Andhra Pradesh Weather Forecast : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..ఏపీ అలర్ట్
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలకు కారణమైంది. తీర ప్రాంత జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్' జారీ అయింది.

అమరావతి : నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో బుధ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూల్, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని తెలిపింది. గురువారం కూడా వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, పొంగిపోర్లే వాగులు,రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ విపత్తలు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
ఆ జిల్లాలకు అలర్ట్
తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని చెప్పారు. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
హోంమంత్రి అనిత సమీక్ష
దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపధ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్షించారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందునా. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని ప్రజలకు సూచించారు. సహయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్ గా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు హెచ్చరికలు మెసేజ్ లు పంపాలని ఆదేశించారు. సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని తెలిపారు. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని సూచించారు.
వాకాడు తీరంలో 50అడుగులు చొచ్చుకొచ్చిన సముద్రం
బంగాళా ఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో వాకాడు తీరంలో తుపిలిపాలెం వద్ద సముద్రం 50 అడుగులు ముందుకు వచ్చింది.
అల్పపీడనంతో అలలు ఎగసిపడగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా, చిత్తూర్, తిరుపతి, కడప తదిద
పిడుగుపాటుకు ఇద్దరు మహిళల దుర్మరణం
గుంటూరు జిల్లా పొన్నూరులో మహిళా కూలీలపై పిడుగు పడింది. పొన్నూరు శివారులోని ఇటకంపాడురోడ్డు వద్ద వరి పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు పొలంలో పనులు చేస్తున్న ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులను మరియమ్మ (45), షేక్ ముజాహిద(45)గా గుర్తించారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు.