Maganti Sunitha | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు: బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత బరిలోకి దిగనున్నారు. కేటీఆర్ పరిచయం చేస్తూ పార్టీ విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు.

Maganti Sunitha | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు: బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత?

జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను గులాబీ పార్టీ బరిలోకి దింపనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం బుధవారం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో గోపినాథ్ సతీమణి సునీత కూడా పాల్గొన్నారు. సునీతను పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిచయం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ నుంచి 30 వేల ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ ను గెలిపించడమే మాగంటి గోపినాథ్ కు నివాళి అని ఆయన అన్నారు. సునీతకు మీ అందరి ఆశీస్సులు ఉంటాయని తాను భావిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. సునీత పేరును బీఆర్ఎస్ నాయకత్వం అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో పార్టీ పరిస్థితిపై నిర్వహించిన సర్వేకు సంబంధించిన రిపోర్టును ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఒకటి రెండు డివిజన్లలో మినహా మిగిలిన డివిలజన్లలో బీఆర్ఎస్ ముందంజలో ఉందని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని నిలబెట్టుకోవాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. వెనుకబడిన డివిజన్లలో ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

ఈ ఏడాది జూన్ 8న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక కోసం పార్టీ శ్రేణులను గులాబీ పార్టీ సన్నద్దం చేస్తోంది. డివిజన్ల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తోంది. అంతేకాదు ఆయా డివిజన్లను పార్టీ కీలక నాయకులను ఇంచార్జీలుగా నియమించింది. ఆయా డివిజన్లలో పార్టీ పరిస్థితి వంటి పరిణామాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి నాయకత్వానికి ఇంచార్జీలు నివేదికలు అందిస్తున్నారు. మరో వైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆ పార్టీ సర్వేలు నిర్వహిస్తోంది. దాని ఆధారంగా ఎన్నికల వ్యూహాలను సిద్దం చేస్తోంది.