భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చిన సంజూశాంసన్ : ఇంగ్లండ్‌తో నాకౌట్ పోరుకు సిద్ధం
సంజూ శాంసన్ అజేయ 97 పరుగులతో వెస్టిండీస్‌పై భారత్ 196 లక్ష్యాన్ని ఛేదించి టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మార్చి 5న ముంబై వాంఖడేలో ఇంగ్లండ్‌తో నాకౌట్ పోరు.
నిలిచిగెలిచాడు… గెలిపించాడు! విండీస్‌పై సూపర్-8లో సంజూ శాంసన్ దూకుడు షాట్ – భారత్ సెమీస్‌లోకి దూసుకెళ్లిన సందర్భం.
One-Man Show! Samson Seals Thriller as India Set Up England Clash
సారాంశం:
వెస్టిండీస్‌పై సంజూ శాంసన్ అజేయ 97 పరుగులతో భారత్ సూపర్-8 మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో చేధించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. మార్చి 5న ముంబై వాంఖడేలో ఇంగ్లండ్‌తో నాకౌట్ పోరు.
- సహనంతో ఉంటే, మంచివాళ్లకు మంచే జరుగుతుంది : మ్యాచ్ గెలిచిన తర్వాత సంజూ శాంసన్ గురించి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
విధాత క్రీడా విభాగం | మార్చి 1, 2026 | హైదరాబాద్:
టి20 పురుషుల టి20 క్రికెట్ ప్రపంచకప్ పోటీల సెమీఫైనల్లోకి భారత్ దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో నేడు జరిగిన సూపర్8 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేయగా, ప్రతిగా భారత్ 199 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంజూ శాంసన్ ఒంటి చేత్తో భారత్‌కు ఈ ఘనవిజయాన్నందించాడు. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన విండీస్, సూపర్8లో రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలై, టోర్నీ నుంచి తప్పుకుంది. కాగా, భారత్ ఈనెల 5న జరగనున్న సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది.
ఒకే ఒక్కడు : ఒత్తిడిలో పరిణితి చూపిన సంజూ శాంసన్ – నిలిచి గెలిపించాడు
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్, విండీస్ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నిర్మించలేకపోయారు. కేవలం 10 పరుగులకే అభిషేక్ పెవిలియన్ చేరగా, హార్డ్ హిట్టర్ ఇషాన్ కిషన్ కూడా 10 పరుగులకే వికెట్ పారేసుకున్నాడు. కెప్టెన్ సూర్య కూడా 18 పరుగులకే అవుటయి నిరాశ పరిచాడు. తిలక్ వర్మ సంజూతో జత కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేసాడు. వేగంగా ఆడిన తిలక్ 15 బంతుల్లో 27 పరుగులు చేసి డగౌట్‌కు చేరగా, హార్థిక్ పాండ్యా పరిస్థితిని చక్కదిద్దాడు.
సంజూ శాంసన్ : మొదట్లో, చివర్లో దూకుడు – మధ్యలో నిలకడ : ఆద్యంతం అద్భుతం

సెమీఫైనల్ టికెట్ ఖాయం చేసిన సంజూ శాంసన్… 97* పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ అనంతరం ఆకాశం వైపు చూసి కృతజ్ఞతలు తెలిపిన భావోద్వేగ క్షణం.
కాగా, మొదటి బంతి నుండి చివరి దాకా ధ్వజస్తంభంలా నిలిచిన సంజూ శాంసన్ అందరితో భాగస్వామ్యాలు నెలకొల్పి ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. చివరికి 19.2 ఓవర్లలో సంజూ ఫోర్‌తో 199 పరుగులు చేసిన భారత్ గమ్యాన్ని ముద్దాడింది. సంజూ 50 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలవగా, పాండ్యా 14 బంతుల్లో 17 పరుగులు చేసి అవుటయ్యాడు. శివం దూబే రెండు బౌండరీలు సాధించి లక్ష్యాన్ని తగ్గించగా, 20వ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన సంజూ, రెండో బంతిని విన్నింగ్ షాట్‌గా బౌండరీకి తరలించి భారత్‌కు అపురూప విజయాన్నిందించాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97* పరుగులు చేసిన సంజూ, మొదట్లో వేగంగా, మధ్యలో నిలకడగా, చివర్లో దూకుడుగా ఆడి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. చివరి ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా, రెండో బంతిని బౌండరీగా తరలించి విజయాన్ని ఖాయం చేశాడు.
తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లో మ్యాచ్‌ను విజయవంతంగా ముగించగల సామర్థ్యం కలిగిన బ్యాటర్‌గా సంజూ తన విలువను మరోసారి చాటుకున్నాడు. కాగా, విండీస్ బౌలర్లలో హోల్డర్, జోసెఫ్ తలా 2 వికెట్లు తీసుకోగా, హోసీస్ ఒక వికెట్ సాధించాడు.
విండీస్ : చినుకులతో మొదలై, వరదలా మారిన పరుగులు
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు షాయ్ హోప్, చేజ్‌లు నిలకడగా పరుగులు సాధించి తొలివికెట్‌కు 68 పరుగులు జోడించారు. హోప్‌ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేయగా, క్రీజ్‌లోకి వచ్చిన డాషింగ్ బ్యాటర్ షిమ్రన్ హెట్మయర్ ధనాధన్ షాట్లతో స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. జట్టు స్కోరు 102 పరుగుల వద్ద బుమ్రా తొలివికెట్‌గా హెట్మెయిర్ వెనుదిరగగా, అదే ఓవర్‌లో చేజ్ కూడా కూడా అవుటయ్యాడు. ఇక 119 పరుగులకు 4వ వికెట్ రూపంలో రూథర్‌ఫోర్డ్‌ను హార్థిక్ ఒక సూపర్ బంతితో బలి తీసుకున్నాడు. అక్కడితో వికెట్ల పతనం ఆగిపోయింది.
పావెల్ – హోల్డర్ల విధ్వంసం : భారీ స్కోరుకు బాటలు
క్రీజ్‌లో కుదురుకున్న బ్యాటర్లు రోవ్‌మన్ పావెల్, జేసన్ హోల్డర్‌లు యధేచ్చగా షాట్లు కొడుతూ, స్కోరును వేగంగా పెంచారు. భారత్ పేలవ ఫీల్డింగ్‌తో 3 కీలక క్యాచ్‌లు వదిలేసుకోవడం కూడా విండీస్‌కు కలిసొచ్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఈ జంటను విడదీయలేకపోయాడు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. పావెల్ 34 పరుగులతో, హోల్డర్ 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, పాండ్యా, వరుణ్ చెరో వికెట్ తీసుకున్నారు. కాగా, ఏమాత్రం క్రమశిక్షణ లేని బౌలింగ్, ఫీల్డింగ్‌తో భారత్ తనకుతానే భారీ లక్ష్యాన్ని విధించుకుంది.
కాగా, ఇప్పటికే సెమీస్‌లోకి ప్రవేశించిన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజీలాండ్‌లకు తోడు ఇప్పుడు ఆఖరుగా భారత్ నాకౌట్ దశకు చేరుకుంది. దీంతో తొలి సెమీస్‌లో సౌతాఫ్రికా – న్యూజీలాండ్‌లు ఈనెల 4న పోటీపడనుండగా, రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్-ఇండియా ఈనెల 5న ముంబై వాంఖడేలో తలపడతాయి.
సెమీఫైనల్ షెడ్యూల్
- దక్షిణాఫ్రికా vs న్యూజీలాండ్ – మార్చి 4 (కోల్‌కతా, ఈడెన్ గార్డెన్స్)
- భారత్ vs ఇంగ్లండ్ – మార్చి 5 (ముంబై, వాంఖడే స్టేడియం)
భారీ ఒత్తిడిలో విజయం సాధించిన భారత్, ఇప్పుడు నాకౌట్ దశలో ఇంగ్లండ్‌ను ఢీకొనబోతోంది. సంజూ ఫామ్ కొనసాగడంతో పాటు, మిగతా ఆటగాళ్లందరూ లయ అందిపుచ్చుకుంటే ట్రోఫీ కల మరింత దగ్గరవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram