మేడారం జాతరలో నాలుగు రోజులు.. నాలుగు ముఖ్య ఘట్టాలు
Medaram Jatara | తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర నేడు మొదలుకానున్నది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. గిరిజనదేవతలను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివస్తున్నది. గద్దెలపై కొలువుదీరనున్న అమ్మవారికి మొక్కులు చెల్లించనున్నారు. ముగులు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఒక్కో రోజు ఒక్కో ఘట్టం ఆవిష్కృతం కానున్నది. భక్తులు నిలువెత్తు బంగారం, చీరెసారెలు, పూలు, పండ్లు, పసుపు కుంకుమలు, గాజులు, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించనున్నారు. బుధవారం నుంచి శనివారం వరకు మహా జాతర కొనసాగనుండగా.. ఏ రోజు ఏ ఘట్టం ఆవిష్కృతమవుతుందో తెలుసుకుందాం రండి..!
జాతర తొలిరోజున..
కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో తొలిరోజు మేడారం మహాజాతరలో సారలమ్మ గద్దెపైకి చేరడంతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమవుతుంది. ములుగు జిల్లాలోని మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామంలోని ఆలయంలో కొలువైన సారలమ్మను గద్దెపైకి తోడుకొని వస్తారు. మధ్యాహ్నమే కన్నెపల్లికి చేరుకున్న వడ్డెలు రెండు గంటల పాటు పూజలు చేస్తారు. పిల్లలు లేనివారు, దీర్ఘకాలిక రుగ్మతలతో భాదపడేవారు పుణ్యస్నానాలు ఆచరించి తడిబట్టలతో గుడిబయట పొర్లుదండాలు పొడుతుంటారు. దేవతా రూపాన్ని తీసుకొచ్చే పూజారులు పొర్లు దండాలు పెడుతున్న వారిపైనుంచి నడిచి వెళ్తుంటారు. అయితే, భక్తులు అమ్మవారే స్వయంగా తమపై నుంచి నడిచి వెళ్తుందని భావించి పొర్లుదండాలు పెడుతారు. మేడారానికి బయలుదేరే సారలమ్మకు కన్నెపల్లి గ్రామ ఆడపడుచులు మంగళహారతి ఇచ్చి సాగనంపుతారు. అంతకు ముందే కొండాయి నుంచి గోవిందరాజులు, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెలపైకి చేరుకుంటారు. తొలిరోజు గోవిందరాజులు, పగిడిద్దరాజు, సారలమ్మ ముగ్గురు గద్దెలపై పూజలందుకుంటారు.
ఇక జాతరలో రెండోరోజు..
జాతరలో రెండోరోజు కీలక ఘట్టం ఆవిష్కృతమవుతుంది. సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరుతుంది. గిరిజన పూజారులు మేడారం సమీపంలోని చిలుకల గుట్టకు వెళ్లి వెదురు కర్రలు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి పూజిస్తారు. ఆ తర్వాత సమ్మక్క పూజా మందిరం నుంచి పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. తర్వాత మళ్లీ చిలుకల గుట్టకు బయలుదేరి.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కుంకుమ భరిణె రూపంలో సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చే మహాఘట్టం మొదలవుతుంది. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె తన్మయత్వంతో పరుగు పరుగున గుట్ట దిగుతూ వస్తాడు. కలెక్టర్, ఎస్పీ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క ఆగమనంతో మేడారమంతా శివసత్తుల పూనకాలు, డప్పుచప్పుళ్లతో మార్మోగుతుంది. కొలువుదీరిన గిరిజన దేవతలకు భక్తులు నిలువెత్తు బంగారం, జంతుబలులతో మొక్కులు చెల్లించుకుంటారు.
మూడోరోజు..
గద్దెలపై కొలువుదీరిన తల్లులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. మొదట జంపన్న వాగులో స్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు. వనదేవతలను తమ ఆడపడుచులుగా భావించి పసుపు, కుంకుమలు, చీరెసారెలు పెడుతారు. అలాగే ఒడిబియ్యం సమర్పిస్తారు. పలువురు భక్తులు తలనీలాలు ఇస్తారు. మరికొందరు భక్తులు నిలువెత్తు బంగారం సమర్పిస్తారు.
నాలుగో రోజు..
మేడారం జాతర నాలుగో రోజు ముగుస్తుంది. సమ్మక్క చిలుకల గుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, గోవింద రాజు కొండాయికి, పగిడిద్ద రాజు పూనుగొండ్లకు బయలుదేరి వెళ్తారు. గిరిజన దేవతల వన ప్రవేశంతో మహా జాతర పూర్తవుతుంది. శనివారం నాలుగు నుంచి ఆరు గంటల వరకు జాతర ముగ్గుస్తుంది. భక్తులు తిరిగి తమ ఇండ్లకు ప్రయాణమవుతారు. మళ్లీ రెండేళ్ల తర్వాత జాతరకు మళ్లీ గిరిజన దేవతలు గద్దెలపైకి చేరుకుంటారు.