భారత దేశ చరిత్ర అంటే బౌద్ధానికి, బ్రాహ్మణిజానికి మధ్య జరిగిన సంఘర్షణే అని చెప్పిన డాక్టర్ అంబేడ్కర్ మాటలు రామాయణం యొక్క పూర్వాపరాలు గురించి ఇట్టే తెలియజేస్తాయి. క్రీస్తు పూర్వం 5 వ శతాబ్దంలో మొదలైన బౌద్ధ విప్లవాన్ని తట్టుకోలేని బ్రాహ్మణిజం.. రామాయణ, మహాభారతాలను రచించింది
భారత దేశ చరిత్ర అంటే బౌద్ధానికి, బ్రాహ్మణిజానికి మధ్య జరిగిన సంఘర్షణే అని చెప్పిన డాక్టర్ అంబేడ్కర్ మాటలు రామాయణం యొక్క పూర్వాపరాలు గురించి ఇట్టే తెలియజేస్తాయి. క్రీస్తు పూర్వం 5 వ శతాబ్దంలో మొదలైన బౌద్ధ విప్లవాన్ని తట్టుకోలేని బ్రాహ్మణిజం.. రామాయణ, మహాభారతాలను రచించింది. రామాయణం పూర్తిగా బుద్ధుడికి వ్యతిరేకంగా (కౌంటర్) రాయబడితే, క్రీస్తు పూర్వం 274లో అఖండ భారతాన్ని పరిపాలించిన సమ్రాట్ అశోకుడికి వ్యతిరేకంగా (కౌంటర్) మహాభారతం రాయబడింది.
బుద్ధుని గురువు వెస్సామిత్త
మచ్చలేని మహామనిషి గౌతమ బుద్ధుడు. భారతదేశంలో గౌతమ బుద్ధుడు జన్మించడం మన దేశానికెంతో గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి కొన్ని శక్తులు గౌతముడి గురించి కానీ, బౌద్ధం గురించి కానీ తెలుసుకోవాలి అనే జిజ్ఞాస లేకుండా చేశారు.
బుద్ధుడు గురువు వెస్సామిత్తను చెప్పకుండా రాముడి గురువు విశ్వామిత్రుడి గురించి గొప్పగా చెప్పారు. బుద్ధుడి గురించి తెలియకుండా చేయడానికని రాముడు ఆదర్శంగా మనకు చెప్పారు. గౌతమ బుద్ధుడి చరిత్ర కనుక మనం చదివితే మనకు రామాయణం మీద చాలా అనుమానాలు వస్తాయి. వెస్సామిత్తను చూసే వాల్మీకి తన రామాయణంలో విశ్వామిత్రుడి పాత్రను సృష్టించారు.
గౌతమ బుద్ధుడు యవ్వనంలో ఉండగా రాజ్యపాలనకు అర్హత ఉందో లేదోనని శాక్యులు ఒక పరీక్ష పెట్టారు. ఎవరూ ఎక్కుపెట్టలేని పెద్ద విల్లును గౌతముడు ఎక్కుపెట్టి నారిని వింటికి తగిలించాడు. దీనినే వాల్మీకి కాపీ కొట్టి రాముడి చేత ఎక్కుపెట్టించి, విల్లును విరిచినట్లు చెప్పారు. ఇక్కడ చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యారు వాల్మీకి మహాశయుడు. అది ఏంటంటే విల్లును విరిచేస్తే గొప్పతనం ఏముంది? ఆ పెద్ద విల్లుకు నారిని తగిలించాలి కదా! విల్లు పట్టు ఎక్కువైతే విరిగిపోతోంది. తక్కువైతే నారిని తగిలించలేం కాబట్టే గౌతముడు తగిలించాడు. రాముడి చేత వాల్మీకి విరగ్గొట్టించాడు. ఇక్కడే వాల్మీకి లాజిక్ మరిచాడా అనిపిస్తుంది.
‘బ్రాహ్మణుల ద్వారా వ్రాయబడిన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, మహా భారతం వీటితో పాటు బ్రాహ్మణులు రాసిన పురాణాలన్నీ కూడా కల్పితాలే’ అని డాక్టర్ భీమారావు రాంజీ అంబేడ్కర్ అని అన్నారు.
👉 రామాయణం కంటే ముందు బుద్ధుడు ఉన్నాడని, బౌద్ధవ్యాప్తి ఉధృతిని తట్టుకోలేని బ్రాహ్మణ మతం రాముని పాత్ర సృష్టించి, రామాయణాన్ని వ్రాయించి, బౌద్ధ దూషణకు పూనుకున్నదని చెప్పడానికి ఈ క్రింది శ్లోకమే చాలు.
‘యథాహి చోరస్య తథాహి బుద్ధహాః
తథాగతం నాస్తిక మత్ర విత్తి
తస్మద్దీయశ్శంక్య తమం ప్రజానామ్
నాస్తికే నాభిముఖో బుధ్దస్సాత్’
తాత్పర్యం: దొంగను ఎట్లాగ నిరాకరించాలో అట్లాగే బుద్ధుని నిరాకరించాలి. నాస్తికుడు తథాగతుడితో సమానమని గ్రహించాలి. కనుక ఎవనిని ప్రజలు నాస్తికుడని సందేహిస్తున్నారో వానితో పండితులు పలకరాదు.
సందర్భం: అరణ్యవాసం మాని తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యం ఏలుకోవలసిందిగా భరతుడు రాముని కోరినప్పుడు, భరతుని సమర్థిస్తూ జాబాలి మహర్షి మాట్లాడినపుడు, రాముడు కుపితుడై జాబాలి చేసిన నాస్తిక బోధనను నిందిస్తూ, నాస్తికమతాన్ని దూషించిన సందర్భమిది. (అయోద్యకాండ 109 వ సర్గ 34వ శ్లోకం)
👉 వేద పురాణాలు అనే కట్టుకథలు బ్రాహ్మణులే వ్రాసి మనల్ని బానిసలు వలె తయారు చేస్తున్నారు అని పెరియార్ అన్నారు.
తమిళనాడులో పెరియార్ ద్రావిడ స్వాభిమాన (సెల్ఫ్ రెస్పెక్ట్) ఉద్యమాన్ని నడిపారు. ఆర్యులు ద్రావిడులను బానిసలుగా చేయడానికి గానూ రామాయణం రచించారు అని పెరియార్ రామాయణం కట్టు కథ గుట్టును విప్పి జనాలకు బోధించారు. యథార్థ రామాయణం పేరుతో రామాయణం యొక్క నిజానిజాల గురించి పరిశోధనాత్మక గ్రంథాన్ని రచించారు.
ద్రావిడులు నాగజాతి వారే. మిత్రులారా భారతదేశంలో నాగజాతి శక్తివంతమైన జాతి. ఆర్యులు ఈ నాగజాతి ప్రజలను చెల్లాచెదురుగా చేశారు. వర్ణాల పేరుతో, కులాల పేరుతో ముక్కలు ముక్కలుగా చేశారు. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా ఉన్న నాగజాతి వారమంతా ఏకం కావాలి. నాగజాతి రక్షకుడు గౌతమ బుద్ధుడు బాటలో నడుద్దాం..
సిద్ధార్థునికి ప్రజలు పెట్టిన పరీక్ష
సిద్ధార్థుడు సూర్య వంశస్థుడు. సిద్ధార్థుని గురువు వెస్సామిత్త. ఒకసారి సిద్ధార్థుడు రాజ్య పాలన చేయుటకు అర్హత ఉంది, లేనిదీ పరీక్షించదలచి ప్రజలు ఆనాడు ఒక పరీక్ష పెట్టడం జరిగింది.
పరీక్ష ఏమిటి ?
సిద్ధార్థునికి పరీక్ష ఏమిటనగా ఆనాటి రాజ్యంలో ఎవరూ మోయలేనంత బరువు ఉన్న పెద్ద విల్లును.. అంటే.. సుమారు వేయి మంది మోయగలిగిన విల్లు అది. అలాంటి విల్లును ఎక్కు పెట్టాలి.
సిద్ధార్థుడు ఆ పరీక్షకు సిద్ధమేనని తన అంగీకారాన్ని తెలిపాడు. సిద్ధార్థుడు ఎంతో అవలీలగా ఆ విల్లును ఎక్కు పెట్టాడు. ఎక్కు పెట్టడమే కాదు నారిని ఆ వింటికి తగిలించాడు. ఇలాంటి పెద్ద సైజులో ఉన్న విల్లుకు నారిని తగిలించాలంటే ఎంతో నైపుణ్యం ఉండి తీరాలి. లేదంటే ఆ విల్లు విరిగిపోవడం ఖాయం. అయితే సిద్ధార్థుడు విల్లును విరగగొట్టలేదు.
పట్టు ఎక్కువ అయితే విల్లు విరిగిపోవడం, పట్టు తక్కువైతే నారిని విల్లుకు తగిలించలేం. ఈ కిటుకు సిద్ధార్థునికి బాగా తెలుసు. అందుకే చాలా సునాయాసంగా విల్లును ఎక్కు పెట్టాడు, దానికి నారిని తగిలించగలిగాడు.
ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన రామాయణం గుర్తుకు వస్తుంది కదూ ! అవును.. రామాయణం రాసిన వాల్మీకి కూడా ఇదే యథార్థ కథను యథాతథంగా కాపీ చేసి అసమగ్రంగా అనుకరణ చేసి రచించాడు. బౌద్ధ మత వ్యాప్తికి, ఉధృతికి తట్టుకోలేక బ్రాహ్మణ మతం రామాయణం అనే కథను వాల్మీకి చేత రచింపచేసింది. రాముడు విల్లును ఎక్కుపెట్టి విరిచేశాడు వేటగాళ్ళ కథలో. అదే నిజకథలో సిద్ధార్థుడు అలా విరిచేయలేదు. ఆ విల్లుకు చాలా తెలివిగా తన నైపుణ్యంతో నారిని తగిలించాడు. ఏదైనా సరే పగులగొట్టడం, విరిచేయడం సులువే.. అలా చేస్తే ఏముంది గొప్పతనం? ఒక దాన్ని సృష్టించి చూపు అప్పుడు కదా నీ గొప్పతనం తెలిసేది. వాల్మీకి అనుకరణ చేసేటప్పుడు ఈ చిన్న లాజిక్‌ను మిస్ అయ్యాడు. పెద్ద సైజులో ఉన్న విల్లుకు పట్టు ఎక్కువైతే విరిగిపోతుంది. పట్టు తక్కువైతే విల్లుకు నారిని సంధించలేం.. అంటే తగిలించలేం. ఈ చిన్న కిటుకు సిద్ధార్థునికి తెలుసు.. రామాయణం కథలో రామునికి తెలియలేదు.
మహిళలకు ఆదర్శం యశోధర :
దేవదహ రాజ్యానికి చెందిన రాజు సుప్పబద్ధ, రాణి పమితల తనయ యశోధర. సుప్పబద్ధనే దండపాణి అని కూడా పిలిచేవారు. సుప్పబద్ధ శాక్య వంశానికి చెందిన రాజు. స్వయంగా సిద్ధార్థ గౌతముని తండ్రి అయిన శుద్ధోదన మహారాజుకు బావమరిది. యశోధర వైశాఖ శుద్ధ పున్నమి రోజున జన్మించింది. సిద్ధార్థుడు వైశాఖ పున్నమి రోజునే యాదృచ్ఛికంగా జన్మించడం విశేషం. యశోధరకు గల పేర్లు రాహులమాత, ఉత్పలవర్ణ, గోస, బుద్ధకచ్చానా, బింబా. సిద్ధార్థుని గుణగణాలు, యుద్ధ విద్యలో ఆరితేరినవాడు కావడంతో యశోధర సిద్ధార్థుని ఇష్టపడి పరిణయమాడింది. యశోధర-సిద్ధార్థునికు ఒక తనయుడు కలడు.తన పేరు రాహులుడు. యశోధర, సిద్ధార్థుని సంసారం చాలా ఆనందంగా సాగింది. శాక్యులు, కొలియులకు మధ్య జరిగిన రోహిణీ నదీ జలాల వివాదంలో సిద్ధార్థుడి జోక్యాన్ని శాక్య సంఘం వ్యతిరేకించింది. సిద్ధార్థుణ్ణి ముద్దాయిగా చేసి శాక్యసంఘం మూడు రకాలుగా శిక్ష వేసి దాంట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంచుకోవాలి అని చెప్పారు. సిద్ధార్థుడు సంఘ బహిష్కరణను ఎంచుకున్నాడు. తన వలన తన కుటుంబం ఇబ్బందులు పడరాదని సిద్ధార్థుడు తనపై శిక్ష వేసుకుని పరివ్రాజకునిగా మారి మానవాళి క్షేమం కోసం కృషి చేశారు. ఈ విషయం యశోధరకు, సిద్ధార్థుడి తల్లిదండ్రులకు కూడా తెలుసు. సిద్ధార్థుడు ఇల్లు వదిలి వెళ్ళిన నాటి నుండి యశోధర సాధారణ బట్టలు ధరించేది, నేలపైనే పడుకునేది. మట్టి పాత్రలో భోజనం చేసేది. సిద్ధార్థుడు ఎంత త్యాగం చేస్తున్నాడో అంతే త్యాగం యశోధర చేసేది. గౌతమ బుద్ధుడు కపిలవస్తు వచ్చాక యశోధర గొప్పతనాన్ని, వైరాగ్యంతో ఉన్న ఆమెను చూసి సంతోషపడతారు. యశోధర.. సత్ప్రవర్తన ద్వారా గొప్ప శక్తిని పొందావు. నీ బాధలను నీవే పోగొట్టుకునే సామర్థ్యాన్ని పొందావు. ఇది చాలా విలువైన సంపద, దీనిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని గౌతమ బుద్ధుడు యశోధరకు బోధించారు. కొంతకాలానికి యశోధర కూడా గౌతమ బుద్ధుని పినతల్లి గౌతమితో సహా బౌద్ధ భిక్ఖుణిగా మారుతారు. యశోధర తనయుడు రాహులుడు కూడా బౌద్ధ భిక్ఖు అవుతారు.
దాయభాగంగా తన తనయునికి ప్రవ్రజ్య ఇచ్చిన బుద్ధుడు
భగవాన్ బుద్ధుడు ధర్మ ప్రచారం చేస్తూ రాజగహం (రాజగృహ) నుండి కపిలవస్తు నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలోని ‘నిగ్రోధారామం’ అనే విహారంలో బసచేశారు. ఒకరోజు బుద్ధుడు భిక్ష కోసం భిక్షాటన చేయడానికి భిక్షాపాత్రతో కపిలవస్తు నగర వీధుల్లోకి వస్తారు. భగవానుడు నేరుగా భిక్షాటన చేస్తూ శుద్ధోదన మహారాజ భవనానికి వెళ్ళారు. బుద్ధుని రాకను గమనించిన బుద్ధుని భార్య యశోధర తన తనయుడు రాహులునితో.. ‘చూడు కుమారా! నీ తండ్రి భగవాన్ బుద్ధుడు. నీ తండ్రి వద్దకు వెళ్ళి నీకు రావలసిన దాయ భాగం ఇవ్వమని అడుగు అని అంటుంది.’అంతట రాహులుడు భగవానుని దగ్గరకు వెళ్ళి నిలబడగా…, బుద్ధుడు అక్కడ నుండి మౌనంగా వెళ్ళి పోయారు.. రాహులుడు కూడా తండ్రి వెనుకే వెళతాడు.. ‘ఓ తండ్రి, భగవానుడా! నాకు ఈయవలసిన దాయభాగం. ఇవ్వండి’ అని అంటాడు.
బుద్ధుడు నిద్రోధారామ విహారం చేరుకుని. సారిపుత్రుణ్ణి పిలిచి నా తనయుడైన రాహులునికి ఇవ్వవలసిన దాయ భాగంగా ‘ప్రవ్రజ్య’ను ఇవ్వండి అని చెబుతాడు.. సారి పుత్రుడు రాహులునికి శ్రామణేర(సమణ) దీక్షను ఇచ్చాడు. చరిత్రలో రాహులుడు తొలి శ్రామణేరునిగా నిలిచాడు. శ్రామణేరునిగా మారే సమయానికి రాహులుని వయస్సు 20 సంవత్సరాలు నిండనే లేదు.
మరి ఇప్పుడో.. చాలామంది ఆదర్శాలను జనాలకు వేదికలెక్కి బోధిస్తున్న వాళ్ళు అవార్డులు కోసం, డబ్బులు కోసం టీవీ ఛానళ్లలో ప్రసంగాలు చేసేవాళ్ళు, పత్రికలలో వ్రాసే వాళ్ళు తమ పిల్లలకు మాత్రం బాగా డబ్బులు సంపాదించి పెట్టి, భూములను, భవనాలను ఇస్తున్నారు. ధర్మాన్ని బోధించడం మరచిపోతున్నారు. ఇతరులకు మాత్రమే ధర్మాన్ని ఉపదేశిస్తున్నారు. తమ ఇంట్లో వాళ్ళకి మాత్రం కెరీర్‌లో ఎదగడానికి మార్గాలు సుగమం చేస్తూ, కేవలం విలాసవంతమైన జీవితం ఇస్తున్నారు.
సింహాల చరిత్ర చదవండి.. వేటగాళ్ళ చరిత్ర కాదు..
✍️ అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
(వ్యాసంలో పేర్కొన్న అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)