అందరూ లొంగిపోండి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం వారికి భరోసా, ప్యాకేజీ హామీ ఇచ్చారు.
విధాత, హైదరాబాద్ : అజ్ఞాతంతో ఉన్న మావోయిస్టులు అంతా లొంగిపోవాలని..వారి లొంగుబాటుకు, సహాయ పునరావాలసాకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు . కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎదుట 124మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై హింసకు తావులేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హింసాత్మక చర్యల ద్వారా ఏమీ సాధించలేరని చెప్పారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేలా రాష్ట్ర పోలీసులు కృషి చేశారని, లొంగుబాటు ప్రక్రియపై మావోయిస్టుల్లో ఒక నమ్మకాన్ని కలిగించారని కితాబిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
అహింసా పద్ధతిలోనే బ్రిటీషర్లపై పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్న చరిత్ర మనదని, హింస, ఆయుధాలతో పోరాటం ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదని మహాత్మం గాంధీ చాటి చెప్పారు అని గుర్తు చేశారు. అణ్వాయుధాలు ఉన్న దేశాలు కూడా ఇవాళ చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటున్నాయని అన్నారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు అంతా లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసురావాలని సూచించారు. దేవ్‌జీ, ఆయన మిత్రబృందం కొన్ని ప్రతిపాదనలు చేసింది అని, తమ సమస్యలు పరిష్కరిస్తే లొంగిపోతామని వాళ్లు చెప్పారు అని, రాష్ట్ర స్థాయిలో మేము చేయగలిగింది చేస్తామని చెప్పాను అని, మావోయిస్టు నేతల డిమాండ్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించడం జరిగిందని వెల్లడించారు.
లొంగిపోయిన వారి మెరుగైన జీవితానికి హామీ ఇవ్వాలని అమిత్ షా మాకు సూచించారు అని, ఆయనతో చర్చల తర్వాత మావోయిస్టు నేతలతో మళ్లీ చర్చించానని, మా చర్చల అనంతరం ఒకేసారి 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకేసారి ఇంతమంది మావోయిస్టులు ఏ రాష్ట్రంలోనూ లొంగిపోలేదు. మావోయిస్టు పార్టీ సుప్రీం ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి సహా మిగిలిన ఏడుగురు మావోయిస్టులు కూడా వీలైనంత త్వరగా లొంగిపోవాలి. వారి రక్షణకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తాం. నగదు బహుమతిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వర్గాల నిఘా ఉంటుంది అని, అంతా లొంగిపోవడం మంచిదని స్పష్టం చేశారు. లొంగిపోయిన వారి హోదాలను బట్టి ప్యాకేజీ కల్పిస్తామని, స్వగ్రామాల్లో ఇల్లు కట్టుకునేవారికి సాయం చేస్తాం అని, మెరుగైన పరిహారం, ఆరోగ్యం, ఇంటి నిర్మాణానికి సాయం చేస్తాం అని తెలిపారు. రాష్ట్రంలో భూమి లభ్యత కష్టంగా ఉన్నందునా భూమి ఇవ్వడంపై హామీ ఇవ్వలేనన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయి 250 ఆయుధాలను సరెండర్ చేశారు అని వెల్లడించారు.
డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు అని తెలిపారు. వీరిలో తెలంగాణ స్టేట్ కమిటీ నుంచి ఐదుగురు లొంగిపోవడంతో ఇక రాష్ట్ర కమిటీ చరిత్రలో మిగిలిపోనుంది అన్నారు. దేశవ్యాప్తంగా తుపాకీ ద్వారానే మార్పు వస్తుందని తెలంగాణ నాయకుల నేతృత్వంలో పోరాటం కొనసాగించిన మావోయిస్టు పార్టీకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ లేకుండా పోయింది అని గుర్తు చేశారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు సంబంధించిన వారు ఇతర కమిటీలన్నింటిలో కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారని వారు కూడా త్వరగా సరెండర్ కావాలని పిలుపునిచ్చారు.
లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు అని వెల్లడించారు. లొంగిపోయిన వారు ఒక ఇన్ సాస్ ఎల్ఎంజీ రైఫిల్, 31 ఏకే-47 రైఫిళ్లు, 21)ఇన్‍సాస్ రైఫిళ్లు, 20 ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, (18) 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులను ప్రభుత్వానికి అప్పగించారు అని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
AI Goldman Sachs | కృత్రిమ మేధతో పోయే ఉద్యోగాలు ఏటా గరిష్ఠంగా 40 లక్షలు.. కానీ..
Orderly System | ఆ రాష్ట్రంలో ఆర్డర్లీ విధానం రద్ధు.. వేల మంది పోలీసులకు ఉపశమనం..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram