కరెంట్ షాక్‌తో ఆగిన ఆరేండ్ల బాలుడి గుండె.. రోడ్డుపైనే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్
ఓ ఆరేండ్ల బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. కరెంట్ షాక్ తగిలింది. దీంతో అతను కుప్పకూలిపోయి, అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు

విజయవాడ : ఓ ఆరేండ్ల బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. కరెంట్ షాక్ తగిలింది. దీంతో అతను కుప్పకూలిపోయి, అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. తల్లడల్లిన తల్లిదండ్రులు ఆ పిల్లాడిని తమ భుజాలపై వేసుకుని ఆస్పత్రికి వెళ్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ మహిళా డాక్టర్.. వారిని గమనించింది. క్షణాల్లో ఆమె వారిని ఆపి.. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న ఆరేళ్ల బాలుడు సాయి.. ఈ నెల 5వ తేదీన సాయంత్రం సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఆటలో మునిగిపోయిన బాలుడికి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పేరెంట్స్ ఎంత పిలిచినా అతను స్పందించలేదు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన తల్లిదండ్రులు ఆ బాలుడిని భుజాలపై వేసుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు. ఇంతలో మెడ్‌సీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నన్నపనేని రవళి అటుగా వచ్చారు.
విద్యుత్ షాక్‌తో ఆగిన ఆరేళ్ల బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన డాక్డర్
విజయవాడ – అయ్యప్పనగర్‌లో సాయి(6) అనే బాలుడు రోడ్డు మీద విద్యుత్ షాక్ తగిలి గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.
అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి చూసి బాలుడికి సీపీఆర్ చేసి బాలుడి ప్రాణాలు… pic.twitter.com/qeLQ2tJRbv
— Telugu Scribe (@TeluguScribe) May 17, 2024
పేరెంట్స్ బాలుడిని భుజాలపై వేసుకుని వెళ్తుండగా.. ఏమైందని ఆరా తీశారు. బాలుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని చెప్పడంతో.. నడిరోడ్డుపై బాలుడిని పడుకోబెట్టి సీపీఆర్ చేశారు డాక్టర్ రవళి. దాదాపు 7 నిమిషాల పాటూ అలాగే చేయగా.. పిల్లవాడిలో కదలిక వచ్చింది. ఆ వెంటనే బాలుడ్ని హుటాహుటిన దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడిని తీసుకెళ్లే సమయంలో శ్వాస అందేలా తలను కిందకు ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని చెప్పారు. బాలుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ డాక్టర్ల చికిత్సతతో సాయి ప్రాణాలతో బయటపడ్డాడు.
సమయానికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్ రవళికి సాయి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాయికి డాక్టర్ రవళి సీపీఆర్ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.