో దశలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాంనాథ్ కోవింద్ కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల అనంతరం ఇప్పటికే జమ్ము కశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల విషయంలో కేంద్రం ఏం చేయనున్నది అనేది తేలాల్సి ఉన్నది.