Lok Sabha Speaker | స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. ఆ ప్ర‌క్రియ ఎలా ఉంటుందో తెలుసా.. గ‌తంలో ఎన్నిసార్లు జ‌రిగింది..?

లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla)ను పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష ఎంపీలు (Opposition MPs) అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో లోక్‌స‌భ‌లో స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం జ‌రిగే ప్ర‌క్రియ ఎలా ఎంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Lok Sabha Speaker | స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. ఆ ప్ర‌క్రియ ఎలా ఉంటుందో తెలుసా.. గ‌తంలో ఎన్నిసార్లు జ‌రిగింది..?

Lok Sabha Speaker | లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla)ను పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష ఎంపీలు (Opposition MPs) అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(సి) కింద ఈ నోటీసులు ఇచ్చారు. లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు నోటీసులు అంద‌జేశారు. ఈ నోటీసులో 118 మంది ఎంపీల సంతకాలు ఉన్నాయి. బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఆయ‌న పాల‌క‌ప‌క్షానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను మాట్లాడ‌నివ్వ‌లేద‌ని ఆరోపిస్తూ ఈ చ‌ర్య‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో లోక్‌స‌భ‌లో స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం జ‌రిగే ప్ర‌క్రియ ఎలా ఎంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

14 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలి..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(సీ) కింద లోక్‌సభ స్పీకర్‌ లేదా డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదిస్తే స్పీకర్, లేదా డిప్యూటీ స్పీకర్ తమ పదవిని కోల్పోతారు. లోక్‌సభ కార్యకలాపాల నిబంధనల ప్రకారం, లోక్‌సభ ఎంపీ ఎవరైనా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చు. అయితే అందులో ఇద్ద‌రు లోక్‌స‌భ ఎంపీల సంత‌కాలు మాత్రం త‌ప్ప‌నిస‌రి. ఈ తీర్మానానికి సంబంధించి కనీసం 14 రోజుల ముందే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాథ‌మికంగా అందులోని అంశాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత దీనిపై నిర్ణ‌యం తీసుకుంటారు. ఈ తీర్మానంలో ప‌రువుకు న‌ష్టం క‌లిగించే భాష‌, ఇత‌ర అంశాలు వంటి లోపాలు ఉండ‌కూడ‌దు.

లోపాలు ఉంటే.. తిర‌స్క‌రించొచ్చు కూడా..

ఒక‌వేళ ఏవైనా లోపాలు ఉంటే.. ఆ నోటీసును స్పీక‌ర్ తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు, త‌న‌ను తాను స‌మ‌ర్థించుకునే అవ‌కాశం స్పీక‌ర్‌కు ఆర్టిక‌ల్ 96 క‌ల్పిస్తుంది. నోటీసుల్లో ఎలాంటి లోపాలూ లేకుంటే.. స‌భ‌లో నిర్వ‌హించాల్సిన కార్య‌క‌లాపాల జాబితాలో ఈ తీర్మానాన్ని చేరుస్తారు. తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన 10 రోజుల్లోగా దీనిపై చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంటుంది. నిర్ణీత తేదీన లోక్‌సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. చ‌ర్చ‌కు ఓ తేదీని కూడా కేటాయిస్తారు. ఆ సమయంలో సభలో ఉన్న కనీసం 50 మంది ఎంపీలు ఈ తీర్మానానికి మ‌ద్ద‌తు తెల‌పాల్సి ఉంటుంది. చ‌ర్చ అనంత‌రం దీనిపై ఓటింగ్ నిర్వ‌హిస్తారు.

అవ‌కాశం ఉన్నా తిర‌స్క‌రించ‌ని స్పీక‌ర్‌..

ఇప్పుడు స్పీక‌ర్ ఓం బిర్లాపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులో లోపాలు ఉన్న‌ట్లు గుర్తించారు. నోటీసుల‌ను ప‌రిశీలించిన అధికారులు అందులో సాంకేతిక‌, విధాన‌ప‌ర‌మైన లోపాలు ఉన్న‌ట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఫార్మాట్‌లో ఈ నోటీసు లేదని అధికారులు తెలిపారు. కొన్ని సంద‌ర్భాల‌ను ప్ర‌తిప‌క్ష‌నేత‌లు అందులో ప‌దేప‌దే ప్ర‌స్తావించిన‌ట్లు తెలిపారు. అయితే, ఈ నోటీసును తిర‌స్క‌రించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ స్పీక‌ర్ అలా చేయ‌లేదు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ తదుపరి చర్యల కోసం స్పీకర్ సానుకూలంగా స్పందించారు. అందులోని లోపాల‌ను స‌రిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఎన్డీయేకే మెజారిటీ..

ఇక ఓటింగ్‌ రోజున సభలో ఉన్న మెజారిటీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటువేస్తేనే ప్రతిపక్షాల లక్ష్యం నెరవేరుతుంది. కానీ, ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 293 ఎంపీల మద్దతు ఉంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో 238 మంది ఎంపీలు మాత్ర‌మే ఉన్నారు. కూట‌మిలోని కొన్ని పార్టీలు ఈ అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తిచ్చేందుకు నిరాక‌రిస్తున్నాయి. దీంతో, స‌భ‌లో అధికార‌ప‌క్షానికే అధిక మెజారిటీ ఉండ‌టంతో ఈ తీర్మానం నెగ్గే ప‌రిస్థితి లేదు.

గ‌తంలోనూ విఫ‌ల‌ప్ర‌య‌త్నాలు

స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌య‌త్నాలు గ‌తంలోనూ జ‌రిగాయి. కానీ ఒక్క‌సారి కూడా గెలిచింది లేదు. 1954లో అప్ప‌టి స్పీక‌ర్ జీవీ మావ‌లంక‌ర్‌పై విప‌క్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఆ త‌ర్వాత 1966లో స్పీక‌ర్ హుక‌మ్ సింగ్‌పై, 1987లో స్పీక‌ర్ బ‌ల‌రామ్ జాఖ‌ర్‌పై తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. కానీ ఆ ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి. ఇప్పుడు కూడా లోక్‌స‌భ‌లో ఎన్డీయే కూట‌మికి అధిక మెజారిటీ ఉండ‌టంతో.. ఇది కూడా ఆమోదం పొందే అవ‌కాశం లేదు.

ఇవి కూడా చదవండి :

Malavika Mohanan | హ్యాండ్లూమ్ శారీలో మెరిసిపోతున్న పాయల్ మాళవిక మోహనన్
ఇండియా-పాకిస్థాన్ బార్డర్‌లో కంచెకు సీసాలు ఎందుకు వేలాడదీస్తారో తెలుసా? దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా!