Gadari Kishore Kumar : డెక్కన్ సిమెంట్ కమీషన్ల కోసమే సీఎం, మంత్రుల గొడవ
డెక్కన్ సిమెంట్ కమీషన్ల కోసం సీఎం రేవంత్, మంత్రి కొండా సురేఖ మధ్య గొడవ గాదరి కిషోర్ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని రేగించాయి.

విధాత, హైదరాబాద్ : డెక్కన్ సిమెంట్ కమీషన్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కొండా సురేఖకు గొడవ తలెత్తిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆరోపించారు. డెక్కన్ సిమెంట్ కమీషన్ల పంచాయతీని సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి కొండా సురేఖను పిలిచి సెటిల్ చేయలేదా? అని ప్రశ్నించారు. రోహిన్ రెడ్డి, కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఇద్దరూ కలిసి తుపాకి పెట్టి బెదిరించిన వ్యవహారంలో తుపాకి ఎక్కడికి పోయిందని..మా మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్లుగా ఇది దండుపాళ్యం బ్యాచ్ కాకపోతే ఏంటి? అని గాదరి కిషోర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో గాదరి కిషోర్ మాట్లాడారు. తెలంగాణ క్యాబినెట్‌లో జరిగిన విషయాలపై మాత్రమే హరీష్ రావు మాట్లాడారని, హరీష్ రావు కాలి గోటికి సరిపోని వాల్లు సవాళ్లు విసురుతున్నారని విమర్శించారు. హరీష్ రావుపై అడ్లూరి లక్ష్మణ్, చామల కిరణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. మంత్రి అడ్లూరిని పట్టుకొని పొన్నం ప్రభాకర్ దున్నపోతు అన్నా స్పందించలేదు అని, ఘజిని మహ్మద్ లాగా ఐదుసార్లు పోటీచేసి ఆడ్లూరి లక్ష్మణ్ గెలిచి..మంత్రి అయ్యారు అన్నారు. నియోజకవర్గంలో అడ్లూరి లక్ష్మణ్‌ను సొల్లు లక్ష్మణ్ అని అంటారని కిషోర్ ఎద్దేవా చేశారు. నువ్వు చెప్పే సొల్లు మేము వినాలా? అంటూ విమర్శించారు.
మీ ప్రభుత్వంలో జరిగేది కొండా సురేఖ కుమార్తె చెప్పింది నిజం కాదా? అని, సీఎం సోదరులకు గన్‍మెన్లు ఎందుకు ఇస్తారని సురేఖ కుమార్తె ప్రశ్నించారని, డెక్కన్ సిమెంట్ కమీషన్ల కోసమే గొడవంతా జరిగిందని కిషోర్ విమర్శించారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జడ్పీటీసీగా పోటీ చేస్తే వంకాయ గుర్తుపై 100 ఓట్లు వచ్చాయని, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓ చీటర్.. రాహుల్ గాంధీ లెటర్ ఫోర్జరీ చేశారని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతేనే సీఎం దిగివస్తాడని చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నాడని..అలీబాబా 40 దొంగలు కాదు, సీఎం ఆ నలుగురు దొంగలు అని మంత్రులు అంటున్నారన్నారని చురకలేశారు. వీళ్ళంతా ఓటీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఒక్కసారి మాత్రమే గెలిచారు.. మళ్లీ గెలవబోరని కిషోర్ వ్యాఖ్యానించారు. మునుగోడులో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సొంత రూల్స్ పెడుతున్నారని, ప్రభుత్వం ఎందుకు స్పందిచడం లేదు అన్నారు. ఇక ముందు హరీష్ రావు మీద మాట్లాడేటప్పుడు ఒల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేదంటే మీరు ఒక్కటంటే మేము వంద అంటాము అని కిషోర్ హెచ్చరించారు.