CAG Report | ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రేవంత్‌ సర్కార్‌ బోల్తా.. ఇలాగైతే కష్టమే!

ఆదాయం పెంపు మార్గాల‌పై దృష్టి పెట్టకపోవడంతోనే ప్ర‌తి ఏటా ఆదాయం ప‌డిపోతున్నదన్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్న‌ది. ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి నెల‌లోనే భారీగా రెవెన్యూ లోటు రావ‌డం అసాధార‌ణ‌మైన‌ది. ఇది ఆందోళ‌న క‌లిగించే అంశ‌మ‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

CAG Report | ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రేవంత్‌ సర్కార్‌ బోల్తా.. ఇలాగైతే కష్టమే!

CAG Report | ‘ఆదిలోనే హంస‌పాదు’ అన్న‌ట్లుగా రేవంత్ రెడ్డి స‌ర్కారుకు 2025-26 ఆర్థిక సంవ‌త్సరం ప్రారంభంలోనే బోణీ స‌రిగాలేదు. చిల్ల‌ర ఖ‌ర్చుల‌కు న‌క‌న‌కలాడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వ‌చ్చే ఆదాయానికి చేసే ఖ‌ర్చుకు పొంత‌న లేదు. ఆల‌స్యంగానైనా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ నెల అయిన ఏప్రిల్‌-2025 జ‌మా ఖ‌ర్చులను కాగ్‌కు జూన్‌లో స‌మ‌ర్పించింది. వాటిని ప‌రిశీలిస్తే మొద‌టి నెల‌లోనే రూ.4023.11 కోట్ల రెవెన్యూ లోటు ఉన్న‌ట్లు రిపోర్ట్ స్ప‌ష్టం చేసింది. ఖ‌ర్చుల‌కు కోసం భారీ ఎత్తున అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. తెలంగాణ ప్ర‌భుత్వానికి ఏప్రిల్ నెల‌లో రూ.10,916 కోట్ల ఆదాయం వ‌స్తే రూ.16,466 కోట్లు ఖ‌ర్చు చేసింది. దీంతో ఖ‌ర్చుల‌కు డ‌బ్బులు లేక ఏకంగా రూ. 5230 కోట్ల అప్పు చేసింది. గ‌త ఏడాది ఏప్రిల్ నెల‌లో రూ.2246.62 కోట్ల అప్పు తెస్తే.. ఈ ఏడాది అది ఏప్రిల్‌లో అది రూ.5230 కోట్లు ఉండటం గ‌మ‌నార్హం. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ఏడాదికి బ‌డ్జెట్‌లో రూ.2,738 కోట్ల మిగులు చూపించింది. కానీ ఏప్రిల్‌లోనే ఏకంగా రూ.4,023 కోట్ల లోటులోకి వెళ్ల‌డం రాష్ట్ర ఆరోగ్య స్థితికి మంచిది కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

త‌గ్గిన ఆదాయం ఇలా..

రేవంత్ స‌ర్కారుకు ఖ‌ర్చులు భాగా పెరిగి ఆర్థిక లోటుతో 2025-26 ఆర్థిక‌ సంవత్సరం ప్రారంభ‌మైన‌ట్టు కాగ్ నివేదిక వెల్ల‌డిస్తోంది. ముఖ్యంగా సబ్సిడీలు అత్య‌ధికంగా పెరిగాయ‌ని, ప‌న్నుల ద్వారా వ‌చ్చే ఆదాయంతో పాటు, ప‌న్నేత‌ర ఆదాయం కూడా బాగా తగ్గిందని కాగ్ తెలియ‌జేసింది. 2024 ఏప్రిల్‌లో ప‌న్నుల ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వానికి రూ.11,464 కోట్ల ఆదాయం రాగా 2025 ఏప్రిల్‌లో రూ.10916 కోట్లు మాత్ర‌మే వ‌చ్చింది. గ‌త ఏడాది కంటే రూ.548 కోట్లు తగ్గిందని కాగ్‌ నివేదిక పేర్కొన్నది. ప‌న్నేత‌ర ఆదాయం గ‌త ఏడాది ఏప్రిల్‌లో రూ.354.71 కోట్లు రాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.253.60 కోట్లు మాత్రమే. గ‌త ఏడాదితో పోల్చితే.. రూ.101 కోట్లు త‌గ్గింది.

పెరిగిన ఖ‌ర్చు ఇలా..

ఖ‌ర్చులు మాత్రం అమాంతం పెరిగాయి. గ‌త ఏడాది ఏప్రిల్‌లో రూ.2777.29 కోట్లు ఉన్న రెవెన్యూ ఖ‌ర్చు ఈ ఏడాది రూ.3275.49 కోట్ల‌కు పెరిగింది. వ‌డ్డీ చెల్లింపులు సైతం రూ.1865.15 కోట్ల నుంచి రూ.2260.70 కోట్ల‌కు పెరిగాయి. ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌నాలు గ‌త ఏడాది రూ.3847.17 కోట్లు చెల్లించ‌గా కొత్త‌ నియామకాలతో ఈ ఏడాది రూ.3968.42 కోట్ల‌కు పెరిగాయి. పెన్ష‌న్ల చెల్లింపులు గ‌త ఏడాది రూ.1331.75 కాగా ఈ ఏడాది రూ.1569.86 కోట్ల‌కు పెరిగాయి. ఈ ఏడాది చాలా మంది ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌డం వ‌ల్ల పెన్ష‌న్ల చెల్లింపు సంఖ్య ప్ర‌తి నెల పెరిగే అవ‌కాశం కనిపిస్తున్నది. ఆదాయ‌మే లేని ప్ర‌స్తుత ప‌రిస్థితిలో స‌బ్సిడీల ఖ‌ర్చు ఏప్రిల్ నెల‌లో అమాంతం పెరిగింది. గ‌త ఏడాది ఏప్రిల్‌లో స‌బ్సిడీల‌ భారం రూ.976.97 కోట్లు కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా నాలుగు రెట్లు పెంచి రూ.4,187.73 కోట్లు ఖ‌ర్చు చేశారు.

క్యాపిట‌ల్ ఎక్స్‌పెండేచర్‌పై భారీ త‌గ్గిన నిధులు

ఖ‌ర్చులు అమాతం పెర‌గ‌డంతో రేవంత్ స‌ర్కారు క్యాపిట‌ల్ ఎక్స్‌పెండేచ‌ర్‌పై బాగా త‌గ్గించింది. సంప‌ద సృష్టించాలంటే ఏ ప్ర‌భుత్వాలైనా క్యాపిట‌ల్ ఎక్స్‌పెండేచ‌ర్‌పైనే ఎక్కువ ఖ‌ర్చు చేయాలి కానీ దీనికి విరుద్దంగా ప్ర‌స్తుత ఖ‌ర్చుల విధానం ఉంది. గ‌త ఏడాది ఏప్రిల్ నెల‌లో మూల ధన పెట్టుబడి రూ.3060.09 కోట్లు ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.1134.69 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింది. ఇది రూ.36,500 కోట్ల వార్షిక క్యాపిట‌ల్ ఎక్స్‌పెండేచ‌ర్ లక్ష్యంలో 3.3 శాతం మాత్ర‌మే. గ‌త ఏడాది కంటే అమాంతం రూ.1925.40 కోట్ల నిధుల ఖ‌ర్చు త‌గ్గించింది. ఇది ఎంత మాత్రం మంచిది కాద‌ని, తెలంగాణ సంప‌ద సృష్టికి స‌ర్కారే అడ్డుగా ఉందా? అన్న సందేహం క‌లిగేలా ఉంద‌ని ఆర్థిక నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఆదాయం బాగా ప‌డిపోవ‌డంతో ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో రూ. 5,230 కోట్ల అప్పు తెచ్చిన స‌ర్కారు, అప్పు తీర్చింది మాత్రం రూ.7.36 కోట్లే. గ‌త ఏడాది ఇదే నెల‌లో రూ.150.10 కోట్ల అప్పు తీర్చిన విష‌యాన్ని కాగ్ గుర్తు చేసింది.

లక్ష్యానికి ఆమ‌డ దూరంలో…

రాష్ట్ర ప్ర‌భుత్వం 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో రెవెన్యూ ఆదాయం ల‌క్ష్యం రూ. 2.29 ల‌క్ష‌ల కోట్లుగా పెట్టుకున్న‌ది. దీని ప్ర‌కారం ప్ర‌తి నెల రూ.19 వేల కోట్ల‌కు పైగా ఆదాయం రావాలి. కానీ మొద‌టి నెల‌లోనే భారీగా ప‌డిపోయి రూ.10916 కోట్లు మాత్ర‌మే వ‌చ్చింది. ఇది వార్షిక ఆదాయం ల‌క్ష్యంలో 4.89 శాతంగా ఉన్న‌ట్లు కాగ్ తెలిపింది. ప‌న్నేత‌ర ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉన్న‌ది. పైగా మోదీ స‌ర్కారు క‌క్షపూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో కేంద్రం నుంచి వ‌చ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా రెండెంకెలు దాట‌డం లేద‌ని కాగ్ నివేదిక ద్వారా స్ప‌ష్టం అవుతున్న‌ది.

దిద్దుబాటు చ‌ర్య‌లు లేకుంటే..

సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్లుగా క‌ఠిన‌మైన ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పాటించ‌కుంటే తెలంగాణ ఆర్థిక ప‌రిస్థితి ఘోరంగా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. పైసా అప్పు తేన‌న్న రేవంత్ అదే మాట మీద నిల‌బ‌డి వ‌చ్చిన ఆదాయం మేర‌కు ఖ‌ర్చులు చేయాల‌ని సూచిస్తున్నారు. ఆదాయం పెంపు మార్గాల‌పై దృష్టి పెట్టకపోవడంతోనే ప్ర‌తి ఏటా ఆదాయం ప‌డిపోతున్నదన్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్న‌ది. ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి నెల‌లోనే భారీగా రెవెన్యూ లోటు రావ‌డం అసాధార‌ణ‌మైన‌ది. ఇది ఆందోళ‌న క‌లిగించే అంశ‌మ‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విస్ఫోటం తరహాలో స‌బ్సిడీ వ్య‌యం పెర‌గ‌డం, ఎక్సైజ్‌, నాన్ టాక్స్ వంటి సొంత ఆదాయాలు త‌క్కువ‌గా న‌మోదు కావ‌డం అనేది ఆర్థిక రంగంలో తుఫాన్ సృష్టించే అంశాలని అంటున్నారు. ఏప్రిల్ నివేదికను ప‌రిశీలిస్తే అప్పులు పెర‌గ‌డం వ‌ల్ల క్రెడిట్ రేటింగ్‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంటుంద‌ని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు.