• Telugu News
  • /National

Orderly System | ఆ రాష్ట్రంలో ఆర్డర్లీ విధానం రద్ధు.. వేల మంది పోలీసులకు ఉపశమనం..

ఆర్డర్లీ సిస్టమ్‌! కానిస్టేబుళ్లతో ఉన్నతాధికారులు గొడ్డు చాకిరీ చేయించుకునే దుర్మార్గమైన వ్యవస్థ. బ్రిటిష్‌ వలస పాలన నుంచి కొనసాగుతున్న ఈ వ్యవస్థను రద్దు చేస్తూ కర్ణాటక పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆ విధుల్లో ఉన్నవాళ్లు తమ తమ పోలీస్‌ స్టేషన్లలో రిపోర్ట్‌ చేయాలని సూచించింది.

Reported by: Jagan Mohan Talluri | జాతీయం | Mar 07, 2026, 4:42 pm IST
Read Time: 6 mins
Orderly System | ఆ రాష్ట్రంలో ఆర్డర్లీ విధానం రద్ధు.. వేల మంది పోలీసులకు ఉపశమనం..

Orderly System | బ్రిటిష్ వారసత్వంగా పోలీసు శాఖలో కొనసాగుతున్న ఆర్డర్లీ వ్యవస్థకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చరమగీతం పాడింది. ప్రధాన సంస్కరణల్లో భాగంగా ఈ బానిస విధానాన్ని రద్ధు చేశారు. పోలీసు బలగాలను ఆధునీకరించడం, సిబ్బంది గౌరవాన్ని మరింతగా పెంపొందించేందుకు ఈ ముఖ్యమైన అడుగు వేస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటించింది. దీంతో వేలాది మంది పోలీసులకు ఉపశమనం లభించనుంది.

దేశానికి స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ వాళ్లు తమ పాలనలో ఆర్డర్లీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా అదే విధానాన్ని అమలు చేస్తూ పోలీసు సిబ్బంది చేత పైస్థాయి అధికారులు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. పోలీసు బాధ్యతలను నిర్వర్తించేందుకు, ప్రజలకు రక్షణ కల్పించేందుకు నియమితులైన సిబ్బంది… అధికారుల ఇళ్లల్లో ఇంటి పనులు, వంట పనులు, ఇతరత్రా పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఒక్క పని కాకుండా తమకు నచ్చిన విధంగా సిబ్బందితో పనులు చేయించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉదయం మొదలు సాయంత్రం వరకు పనులు చేస్తూ, అసలు ఉద్యోగం ఏంటనేది తెలియని స్థాయికి వెళ్లిపోతున్నారు. వంట పాత్రలు శుభ్రం చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, వంట పనులు చేయడం, అధికారి ఇంటికి వచ్చిన వారికి టీ, కాఫీలు, టిఫినీలు అందించడం, భోజనం వడ్డించడం, పిల్లలను పాఠశాలకు లేదా కళాశాలకు తీసుకు వెళ్లడం, అధికారులు షాపింగ్ కు వెళ్తే వారి వెంట వెళ్లడం ఇలా ఎన్నో పనులను వీరితో చేయించుకోవడంతో పదవీ దర్పంగా మారింది.

ఈ వెట్టి చాకిరిపై పౌర సమాజం నుంచి విమర్శలు ఎదురవుతున్నా పోలీసు శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. శిక్షణ పొందిన అధికారుల వ్యక్తిగత పనులకు ఉపయోగించరాదని వాదించినా విన్పించుకునే నాధుడు లేకుండా పోయారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ విధానం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ కోసం నియమితులు అయిన వారు ఆర్డర్లీ వ్యవస్థకు మళ్లించడంతో పోలీసు శాఖలో పనితీరు పలుచబడింది.

కర్ణాటక పోలీసు శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,320 మంది పోలీసు సిబ్బంది అధికారుల ఇళ్లలో ఆర్డర్లీగా పనిచేస్తున్నారు. వీరందరినీ తిరిగి వారివారి స్టేషన్లకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసు అధికారుల వ్యక్తిగత అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక పోస్టులను మంజూరు చేయాలని, వీటిని పోలీసులతో కాకుండా వేరే సిబ్బందితో భర్తీ చేయాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది వారి బాధ్యతలు నిర్వర్తించాలని, ఇకపై ఆర్డర్లీ వ్యవస్థలో పనిచేయవద్దని స్పష్టం చేశారు. కానిస్టేబుళ్లను ఈ దుర్మార్గమైన వ్యవస్థ నుంచి విముక్తి కల్పించడం ద్వారా పోలీసు శాఖలో సామర్థ్యం, నైతికత పెరుగుతుందని పౌర సమాజం పేర్కొంది.

Read Also |

Karnataka New Excise Policy | ఇకపై లిక్కర్‌లో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ట్యాక్స్‌!
Banana Cultivation | రెండున్న‌ర ఎక‌రాల్లో 70 ట‌న్నుల అర‌టి పండ్ల ఉత్ప‌త్తి.. ఏడాదిలోపే రూ. 12 ల‌క్ష‌ల ఆదాయం
Gold | ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం! దుబాయ్‌లో.. బంగారంపై భారీ డిస్కౌంట్లు!