CM Revanth Reddy | కమ్మ, రెడ్ల సయోధ్యే లక్ష్యం.. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణకు యత్నాలు

రాజకీయ పునరేకీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కమ్మల మద్దతు సాధించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారా? కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌ (కేజీఎఫ్‌) సదస్సులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమేనా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు

CM Revanth Reddy | కమ్మ, రెడ్ల సయోధ్యే లక్ష్యం.. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణకు యత్నాలు

తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆరెస్‌ పక్షాన నిలిచిన సెటిల‌ర్లు
వారిని కాంగ్రెస్‌వైపు తిప్పుకొనే యోచన
కమ్మల వ్యాపారాలు, సంస్థలు అమరావతికి వెళ్లకుండా అడ్డుకునే యత్నం
ఇక్కడే వ్యాపారాలు చేసుకోవచ్చునని రేవంత్‌ భరోసా
అందుకే కేజీఎఫ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి

విధాత: రాజకీయ పునరేకీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కమ్మల మద్దతు సాధించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారా? కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌ (కేజీఎఫ్‌) సదస్సులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమేనా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆరెస్‌తో ఉన్న సెటిలర్లను తమవైపు తిప్పుకొనే కార్యక్రమాలను వేగవంతం చేశారన్న చర్చ జరుగుతున్నది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ఒక బలమైన పార్టీగా టీడీపీ ఉన్నది. ఆంధ్రా సెటిలర్లు మెజార్టీగా టీడీపీతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీడీపీతో ఉన్న సెటిలర్లతో పాటు టీడీపీ నేతలు మెజార్టీగా బీఆరెస్‌లో చేరారు. టీడీఎల్పీని బీఆరెస్ ఎల్పీలో విలీనం చేశారు.

బీఆరెస్‌లో చేరడానికి ఇష్టం లేని రేవంత్ రెడ్డి, సీతక్క, వేం నరేందర్ రెడ్డి లాంటి నాయకులు తరువాత కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే రాష్ట్ర ఏర్పాటు నుంచి 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీఆరెస్‌తో ఉండి తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలు పొందిన సెటిలర్లు, ముఖ్యంగా కమ్మలు తాజాగా కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాజకీయంగా బలం పెంచుకునే పనిలో రేవంత్ ఉన్నారు. ఈ మేరకు రాజకీయ శక్తుల పునరేకీకరణలో భాగంగా తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల్లో సెటిలైన కమ్మ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలబెట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే బీఆరెస్ నుంచి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన అరికెపూడి గాంధీని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. మిగతా ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

వ్యాపారాలు అమరావతికి తరలకుండా వ్యూహం

తెలంగాణలో వివిధ రంగాలలో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్న కమ్మ పెట్టుబడిదారులను కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. వారు ఇక్కడే వ్యాపారాలు చేసుకోవచ్చునన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అందుకే హైదరాబాద్ కేంద్రంగా జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్( కేజీఎఫ్) కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారని, కమ్మలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. కమ్మలకు రెడ్లు వ్యతిరేకం కాదనే సంకేతాన్ని ఇచ్చారు. కమ్మలు, రెడ్లు కలిసి సయోధ్యగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకుందామన్న సందేశాన్ని ఇచ్చారు.

ఏపీలో కమ్మ, రెడ్ల మధ్య విభేదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రోడ్లకు, కమ్మలకు మధ్య తీవ్ర వైరుధ్యాలున్నాయి. అక్కడి రాజకీయాలు మెజార్టీగా కులాల ప్రాతిపదికన జరుగుతాయన్నది బహిరంగ రహస్యమే. అయితే తెలంగాణలో అలాంటి వైరుధ్యాలు లేవన్న సంకేతాన్ని రేవంత్ రెడ్డి ఇచ్చారని అంటున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కమ్మలు తమ వ్యాపారాలను ఇకపై అమరావతి కేంద్రంగా చేస్తారన్న చర్చ కూడా ఉంది. ఇదే జరిగితే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌తోపాటు ఇతర వ్యాపారాలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో కమ్మలకు, ఇతర ఆంధ్రా సెటిలర్లకు ఇక్కడ వ్యాపారాలు నిక్షేపంగా చేసుకోవచ్చునని, తమ మద్దతు ఉంటుందన్న సంకేతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆ సమావేశానికి హాజరవడం ద్వారా ఇచ్చారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది.