Bandi Chor Divas celebrations : జోడు గుర్రాల స్వారీ..పంజాబీలకే చెల్లు

పంజాబ్‌లో బండి చోర్ ఉత్సవంలో సిక్కు యువకులు జోడు గుర్రాలపై సాహస స్వారీ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశారు.

Bandi Chor Divas celebrations : జోడు గుర్రాల స్వారీ..పంజాబీలకే చెల్లు

న్యూఢిల్లీ : దేశంలోని సిక్కులు..మరాఠీలు, రాజ్ పుత్ లను సాహస శౌర్యాలకు మారుపేరుగా చెబుతుంటారు. మొఘల్స్ వ్యతిరేక పోరాటాలలో వారు చూపిన ధైర్య సాహసాలు..సాగించిన పోరాటాలు వారికి ఆ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పటికి భారత సైన్యంలో సిక్కులు కీలకంగా ఉన్నారు. ఇకపోతే పంజాబ్ లో బండి చోర్ దీవస్ ఉత్సవం ఏటా సిక్కుల శక్తి సామర్ధ్యాలకు నిదర్శనంగా నిలుస్తుంది. సిక్కుల పర్వదినాల్లో ఒకటిగా నిర్వహిస్తున్న బండి చోర్ ఉత్సవాన్ని ఆరవ సిక్కు గురువు గురు హరగోవింద్ సింగ్ మొఘల్ చక్రవర్తి జహంగీర్ బందీ నుంచి 1619లో గ్వాలియర్ కోట నుండి విడుదలైనందుకు గుర్తుగా జరుపుకుంటారు. గురు హరగోవింద్ తనతో పాటు మరో 52మంది హిందూ యువరాజులను విడిపిస్తారు.

ఈ వేడుకను ప్రతి ఏటా దీపావళీ సందర్భంగా బండి చోర్ ఉత్సవం పేరుతో నిర్వహించుకుంటారు. దీపాలు వెలిగించి, బాణసంచాలు కాల్చి కుటుంబ సభ్యులతో వేడుకగా జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో భాగంగా సిక్కులు గుర్రపు స్వారీ విన్యాసాలు, గట్కా ప్రదర్శనలలో తమ నైపుణ్యాలను, సామర్ధ్యాలను చాటుకుంటుంటారు.

తాజాగా నిర్వహించిన బండి చోర్ దీవస్ ఉత్సవంలో సిక్కులు జోడు గుర్రాల స్వారీ అందరిని అబ్బుర పరిచింది. వేగంగా పరుగెడుతున్న రెండు గుర్రాలపై ఒక్కో కాలు పెట్టి నిలబడి స్వారీ చేసిన తీరు చూసి తీరాల్సిందే. సాధారణంగా ఏదేని పనిలో, వృత్తులలో ఒకేసారి రెండు పనులు చేస్తే ఎదురయ్యే కష్టాలకు, ఇబ్బందులకు మారుపేరుగా జోడు గుర్రాల స్వారీ సామేతను చెబుతుంటారు. అలాంటిది బండి చోర్ దీవస్ లో సిక్కు యువకులు నిజంగానే జోడు గుర్రాల స్వారీలో పోటీ పడటం విస్మయం కల్గించకమానదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో వారి జోడు గుర్రాల సాహసం నెవ్వర్ బీఫోర్..ఎవర్ ఆఫ్టర్ అంటూ పొగిడేస్తున్నారు.