అంచనాలు ఆకాశంలో మరి వాస్తవాలు? నాలుగైదేళ్ల లెక్కలు పరిశీలిస్తే అన్నీ కోతలే!

రాష్ట్ర బడ్జెట్ అంటే జమా ఖర్చుల పద్దు.. ఈ పద్దు సరిగ్గా ఉంటేనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బండి సాఫీగా సాగుతుంది. కానీ మన ప్రభుత్వాలు వేసే బడ్జెట్ లెక్కలు పరిశీలిస్తే అంకెల గారడీలానే కనిపిస్తోంది.

అంచనాలు ఆకాశంలో మరి వాస్తవాలు? నాలుగైదేళ్ల లెక్కలు పరిశీలిస్తే అన్నీ కోతలే!

బడ్జెట్‌లో కుదరని లెక్కలు
అంచనాలకు, వాస్తవ ఆదాయ వ్యయాలకు మధ్య భారీ వ్యత్యాసం

(విధాత ప్రత్యేకం)
రాష్ట్ర బడ్జెట్ అంటే జమా ఖర్చుల పద్దు.. ఈ పద్దు సరిగ్గా ఉంటేనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బండి సాఫీగా సాగుతుంది. కానీ మన ప్రభుత్వాలు వేసే బడ్జెట్ లెక్కలు పరిశీలిస్తే అంకెల గారడీలానే కనిపిస్తోంది. కాగ్ పొందుపరిచిన 2019 నుంచి 2023 వరకు ఉన్న నాలుగు ఆర్థిక సంవ్సరాల నివేదికలు పరిశీలిస్తే బడ్జెట్ అంచనాలకు, వాస్తవ ఆదాయ, వ్యయాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో వివిధ స్కీములకు కేటాయించిన నిధులు సరిగ్గా ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విషయాన్ని 2023-24 బడ్జెట్ కేటాయింపులు, రివైజ్డ్‌ ఎస్టిమేషన్లో తేడాలే చెబుతున్నాయి. 2019-20 బడ్జెట్లో రూ.1.13 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంటే వచ్చిన ఆదాయం రూ.1.02 లక్షల కోట్లు మాత్రమే. సెంట్రల్ షేర్‌తో కలిపి ట్యాక్స్ రెవెన్యూ ఆదాయం రూ.89,047 కోట్లు అంచనా వేయగా వాస్తవంగా వచ్చింది రూ.83,585 కోట్లు మాత్రమే. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రూ.15,975 కోట్లు అంచనా వేయగా వాస్తవంగా వచ్చిన రెవెన్యూ రూ.7,360 కోట్లు మాత్రమే. దీంతో ప్రభుత్వ నిర్వహణకు ఖర్చులు చాలక రూ.24 వేల కోట్ల రుణాలు తీసుకుందామని అంచనా వేసి అదనంగా రూ.7 వేల కోట్ల రుణం తీసుకున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా బడ్జెట్ రుణం రూ.31,759 కోట్లు తీసుకున్నారు. దీంతో వడ్డీ కిస్తీలు, జీతాలు, ఇతర రెగ్యులర్ ఖర్చులు మినహా మిగతావాటికి కేటాయింపులు తగ్గించినట్లు స్పష్టం అవుతోంది.

2020-21 ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటా ఆదాయం రూ.1.02 లక్షల కోట్లు అంచనా వేయంగా వాస్తవంగా వచ్చింది రూ.79,342 కోట్లు మాత్రమే. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రూ.30 వేల కోట్లు అంచనా వేస్తే వాస్తవంగా వచ్చింది కేవలం రూ.6,101 కోట్లు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్స్ రూ.10 వేల కోట్లు మాత్రమే వస్తాయని అంచనా వేస్తే రూ.15,471 కోట్ల వరకు వచ్చింది. అయినా ఆదాయం ఆశించినంత లేకపోవడంతో బడ్జెట్ అప్పులు రూ.33 వేల కోట్లు తీసుకుందామని అంచనా వేసి రూ. 49 వేల కోట్ల రుణం తీసుకున్నారు.
2021-22లో ట్యాక్స్ రెవెన్యూ వేసిన అంచనా కంటే 3 వేల కోట్లు అదనంగా వచ్చింది. కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ రూ.30,557 కోట్లు అంచనా వేస్తే వచ్చింది రూ.8,857 కోట్లు మాత్రమే. కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ రూ.38,669 కోట్లుగా అంచనా వేయగా రూ.8,619 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో రెవెన్యూ ఖర్చు రూ.1.69 లక్షల కోట్లు అంచనా వేసుకొని రూ. 1.36 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం గ్రాంట్స్ రూపంలో రూ.41 వేల కోట్లు అంచనా వేయగా వాస్తవంగా కేంద్రం ఇచ్చింది రూ.13 వేల కోట్లు మాత్రమే. నాన్ ట్యాక్స్ ఆదాయం రూ.25,422 కోట్లు అంచనా వేసి, భారీ ఎత్తున భూములు వేలం వేసినా వచ్చిన ఆదాయం 19,544 కోట్లే. ఇలా అంచనాలకు, వాస్తవ ఆదాయాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో రెవెన్యూ ఖర్చును రూ.1.89 లక్షల కోట్ల నుంచి రూ.1.53 లక్షల కోట్లకు తగ్గించాల్సి వచ్చింది. పెట్టుబడి వ్యయం రూ.29,139 కోట్లుగా అంచనా వేసి ఖర్చు చేసింది రూ.17,291 కోట్లు మాత్రమే.

రాష్ట్రానికి కేంద్రం పన్నుల్లో ఇచ్చే వాటా ఇప్పటి వరకు కనీసం నెలకు రూ.2 వేల కోట్లు కూడా నిండుగా ఇవ్వలేదని కాగ్ నివేదికను పరిశీలిస్తే అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పన్నుల్లో వాటాగా 2018-19లో రూ.18,561 కోట్లు, 2019-20లో 15,988 కోట్లు, 2020-21లో రూ.12,692 కోట్లు, 2021-22 లో రూ.18,721 కోట్లు, 2022-23లో రూ.19.668 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీనిని బట్టి పరిశీలిస్తే మన దగ్గర నుంచి తీసుకువెళుతున్న ఆదాయంలో నుంచి 40 శాతం వరకు మాత్రమే విడుదల చేస్తున్నారని అర్థమవుతున్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు.
అంచనాలకు, వాస్తవ ఆదాయానికి తేడాలు ఉండడంతో ఆయాశాఖలకు చేసిన కేటాయింపులు కూడా తగ్గించాల్సి వస్తోంది. ఈ మేరకు 2023-24 బడ్జెట్ రివైజ్డ్ పద్దులను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను భారీ ఎత్తున నిర్మించాలని భావించిన నాటి సర్కారు బడ్జెట్లో రూ.13,428 కోట్లు కేటాయించింది. కానీ వాస్తవంగా ఖర్చు చేసింది రూ.1,723 కోట్లు మాత్రమే. కేటాయించిన నిధులు హౌసింగ్ శాఖ నిర్వహణకే సరిపోని పరిస్థితి. పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు కేటాయించి, రూ.7,441 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పంచాయతీ రాజ్ శాఖకు రూ.30.976 కోట్లు కేటాయించి, రూ.23,997 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీంతో రాష్ట్రంలో చాలా మంది సర్పంచులు తాము చేసిన పనులకు బిల్లులు రాలేదని వాపోతున్నారు. దళిత బంధు స్కీమ్ అమలు కోసం షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖకు రూ. 21,072 కోట్లు కేటాయించారు. కానీ వాస్తవంగా ఇచ్చింది రూ.2,265 కోట్లు మాత్రమే. దీంతో దళిత బంధు పథకం అమలు అటకెక్కింది. ఇలా కేటాయింపులకు వాస్తవ లెక్కలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. బడ్జెట్ పద్దులో వాస్తవ ఆదాయం ఆధారంగానే కేటాయింపులు ఉండాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.